తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
x

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ నివాళి అర్పించిన తర్వాత సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.


తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ నివాళి అర్పించిన తర్వాత సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య నందితకి సభలోని సభ్యులందరూ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సాయన్న కుటుంబం చేసిన సేవలు మరువలేనివన్నారు. జనం గుండెల్లో ఆ కుటుంబానికి శాశ్వత స్థానం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. లాస్య నందిత తండ్రి, దివంగత నేత సాయన్న కుటుంబంతో ఆయనకి ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

సాయన్న మరణం తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను కలిచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, ఆ ప్రాంతం జీహెచ్ఎంసీలో విలీనమవుతోన్న ప్రస్తుత సందర్భంలో సాయన్న, వారి కూతురు లాస్య నందిత మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు. సాయన్న కుటుంబం ఆశయాలను ముందుకు తీసుకెళతామన్నారు. కాగా, లాస్య నందిత మృతిపై సంతాప తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

సాయన్న కుటుంబాన్ని విధి పగబట్టింది...

లాస్య నందిత సంతాప తీర్మానంలో కేటీఆర్ మాట్లాడుతూ... లాస్య నందిత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం. కానీ, ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్దిరోజులకే ఆమె మరణించడం బాధాకరమన్నారు. సాయన్న కుటుంబాన్ని చూస్తుంటే విధి పగబట్టిందేమో అనిపిస్తుంది. సాయన్న, లాస్య నందిత ఓకే ఏడాదిలో దుర్మరణం చెందడం ఆవేదన కలిగించే అంశాలని కేటీఆర్ అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే గెలిచిన సాయన్న మృదుస్వభావి, ఆయన అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి కష్టపడ్డారని కొనియాడారు.

సాయన్న ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇద్దరు కుమార్తెలు లాస్య నందిత, లాస్య నివేదిత ఆయనకి కుడి భుజం, ఎడమ భుజంలా మెలిగారని కేటీఆర్ చెప్పారు. ఇదే శాసనసభలో కేసీఆర్ సీఎంగా సాయన్న సంతాప తీర్మానం ప్రవేశపెట్టడమే కాకుండా.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. "ఇచ్చిన మాట ప్రకారం 2023 ఎన్నికల్లో లాస్య నందితకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం. గెలుపొందిన కొద్ది రోజులకే నల్గొండలో మా పార్టీ సభ జరిగితే వచ్చింది, ఆ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ధ్వంసం అయినప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడింది. తర్వాత అవుటర్ రింగ్ రోడ్ లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. లాస్య నందిత మరణంతో ఆమె సోదరీ నివేదితకు ఉపఎన్నికల్లో టికెట్ ఇచ్చాం. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోయింది. లాస్య నందిత రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావించాం కానీ ఆమె సంతాప సభలో మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటాము. వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నామని" కేటీఆర్ మాట్లాడారు.

Read More
Next Story