నాటి మావోయిస్టు కోటలో అందమైన అమ్మవారి కలప ఆలయం...
x
కారడవి మధ్యలో వెలసిన మహంకాళీ కలప కోవెల

నాటి మావోయిస్టు కోటలో అందమైన అమ్మవారి కలప ఆలయం...

ఆదిలాబాద్ జిల్లా కారడవిలోని వాయిపేట్ గిరిజన గ్రామంలో వింత...అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన కలప ఆలయం...


దట్టమైన అడవి మధ్యలో పాలవాగు ఒడ్డున ఉంటుంది వాయిపేట్ గిరిజన గ్రామం. ఈ గ్రామంలో ఇపుడు ఒక అందమైన ఆలయం వెలసింది. గ్రామంలో ఆలయం నిర్మాణం కావడంలో వింతే ముంది? కాని, వాయిపేట్ లో ఆలయం నిర్మించడం. ఎందుకంటే, ఒక నాడు తుపాకులు మోగిన ఈ వాయిపేట్ గ్రామంలో (Dense Forest Vayupet Tribal Village) ఇపుడు గుడి గంట మోగుతున్నది. గ్రామంలో ఆద్భుత మైన ఆలయం వెలసింది.ఈ ఆలయం అంతా చెక్కతోనే నిర్మించారు. అందమైన నగిషీ పనితో తయారైన ఈ ఆలయం అడవికే ఆకర్షణ. అందుకే అది వాయిపేట్ గిరిజన గ్రామం వింత.ఇదేమిటో చూద్దాం.

ఒకప్పుడు నక్సల్స్ కోటగా పేరొందిన వాయిపేట్ అటవీ గ్రామంలో కాలక్రమేణా మావోయిస్టుల(Naxals) ప్రాబల్యం తగ్గింది. దీంతో ఆ గ్రామ గిరిజనుల్లో ఒకడైన కినక శంభు మహరాజుగా అవతారం ఎత్తి గ్రామస్థుల సహకారంతో పూర్తిగా కలపతో మహంకాళీ ఆలయాన్ని(Mahankali Temple) నిర్మించాడు.
అంతే నాడు నక్సల్స్ రాజ్యంలో పోలీసు తుపాకీ తూటాల శబ్దాలు విన్న వాయిపేట్ గ్రామ గిరిజనులు నేడు అమ్మవారి కోవెలలో చేగంట మోగిస్తున్నారు.నిత్యం పూజలు చేస్తుండటంతో అమ్మవారి జపంతో గ్రామం మార్మోగుతోంది. నక్సల్స్ వెళ్లి పోయాక ప్రజలు ఆధ్యాత్మికత వైపు వెళ్లడం కాలక్రమంలో వచ్చిన మార్పు అని ఇంద్రవెల్లి ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జి నర్సయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



మావోయిస్టుల సభపై పోలీసుల కాల్పులు...

అది 1997వ సంవత్సరం ఏప్రిల్ 18వతేదీ...నాడు ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఇంద్రవెల్లి ప్రాంత మారుమూల కారడవిలో ఉన్న వాయిపేట్ గ్రామ శివార్లలో ప్రస్థుత మావోయిస్టులు...అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ కార్యదర్శి సూర్యం ఆధ్వర్యంలో అమరుల సంస్మరణ సభ జరుగుతుంది. ఈ సభకు నక్సల్స్ పిలుపుతో ఇంద్రవెల్లి, సిరికొండ, ఖానాపూర్, ఇచ్చోడ, నేరడిగొండ ప్రాంతాల ప్రజలు తరలి వచ్చారు. చుట్టూ ఎతైన చెట్ల మధ్య విప్లవగీతాలు పాడుతూ నక్సలైట్లు నిర్వహించిన అమరుల సంస్మరణ సభ కాస్తా సాయుధ పోలీసుల రంగప్రవేశంతో రణరంగంగా మారింది. నాడు పోలీసులు జరిపిన కాల్పులతో అడవిలో చెట్టుకొకరు పుట్టకొకరుగా నక్సలైట్లు, ప్రజలు అడవిలోనే పరుగులంకించుకున్నారు. వాయిపేట్ గ్రామ గిరిజనులు నక్సల్స్ కు ఆశ్రయం ఇస్తూ భోజనం పెడుతున్నారని అప్పట్లో పోలీసులు ఆ గ్రామాన్నే టార్గెట్ చేశారు. కాని కాలక్రమేణా మావోయిస్టులు తెర మరుగుకాగా , విప్లవగీతాలు (Revolutionary Songs) పాడుకున్న వాయిపేట్ గ్రామంలో గిరిజనులు నేడు భక్తీ గీతాలు (Devotional Songs) ఆలపిస్తూ అమ్మవారికి పూజలు చేస్తున్నారు.



