సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం ఆయనకు సానుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో తనను అరెస్ట్ చేయొద్దని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకు సానుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మోహన్‌బాబుపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో మోహన్ బాబుకు రిలీఫ్ దక్కింది.
అయితే ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ మోహన్ బాబు.. సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘‘నా వయసు 78 ఏళ్లు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాను. కావున నాకు బెయిల్ చేయాలని కోరుతున్నాను’’ అని మోహన్ బాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో మోహన్ బాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కీలకంగా మారింది.
హైకోర్టు నిర్ణయం ఇలా
డిసెంబర్ 10న విలేకరిపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. ఈ అంశంపై పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారని, విలేకరికి, మోహన్‌బాబుకు అసలు పరిచయమే లేదని, అలాంటి సమయంలో హత్యాయత్నం ఎలా చేస్తారని, పోలీసులు పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు సరైనవి కావని వాదించారు. మోహన్ బాబు కుటుంబ సమస్యలను మీడియా సంస్థలు పెద్దవి చేసి చూపించాయని, మంచు మనోజ్‌తో వచ్చిన బౌన్సర్లతో ప్రాణహాని ఉండటంతోనే ఆ సమయంలో మోహన్ బాబు అలా రియాక్ట్ అయ్యారని ఆయన తరపు న్యాయవాది వివరించారు. అనంతరం తన వాదనలను వినిపించడం ప్రారంభించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఈ ఘటనపై తొలుత పహడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారని ఆతర్వాత బాధితుడి వాంగ్మూలం ప్రకారం సెక్షన్లు జోడించడం జరిగిందని చెప్పారు. ఈ కేసులో మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిందేనని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఇరు వర్గా వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్.. ఈ పిటిషన్‌ను కొట్టివేశారు.
అసలేం జరిగిందంటే
అయితే జల్పల్లి ఫామ్ హౌస్‌లో మోహన్ బాబు, మనోజ్ మంచు మధ్య ఇటీవల తీవ్ర వివాదం నడిచింది. వీరి ఇంటిపోరు కాస్తా రచ్చకెక్కడమే కాకుండా డీజీపీ ఆఫీసు వరకు చేరుకుంది. డిసెంబర్ 3వ తేదీన మనోజ్ దంపతులు తెలంగాణ అదనపు డీజీపీని కలిసి పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత తిరిగి మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. కాగా అప్పటికే గేట్లకు తాళాలు వేసేయడంతో మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గేట్లు తోసుకుని ఇంట్లోకి వెళ్లారు. ఆయనతో పాటు పలువురు జర్నలిస్ట్‌లు కూడా లోపలికి వెళ్లారు. ఈ ఉద్రిక్తల నడుమ మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. మనోజ్ వెంటే లోపలికి వెళ్లిన మీడియాపై దాడి చేశారు మోహన్ బాబు. ఈ ఘటనలో ఒక జర్నలిస్ట్ తలకు తీవ్ర గాయమైంది. శస్త్ర చికిత్స చేసినట్లు వైద్యులు చెప్పారు. దీనికి సంబంధించే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ విచారణ క్రమంలోనే మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు.