Telangana |ప్రకృతి వైపరీత్యాలతో తెలంగాణను అతలాకుతలం చేసిన 2024
కాలగమనంలో కలిసి పోనున్న 2024 వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్యాలు అతలాకుతలం చేశాయి. ఈ ఏడాది తెలంగాణలో 66 మంది మరణించారు.
దేశంలోనే ఈ ఏడాది తెలంగాణ ప్రకృతి వైపరీత్యాల్లో తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది తుపాన్ లు,భారీవర్షాలు, వరదలు, పిడుగుల వల్ల 66 మంది మరణించారు.ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల్లో 4,350 పశువులు మృత్యువాత పడ్డాయి. దేశంలో ఈ ఏడాది మొత్తం 9,457 పశువులు ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించగా, వీటిలో సగం పశువులు తెలంగాణలోనే మరణించాయి.
- 2024వ సంవత్సరంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం, వేసవిలో వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నమోదుతో పాటు పిడుగు పాటు ఘటనల వల్ల ప్రాణనష్టం, పశు,ఆస్తినష్టం సంభవించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
తెలంగాణలో భారీ ఆస్తినష్టం
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది 58 రోజుల పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. భారీవర్షాలు వరదల వల్ల భారీ ఆస్తినష్టం జరిగింది. 25 రోజుల పాటు రాష్ట్రంలో తుపాన్ లు, పిడుగుపాటు ఘటనలు జరిగాయి. ఏడాది మొత్తం మీద 21 రోజుల పాటు కురిసిన భారీవర్షాల వల్ల ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. 12 రోజుల పాటు వేడిగాలుల ప్రభావం వల్ల కూడా వడదెబ్బతో జనం మరణించారు. ప్రకృతి వైపరీత్యాలు గేదెలు అధికంగా మరణించాయి. పశువులకు సరైన కొట్టాలు లేకపోవడం వల్ల పిడుగుపాటుకు, భారీవర్షాలు, గాలుల వల్ల పశువులు మృత్యువాతపడ్డాయి,
నష్టపోయిన రైతులు
తెలంగాణలో భారీవర్షాలు, వరదల వల్ల 74,418 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. గత మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఏపీలో 85వేల ఇళ్లు దెబ్బతిన్నాయి...
దేశంలో ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల 2,35,862 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 35 శాతం ఇళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఏపీలో 85వేల ఇళ్లు వరదల వల్ల దెబ్బతిన్నాయని ప్రకృతి వైపరీత్యాల విభాగం అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ఏపీలో భారీవర్షాలు, వరదల వల్ల 2,62,840 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ గుర్తించింది.
Next Story