కోతుల సమస్యకు టెక్ సొల్యూషన్: ఎంపీ కొండా వ్యూహం హైలైట్
x
మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్న కోతి

కోతుల సమస్యకు టెక్ సొల్యూషన్: ఎంపీ కొండా వ్యూహం హైలైట్

కోతుల దండుపై టెక్ వార్! ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో కొత్త ఆపరేషన్ ప్రారంభం


తెలంగాణలో పంటలను చిత్తు చేస్తున్న కోతుల దండయాత్రకు… ఇప్పుడు చెక్ పెట్టేందుకు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమాయత్తం అయ్యారు.ఇంజినీరింగ్ తెలివితో అల్ట్రా సౌండ్ టెక్నాలజీతో వినూత్న పరిష్కారం సిద్ధం చేశారు. ఎంపీ కొండా రూపొందించిన అల్ట్రాసౌండ్ మంకీ రికరింగ్ యంత్రం ఇప్పుడు ఆశల కిరణంగా మారింది.


చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కోతుల బెడద పెచ్చు పెరిగిన నేపథ్యంలో దీన్ని నివారించడానికి స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న వ్యూహాన్ని రూపొందించారు.ఇంజినీరు అయిన విశ్వేశ్వర్ రెడ్డికి జేకే పేరిట సొంతంగా ఇంజినీరింగ్ టీం ఉంది. ఎంపీతో పాటు ఇంజినీరింగ్ టీం కోతులను తరిమివేసేలా ఓ కొత్త యంత్రాన్ని తయారు చేశారు. కొన్నేళ్లుగా ఉన్న కోతుల సమస్య పరిష్కారానికి ఎంపీ త్రిముఖ వ్యూహాన్ని రూపొందించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరు ప్రతీక్ జైన్, అటవీశాఖ అధికారులు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులతో ఇటీవల ఎంపీ సమావేశమై కోతుల సమస్యపై చర్చించారు.



అల్ట్రాసౌండ్ మంకీ రికరింగ్ యంత్రం

ఇంజినీరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఇంజినీరింగ్ టీంతో కలిసి కోతులను తరిమివేసేందుకు అల్ట్రాసౌండ్ మంకీ రికరింగ్ యంత్రాన్ని తయారు చేశారు.అల్ట్రాసోనిక్ తరంగాలు కోతులను తరిమేస్తాయి.ఎంపీ తయారు చేసిన ఈ యంత్రం 20 అడుగుల వరకు పనిచేస్తుంది. దీంతో మరో మంకీ గార్ అనే యంత్రాన్ని ఎంపీ కొండా తెప్పించారు. ఈ యంత్రం 50 అడుగుల వరకు కోతులను తరిమివేస్తుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఈ యంత్రాలు ఇళ్లలోకి కోతులు రాకుండా పనిచేస్తాయని ఎంపీ పేర్కొన్నారు. ‘‘కోతులను పట్టుకునేందుకు మేం యంత్రాలను తయారు చేశాం.నేను తయారు చేసిన యంత్రం వల్ల జనవాసాల్లో కోతుల సమస్యను దూరం చేయవచ్చు’ ’అని కొండా వివరించారు.

త్రిముఖ వ్యూహం
కోతుల నియంత్రణకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్రిముఖ వ్యూహాన్ని రూపొందించారు. కోతుల నియంత్రణను వన్యప్రాణి చట్టాలకు లోబడి చేసేలా అధికారులకు తాను ప్రతిపాదనలు సమర్పించానని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఇళ్లలోకి కోతులు రాకుండా మంకీ గార్ యంత్రం ఉపయోగించడం, పంట పొలాలను నాశనం చేస్తున్న కోతులను పట్టుకొని దూరంగా దట్టమైన అడవుల్లో వదిలేయడం, పెద్ద బోన్లను తయారు చేయించి కోతులను అందులో ఉంచి వాటికి కావాల్సిన ఆహారాన్ని అందించడం పై తాము పరిశీలిస్తున్నామని ఎంపీ చెప్పారు. అధికారుల నుంచి అనుమతి రాగానే కోతుల నియంత్రణకు చర్యలు ప్రారంభిస్తామని చెప్పారు.‘‘దశాబ్ద కాలంగా తెలంగాణలోని అనేక గ్రామాల్లో కోతుల బెడద రైతులను దెబ్బతీస్తోంది.కోతుల దండు రైతుల పంటలను నాశనం చేస్తోంది. మేం చాలా సంవత్సరాలుగా ఈ సమస్యపై పని చేస్తున్నాం . ఇప్పుడు మేము ఒక పరిష్కారాన్ని కనుగొన్నాం. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి దీన్ని ప్రారంభిస్తాం’’ అని ఎంపీ కొండా చెప్పారు.



కోతులు పంటలను నాశనం చేస్తున్నాయి...

