డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో మందుబాబులపై పోలీసుల కొరడా
హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య ఇటీవల అనూహ్యంగా పెరిగాయి.ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు మందుబాబులపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు.
సైబరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు జూన్ 22వతేదీ రాత్రి పెద్ద ఎత్తున డ్రంక్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిపిన పరీక్షల్లో 385 మంది మందుబాబులను పట్టుకున్నారు. 292 ద్విచక్ర వాహనాలు,11 ఆటోలు,80 కార్లు,రెండు భారీ వాహనాల డ్రైవర్లను పట్టుకున్నారు.
- ఐటీ కారిడార్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 182 మంది మందుబాబులు పోలీసులకు దొరికారు.అధికంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ నలుగురు దొరికారు. వారి బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో 550 మిల్లీగ్రాములు వచ్చింది. మందుబాబులందరినీ పోలీసులు కోర్టులో హాజరు పర్చారు.
- హైదరాబాద్ శివార్లలోని నార్సిగ్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి డ్రైవరు పీకల దాకా మద్యం తాగి బస్సు నడపడంతో బోల్తాపడి ఓ ప్రయాణికురాలు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు.
- బహిరంగంగా మద్యం తాగినా, తాగి వాహనాలు నడిపినా, మద్యం తాగి రోడ్లపై గొడవలకు దిగినా కఠిన చర్యలు తీసుకోవాలని సాక్షాత్తూ సీఎం రేవంత్ ఆదివారం రాత్రి పోలీసులను ఆదేశించారు.
మందుబాబుల అరెస్ట్
ఎవరైనా మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదాలు చేసి ప్రజలను చంపేస్తే, అలాంటి మందుబాబులపై సెక్షన్ 304 పార్ట్ II కింద అరెస్టు చేసి జైలుకు పంపుతామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు.మందుబాబులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించవచ్చునని ఆయన పేర్కొన్నారు.
పెరుగుతున్న కేసులు
హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు,హోలీ,దసరా లాంటి పండుగల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. హైదరాబాద్ నగరంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు వాటిల్లుతున్నాయని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 4,80,000 మంది మరణించగా, 20 మిలియన్ల మంది గాయాల పాలయ్యారని ఇండియన్ డ్రైవింగ్ స్కూల్స్ రికార్డులే చెబుతున్నాయి.
- డ్రంకెన్ డ్రైవ్ కేసులు హైదరాబాద్ పరిధిలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది డిసెంబరు 31వతేదీ రాత్రి నుంచి జనవరి 1వతేదీ ఉదయం వరకు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 1500 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ లో 1241, రాచకొండలో 517 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
తెల్లవార్లూ డ్రంక్ డ్రైవ్ పరీక్షలు
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు తెల్లవార్లూ రెండు షిప్టుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
పరీక్షల నుంచి తప్పించుకునేందుకు యత్నాలు
హైదరాబాద్‌లో కొందరు మందుబాబులు బ్రీత్ ఎనలైజర్ పరీక్షల నుంచి తప్పించుకుంటున్నారు.డ్రంకెన్ డ్రైవింగుకు భారీ జరిమానాలు ఉండటంతో మందుబాబులు పరీక్షలు చేస్తున్న మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళుతున్నారు. కొందరు వాహనదారులు బ్రీత్ ఎనలైజర్ పరికరంలోకి ఊదకుండా లోపల శ్వాస తీసుకోవడం ద్వారా తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయడాన్ని గమనించిన వాహనదారులు ఆ లొకేషన్‌ను ఇతర వాహనదారులకు వాట్సాప్‌లో పంపి ఆ మార్గంలో వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు.
రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై పోలీసుల చర్యలు
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన 114 వాహనాలపై 122 కేసులు నమోదు చేశారు. ఈ ప్రమాదకరమైన రాంగ్ సైడ్ డ్రైవింగ్ ను అరికట్టడానికి పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ నేరాలకు సంబంధించి 631 వాహనాలను అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
భారీ జరిమానాలు
బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగినట్లు బయటపడితే భారీ జరిమానాలు విధిస్తున్నారు. మందుబాబు దొరికితే రూ.15000 వరకు జరిమానా విధిస్తామని పోలీసులు చెబుతున్నారు.మొదటిసారి డ్రంక్ అండ్ చేసినవారికి రూ.10,000 ఫైన్ విధిస్తామని వారు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జైలు శిక్ష కూడా ఉంటుందని నగర పోలీసులు హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాలు
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలను డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 185 ప్రకారం తాగి డ్రైవింగ్ చేసిన నేరానికి జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ బ్రీత్ ఎనలైజర్ల కొనుగోలు కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది.
పోలీసులకు సీఎం ప్రత్యేక ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం ఎ రేవంత్ రెడ్డి నగర పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో బహిరంగ స్థలాల్లో మద్యం తాగినా, రోడ్లపై గొడవ సృష్టించినా, తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. రాత్రి పదిన్నర, పదకొండు గంటలకు షాపులు మూసివేయాలని సీఎం కోరారు. డ్రగ్స్, గంజాయి తాగిన వారిపై, విక్రయించిన వారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం సూచించారు. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
Next Story