Telangana Arogyasri | నిలచిన ఆరోగ్య శ్రీ సేవలు, అల్లాడుతున్న రోగులు
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయడంతో ఆసుపత్రుల్లో వైద్యం అందక రోగులు అల్లాడుతున్నారు.తమకు శస్త్రచికిత్సలు చేసి, కాపాడండి అంటూ రోగులు అభ్యర్థిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోవడంతో తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రోగులకు చికిత్సలను నిలిపివేసింది.పేదలకు అందాల్సిన ఆరోగ్య శ్రీ వైద్యానికి బ్రేక్ పడి పది రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి బకాయిల విడుదల గురించి స్పందన లేకపోవడంతో రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అందని ఆరోగ్య శ్రీ వైద్యసేవలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ వైద్యసేవల పరిమితిని రూ.10 లక్షలకు పెంచినా, బకాయిలతో అసలు వైద్యమే అందకుండా పోతోంది. ఆరోగ్యశ్రీతోపాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, జర్నలిస్ట్ హెల్త్ స్కీం కార్డులు పట్టుకొని రోగులు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా, సమ్మె పేరిట తమకు వైద్యం అందించడం లేదని హైదరాబాద్ నగరానికి చెందిన రోగులు రాపోలు సతీష్, పొన్నం సుచిత్రలు ఆవేదనగా చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల సమ్మె తమకు ప్రాణ సంకటంగా మారిందని వారు పేర్కొన్నారు.
అత్యవసర వైద్యం కోసం...
మూత్ర సంబంధ ఇన్పెక్షన్లతో బాధపడుతున్నతోట ఆదినారాయణ ఆరోగ్య శ్రీ కార్డు తీసుకొని చికిత్స కోసం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి రిసెప్షన్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసినట్లు బోర్డు చూసి డాక్టరును కలిసి తనకు అత్యవసర వైద్యం అందించాలని అభ్యర్థించారు. డాక్టరు మాత్రం సమ్మెలో ఉన్నామని చెప్పడంతో తీవ్ర ఆందోళన చెందారు. ఆరోగ్య శ్రీ పథకం కింద తాము గతంలో చేనిన చికిత్సలకు ఆరోగ్య శ్రీ ట్రస్టు డబ్బు చెల్లించలేదని ఖమ్మం నగరానికి చెందిన సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ గురునాథరావు చెప్పారు. అసలే తక్కువ ప్యాకేజీలతో ఆరోగ్య శ్రీ వైద్యం అందిస్తుంటే, ఆ బిల్లులు కూడా సకాలంలో ట్రస్టు చెల్లించడం లేదని డాక్టర్ ఆరోపించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ఓపీ
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచి పోవడంతో రోగులు అత్యవసర చికిత్సల కోసం రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల బాట పట్టారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రులు అవుట్ పేషంట్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సంఘటితంగా వైద్యసేవలు నిలిపివేసి, తమకు బకాయిలు పెంచాలని, తమ చికిత్సల ప్యాకేజీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రైవేటు ఆసుపత్రులు, అటు ప్రభుత్వం మొండి పట్టు పట్టడంతో వీరి నడుమ పేదరోగులు నానా అవస్థలు పడుతున్నారు.
ఆరోగ్య శ్రీ నిధులను విడుదల చేయండి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం నుంచి క్లెయిమ్‌లు రానందున అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు ఈ నెల 10వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సను నిలిపివేశామని తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాకేష్, డాక్టర్ విజయచందర్ రెడ్డి, డాక్టర్ నాగార్జున రెడ్డి తెలిపారు.ఆసుపత్రుల్లో వైద్యుల కన్సల్టేషన్ మొత్తాలను, జీతాలను చెల్లించలేనందున కన్సల్టెంట్‌లు పని చేయడానికి ఇష్టపడటం లేదని వారు పేర్కొన్నారు.గత ఆరు నెలలుగా ఆసుపత్రులు తమ మొత్తాన్ని చెల్లించలేక వైద్యం నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. తమ డిమాండ్లను ఆరోగ్యశాఖ మంత్రికి, ఆరోగ్యశ్రీ సీఈవోకు కూడా తెలిపామని వైద్యులు చెప్పారు.
రోగుల ఇబ్బందులను పట్టించుకోండి : మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పేద ప్రజలకు శాపంగా మారిందని వైద్యఆరోగ్య శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిన దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.‘‘ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్రానికి పట్టింపు లేకపోవడం దురదృష్టకరం.నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లు పరిష్కరించి, పెండింగ్ బకాయిలు చెల్లించి ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీష్ రావు ఎక్స్ లో పోస్టు పెట్టారు.
పదేళ్లు ఆరోగ్య శ్రీని నీరుగార్చారు : మంత్రి దామోదర్ రాజనర్సింహ
పదేళ్లు ఆరోగ్యశ్రీని నీరుగార్చి, ఇప్పుడు అదే పథకం గురించి మాట్లాడడం చూస్తుంటే.. దొంగే, దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరోపించారు.‘‘బీఆర్ఎస్ సర్కారు హయాంలో హాస్పిటళ్లకు డబ్బులు చెల్లించలేదు. ప్యాకేజీల ధరలు రివైజ్ చేయలేదు. రూ.730 కోట్లు బాకీ పెట్టి పోయారు.ఒక్కో సమస్యను మేము పరిష్కరిస్తున్నాం. పాత బకాయిలతో సహా రూ.1130 కోట్లు ఏడాదిలో చెల్లించినం’’అని మంత్రి వివరించారు.ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నామని,ప్యాకేజీల రేట్లు రివైజ్ చేసి, 22 శాతం మేర చార్జీలు పెంచామని మంత్రి పేర్కొన్నారు.
Next Story