వికారాబాద్ జిల్లా దారుల్ మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, కోతుల దండు పంటపొలాలపై పడి నాశనం చేస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కోతుల నియంత్రణకు చర్యలు తీసుకొని మా పంటలను కాపాడండి అంటూ రైతులు కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కోతుల బెడద వల్ల కూరగాయలు, మొక్కజొన్న, సజ్జ, పల్లీ, పెసర పంటలు వేయాలంటేనే రైతులు భయపడుతున్నారు. రాత్రీ పగలూ తేడా లేకుండా కోతులు పంటలపై దండ యాత్ర చేస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, వేరుశనగ, కంది, సోయా, శనగ పంటలను కోతులు దెబ్బతీస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

పెరుగుతున్న కోతుల సంఖ్య
తెలంగాణలోని పలు జిల్లాల్లో కోతుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో ఆడ కోతి జీవిత కాలంలో 20 పిల్లలకు జన్మనిస్తుంది. దీంతో కోతుల్లో బర్త్ రేటు ఎక్కువగా ఉండటంతో వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో 35 లక్షలకు పైగా కోతులున్నాయని అంచనా. కోతులను నియంత్రించకుంటే వచ్చే అయిదేళ్లలో అనూహ్యంగా పెరిగి పంటలు రైతులకు చేతికి అందకుండా చేస్తాయని వ్యవసాయ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్డీఆర్కే శర్మ చెప్పారు. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్, నిర్మల్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో కోతులు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను నేలమట్టం చేస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన బి నర్సయ్య అనే రైతు ‘ఫెడరల్ తెలంగాణ’కు ఆవేదనగా చెప్పారు.



కోతుల బెడద ఎక్కువ ఎక్కడంటే...

తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంత జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. నిర్మల్, నర్సాపూర్, కొండగట్టు, జనగామ, నల్గొండ, నాగార్జునసాగర్, వికారాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో కోతుల సమస్య ఎక్కువగా ఉందని స్థానిక ప్రజలు ఆవేదనగా చెప్పారు. చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అటవీ గ్రామాల్లో పంటలపై వానర మూకలు మూకుమ్మడి దాడులు చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులకు కోతులు పెద్ద సమస్యగా మారింది.20 సంవత్సరాలుగా కోతుల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న వికారాబాద్ లో రైతులకు కోతుల బెడద తీవ్రమైంది. మొక్కజొన్న, కూరగాయలు, వరి పంటలను కోతులు దెబ్బతీస్తున్నాయి. పత్తి కాయలు తెంపి రసం పీల్చుకొని పారేస్తున్నాయి.వికారాబాద్, తుంగతుర్తి, నల్గొండ, నిర్మల్ ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది.

హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
అటవీ గ్రామాల్లో కోతుల కారణంగా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినా సర్కారు ప్రేక్షకపాత్ర పోషిస్తుంది. కోతుల బెడదను నివారించకుంటే కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హైకోర్టు హెచ్చరించింది. కోతుల బెడదపై ఎం శ్రీనివాసరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజనంపై హైకోర్టు న్యాయమూర్తి అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం 2023 ఆగస్టు 3వతేదీన ఆదేశాలు జారీ చేసింది. కోతుల నివారణకు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి, అందులో పండ్ల చెట్లు పెంచాలని ఎ దివ్య సమర్పించిన నివేదికను హైకోర్టు ప్రశంసించింది.

కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు
కోతుల బెడదను తట్టుకోలేక వీటిని నియంత్రించేందుకు నిర్మల్ జిల్లా చించోలిలో ఏర్పాటు చేసిన కోతుల పునరావాస కేంద్రం తరహాలో జిల్లాల్లో ఏర్పాటు చేసి కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. వరంగల్, సిరిసిల్ల, సిద్ధిపేట మున్సిపల్ అధికారులు నిర్మల్ వచ్చి పునరావాసకేంద్రం పనితీరును పరిశీలించారు. కానీ నిధుల కొరత వల్ల కోతుల నియంత్రణకు ఆపరేషన్లు చేసేలా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.

కోతుల సమస్యకు స్టెరిలైజేషన్ ఒక్కటే పరిష్కారం : వెటర్నరీ డాక్టర్ శ్రీకర్ రాజు
కోతుల సమస్యకు జిల్లాల్లో కోతుల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి కోతల సంఖ్య పెరగకుండా స్టెరిలైజేషన్ చేయించడం ఒక్కటే ఫరిష్కార మార్గం అని నిర్మల్ కోతుల రెస్క్యూ, పునరావాస కేంద్రం ఇన్ చార్జి డాక్టర్ శ్రీకర్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కోతులను అడవిలో వదిలేసినా అవి మళ్లీ తిరిగి ఆహారం లభించే ప్రాంతాలకు వస్తాయని ఆయన చెప్పారు.



అడవుల్లోకి కోతుల తరలింపు

చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచనపై తాము జిల్లాకలెక్టరుతో కలిసి కోతుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని వికారాబాద్ జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వడ్డి సదానంద ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కోతులను పట్టుకొని దట్టమైన అడవుల్లో వదిలి వేసేందుకు తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జనవాసాల్లోని కోతులను అడవుల్లోకి తరలిస్తామని ఆయన వివరించారు.

కోతుల బెడదతో అల్లాడుతున్న గ్రామాలకు… ఈ కొత్త టెక్ వ్యూహం నిజమైన ఉపశమనం తీసుకురావాలన్నదే అందరి ఆశ. ప్రభుత్వ అనుమతులు రాగానే చర్యలు ప్రారంభమవుతాయని ఎంపీ కొండా చెప్పడంతో, రైతుల కళ్లల్లో మళ్లీ ఆశలు ఏర్పడ్డాయి.దశాబ్దాలుగా పరిష్కారం దొరకని కోతుల సమస్యకు… కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందుకు తెచ్చిన ఈ నూతన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.



Read More
Next Story