తెలంగాణలో హడలెత్తిస్తున్న వీధి కుక్కల వరుస దాడులు
x

తెలంగాణలో హడలెత్తిస్తున్న వీధి కుక్కల వరుస దాడులు

తెలంగాణలో వీధికుక్కల బెడద పెరిగిపోతోంది.వీధికుక్కల దాడుల్లో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.తాజాగా ఓ మహిళపై వీధికుక్కలు దాడి చేశాయి.


మణికొండలోని చిత్రపురి హిల్స్‌లో ఓ మహిళ మార్నింగ్ వాక్ చేస్తుండగా 15 వీధి కుక్కల గుంపు ఆమెపై దాడి చేసింది. వీధి కుక్కల దాడిలో ఆ మహిళ నేలపై పడిపోయింది. వీధి కుక్కల కాట్లతో మహిళ తప్పించుకోగలిగింది. ఈ ఘటనపై బాధిత మహిళ భర్త కుక్కల దాడి సీసీటీవీ ఫుటేజీతోపాటు కుక్కల బెడదపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మణికొండ ఘటనతో మరోసారి కుక్కల బెడద చర్చనీయాంశంగా మారింది.

- కుక్క దాడిలో పసికందు మృతి... వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వృద్ధురాలు, గుడిసెలో నిద్రిస్తున్న 5 నెలల బాలుడిపై వీధి కుక్కల దాడి...ఇలాంటి ఘటనలు ప్రతీరోజూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి.
- హైదరాబాద్ నగరంలో 6 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉండగా వాటిలో మూడో వంతు కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయలేదు. ఒక కుక్క ఏడాదికి రెండు సార్లు సంతానోత్పత్తి చేస్తుంది. దీంతో ప్రతీ ఏటా వీధి కుక్కల బెడద పెరుగుతూనే ఉంది.

వీధుల్లో స్వైరవిహారం చేస్తున్న వీధి కుక్కలు
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల బెడద ఇటీవల పెరిగింది. అంబర్ పేట, మియాపూర్, జీడిమెట్ల, చైతన్యపురి, కరీంనగర్, రామగుండం, వరంగల్ ప్రాంతాలు ఏవైనా వీధి కుక్కల కాటుకు చిన్నారులు బలవుతున్నారు. వీధి కుక్కలు దాడి చేసినపుడల్లా తూతూ మంత్రంగా చర్యలు తీసుకునే మున్సిపల్ అధికారులు...ఆ తర్వాత కుక్కల బెడదను నివారించేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కుక్కలు వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నాయి.
ఎన్నెన్నో కుక్క కాటు ఘటనలు ...
- హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కుక్క కాటు ఘటనలు పెరుగుతున్నాయి. మియాపూర్ లోని మక్తా ప్రాంతంలో జూన్ నెలలో చెత్త యార్డు వద్ద ఆరేళ్ల బాలుడిని కుక్కలు కొరికి చంపాయి.
- నగరంలోని జీడిమెట్లలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన కుక్కల దాడిలో రెండున్నరేళ్ల బాలిక మరణించింది.
- శంషాబాద్ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కుక్కల దాడిలో ఏడాది బాలుడు మృత్యువాత పడ్డారు.
- అంబర్ పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించాడు.
- చైతన్యపురిలో నాలుగేళ్ల బాలుడిని కుక్కలు దారుణంగా కాటు వేశాయి.
- కరీంనగర్ లో కుక్కలు హాస్టల్ లోకి చొరబడి ఓ విద్యార్థిని కరిచాయి.
- వికారాబాద్‌ జిల్లాలోని తాండూర్‌లో అప్పటి వరకు తల్లి ఒడిలో ఆడుకున్న 5నెలల చిన్నారిపై శునకం దాడి చేసి చంపింది.
- షేక్ పేటలో ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో అతను మరణించాడు.

నిజామాబాద్ లో బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు
నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. వీధికుక్కలు వీధుల్లో స్వైర విహారం చేస్తూ దాడులకు పాల్పడుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు.కుక్కలు గుంపులుగుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులని గాయపరుస్తున్నాయి. నెలరోజులు వ్యవధిలోనే వందకు పైగా కుక్కకాట్లతో బాధితులు ఆస్పత్రుల బాట పట్టారు. వీధి శునకాల్ని నివారించాల్సిన నగర పాలక సంస్థ చర్యలు తీసుకోవటం లేదని నిజామాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రామగుండంలో అత్యధికంగా వీధికుక్కలు
రామగుండంలో వీధి కుక్కల బెడద పెరిగింది. రామగుండం నగరంలో 50వేలకు పైగా వీధి కుక్కలున్నాయి. గత ఏడాది కుక్కల కాటుకు కటారి మల్లమ్మ, ధర్మేందర్ లు మృతి చెందారు. కుక్కల సంరక్షణకు హైకోర్టు, జాతీయ జంతు సంరక్షణ బోర్డు మార్గదర్శకాలతో కుక్కల బెడద పోవడం లేదు.మనుషులపై దాడి చేస్తున్న కుక్కలను సంరక్షించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యానిమల్ బర్త్ కంట్రోల్ ద్వారా కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కలకు సర్జరీలు చేసి రేబిస్ ఇంజక్షన్లు ఇచ్చి వదిలి పెట్టాలనే ఆదేశాలున్నాయి.