ఆదివాసీలు..మహంకాళీ ఆరాధికులు

పచ్చని ఎతైన చెట్లతో కూడిన కారడవి ప్రాంతం...గలగలా సవ్వళ్లతో పారుతున్న పాలవాగు...నీటి గలగలలతో కూడిన వాయుపేట పెద్ద చెరువు సమీపంలో వెలసింది వాయిపేట్ గిరిజన గ్రామం. ఈ గిరిజన గ్రామంలో వందశాతం గిరిజన తెగలైన గోండు, నాయక్ పోడు గిరిజనులు నివాసముంటున్నారు. ఈ కుగ్రామంలోని ఆదివాసీలంతా మహంకాళీ ఆరాధికులు. 2023వ సంవత్సరంలో పూర్తిగా కలపతో నిర్మిస్తున్న మహంకాళీ ఆలయం నిర్మాణ పనులు మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ఆలయ పూజారి కినక శంభు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



కారడవిలో కలప ఆలయం ఎలా వెలసిందంటే...

మారుమూలన దట్టమైన అడవి మధ్యలో ఉన్న వాయిపేట్ గ్రామానికి కొందరు భక్తులు జ్యోతి రూపంలో దీపాలను తీసుకువచ్చారు. అమ్మవారు తమ గ్రామానికి వచ్చినట్లు ఈ గ్రామానికి చెందిన కినక శంభుకు కల వచ్చింది. ఆ కలలో అమ్మవారు కనిపించారని శంభు చెప్పారు.గతంలో తమ గ్రామంలో చిన్న గుడిసెలో మహంకాళీ మందిరం ఉండేది. శంభు పర్యటనలో నేపాల్ దేశంలోని ఖాట్మండు నగరంలో పూర్తిగా కలపతో నిర్మించిన ఆలయాన్ని చూశారు. అంతే వాయిపేట్ గ్రామానికి తిరిగి వచ్చాక శంభు స్థానికుల సహకారంతో గ్రామంలో పూర్తిగా కలపతో 2023వ సంవత్సరంలో మహంకాళీ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు.



కలప కోవెల ప్రత్యేకత

అడవి మధ్యలో పూర్తిగా కలపతో నిర్మిస్తున్న మహంకాళీ కలప కోవెలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ వినూత్న ఆలయంలో 26 పెద్ద స్తంభాలు, గర్భగుడి, ఎతైన ఆలయ గోపురం, ప్రధాన ద్వారం, ఆలయ గోడలు ఇలా ఒకటేమిటి ఆలయం మొత్తాన్ని కలపతోనే నిర్మించారు. అడవిలో చెట్లను నరకకుండా వర్షాలకు నేలకొరిగిన దుంగలను తీసుకువచ్చి వాటిపై దేవతామూర్తులు, పశువులు, వన్యప్రాణుల చిత్రాలను చెక్కి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం కోసం తాము ఒక్క చెట్టును కూడా నరకలేదని, వర్షాలు,అగ్నిప్రమాదాల్లో నేలకూలిన చెట్ల దుంగలను తీసుకువచ్చి స్థానిక వడ్రంగులతోనే ఈ ఆలయాన్ని నిర్మించామని కినక శంభు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



నాడు వేటగాడు...నేడు మహరాజు

వాయిపేట్ గ్రామ అడవుల్లో నిత్యం జంతువులను వేటాడుతూ పాముల నుంచి కప్పలు, వివిధ రకాల జంతువులను వేటాడి ఆ మాంసాన్ని తినే కినక శంభు మహంకాళీ అమ్మ వారికి కలప కోవెల నిర్మాణం తర్వాత మాంసాహారాన్ని మానేశారు. పూర్తి గా అమ్మవారి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ శంభు మహరాజుగా పేరొందారు. అమ్మవారి సన్నిధిలో కినక శంభు ఆదివారం మంగళవారాల్లో దేవాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చొని నిరంతరం పూజలు చేస్తున్నాడు. నిరక్షరాస్యుడైన శంభుకు ఎలాంటి మంత్రాలు రాకున్నా నిత్యం అమ్మవారిని స్మరించుకుంటూ ఆమె సన్నిధిలోనే ఆధ్యాత్మిక భావంతో గడుపుతున్నాడు. తన ఖాళీ సమయాల్లో అడవిలో సంచరిస్తూ వివిధ రకాల ఔషధ మొక్కలను తీసుకువచ్చి వాటిని అనారోగ్యానికి గురైన భక్తులకు ఉచితంగా ఇస్తున్నాడు.



భక్తులతో కిటకిటలాడుతున్న కలప కోవెల

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్ కారడవిలో మొత్తం కలపతో నిర్మించిన మహంకాళీ కలప ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఆదిలాబాద్ జిల్లానే కాకుండా కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రాల నుంచి భక్తులు కలప కోవెలకు తరలి వస్తున్నారు.మహంకాళీ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తే తమ కోరికలు నెరవేరుతున్నాయని కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తురాలు జి మాధవి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాము నిత్యం ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తున్నామని మరో భక్తుడు గోనె రాజేంద్ర ప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Read More
Next Story