
ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత సమయం కావాలి: సుప్రీంకోర్టు
ఫిరాయింపు నేతల విషయంలో మార్చి 25 లోపు వివరణను ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కాకరేపుతోంది. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ మంకుపట్టింది. ఇదే విషయంలో హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్.. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు కూడా చేరింది. కాగా ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. తాజాగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మరోసారి నోటీసులు ఇచ్చింది. వాటితో పాటు డెడ్‌లైన్ కూడా పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫిరాయింపులను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకోవడంతో పార్టీ మారిన సదరు నేతల పరిస్థితి అగమ్యగోచారంగా మారింది. ఫరాయింపు నేతలపై అనర్హతవేటు తప్పదా? పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ చెప్తున్నట్లు ఉపఎన్నిక వస్తుందా? అన్న అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది.
అయితే ఫిరాయింపు నేతల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలి? అన్న అంశంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు తమ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు వివరణను మార్చి 25 లోపు ఇవ్వాలని సూచించింది. మరి దీనిపై స్పీకర్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం కీలకంగా మారింది. అయితే సుప్రీంకోర్టు నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిందని, వారి పరిస్థితి ప్రస్తుతం రెంటికి చెడ్డ రేవడిలా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు.
వీడి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఛీ కొడుతోందని, అదే సమయంలో నమ్మి వచ్చిన పార్టీ, పార్టీ కార్యకర్తలు తమను పూర్తిగా అంగీకరించకపోవడంతో ఫిరాయింపు నేతలు పరిస్థితి అయోమయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక వారు తలలు పట్టుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇటువంటివి తేలే విషయాలు కాదని అంటున్నారు. ఎవరు నోటీసులు ఇచ్చినా అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకర్‌దే తుది నిర్ణయం కావున.. ఆయన ఫిరాయింపులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవచ్చని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చాయని, అక్కడ కూడా ఎటువంటి నిర్ణయం రాలేదని వారు ఉదహరిస్తున్నారు.