వరంగల్ లో వీధికుక్కల నియంత్రణకు చర్యలేవి?
వరంగల్ నగరంలో 20వేలకు పైగా ఉన్న వీధికుక్కలు మనుషులపై దాడి చేసి కరుస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ పిల్లలపై దాడి చేసి కాటు వేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. వరంగల్ నగరంలో కుక్కలను పట్టుకునేందుకు మూడు వాహనాలున్నా, వాటిని పట్టుకొని ఏబీసీ, యాంటీ రాబీస్ వ్యాక్సిన్, డీ వార్మింగ్ చేసి వదిలిపెడుతున్నారు. వీధికుక్కలకు ఆహారం, నీరు దొరక్క వీధుల్లో మనుషులపై దాడి చేస్తున్నాయని వరంగల్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రాజేష్ చెప్పారు.

పెరుగుతున్న కుక్కకాటు కేసులు
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశంలో 2023వ సంవత్సరంలో 27 లక్షల కుక్కకాట్ల కేసులు నమోదయ్యాయి. ప్రతీ ఏటా కుక్క కాటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో లక్షమందికి పైగా కుక్కకాటుకు గురయ్యారంటే కుక్కల బెడద తీవ్రత ఏమిటో విదితమవుతుంది. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది మూడు నెలల్లోనే 9 వేల మందికి పైగా కుక్కల పంటిగాట్లకు గురయ్యారు. దీంతో పాటు మరో 50వేల మంది కుక్క కాటు బాధితులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారని తేలింది.

కుక్కలకు వ్యాక్సిన్లేవి?
యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారం వెటర్నరీ విభాగం ప్రతి కుక్కను పట్టుకొని రేబిస్ వ్యాక్సిన్‌తో పాటు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయించాలి.కానీ ఆచరణలో అది అమలు కాకపోవడంతో సామాన్య ప్రజలు కుక్కకాట్లకు బలవుతున్నారు. హైదరాబాద్ నగరంలో రోజుకు వీధి కుక్కల సమస్యలపై 500కు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదుల్లో పదిశాతం కూడా జీహెచ్ఎంసీ అధికారులు పరిష్కరించడం లేదని హైదరాబాద్ నగరంలోని వెంకటరమణ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కుక్కకాటుకు 59 వేలమంది మృతి
కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్‌ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 59 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కుక్కకాటుతో మరణిస్తున్న వారిలో భారతీయులే 36శాతం వరకు ఉన్నారని అధ్యయనాలు వెల్లడించాయి. 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా అంది నెరవేరడం లేదు. బెంగళూరు,అహ్మదాబాద్‌ నగరాల్లోనూ కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను అందిస్తున్నా, ఆ చర్యలను హైదరాబాద్ నగరంలో పాటించడం లేదు.

కుక్కకాటు బాధితుల కోసం ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగం
హైదరాబాద్ నగరంలో కుక్క కాటుతో ప్రతీ రోజు వందలాది మంది చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారు. దీంతో కుక్కకాటు బాధితులకు చికిత్స అందించేందుకు నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా రిగ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. కుక్క కాటుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నారు. కుక్క కాటుకు పెద్ద గాయం అయితే రిగ్ అనే టీకా సింగిల్ డోస్ ఇస్తున్నారు.

కుక్కలకు సంరక్షణ కేంద్రాలు
కుక్కల బెడద అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కక కుక్కల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి ఆహారం, తాగునీరు అందించేందుకు హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంది. గతంలో హైదరాబాద్ నగరంలో కుక్కలకు నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి స్టెరిలైజేషన్ నిర్వహించారు. మటన్, చికెన్ షాపుల వద్ద కుక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, మాంసం వ్యర్థాలను షాపుల వాళ్లు బయట వేయవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో కుక్కల నియంత్రణకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కుక్కల బెడదపై ఫిర్యాదులకు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. దీంతో పాటు ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు.

కుక్కల నియంత్రణకు సర్కారు మార్గదర్శకాలు
హైదరాబాద్ నగరంలో కుక్కల నియంత్రణకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. వీధి కుక్కలను ప్రత్యేక టీం పట్టుకొని వాటికి యాంటీ బర్త్ కంట్రోల్, స్టెరిలైజేషన్ చేయాలి. వీధుల్లో మాంసాహార వ్యర్థాలను పార వేయకుండా,నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే వ్యర్థాలను డంప్‌ చేయాలి. జీహెచ్‌ఎంసీ ద్వారా అన్ని పాఠశాలల్లో కరపత్రాలు పంచి విద్యార్థులకు వీధికుక్కలపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వీధి కుక్కల దత్తత ద్వారా పెట్‌ ఓనర్‌ షిప్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలి. వీధి కుక్కలపై ఫిర్యాదు చేసేందుకు జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 040-21111111, మై జీహెచ్‌ఎంసీ అప్లికేషన్‌ ద్వారా, సిటిజన్‌ బడ్డీ ద్వారా కుక్కలపై రిపోర్ట్‌ చేయవచ్చు.

కుక్కలే కాదు కోతుల బెడద
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలే కాకుండా కోతుల బెడద కూడా ఉంది. అడవుల నరికివేత వల్ల అక్కడ ఆహారం దొరక్క కోతులు జనవాస ప్రాంతాలకు తరలివస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడదతో జనం సతమతం అవుతున్నారు.


Read More
Next Story