పిల్లల ప్రాణాలు తీస్తున్నా,హైదరాబాద్‌లో వీధి కుక్కల వైభోగమే వేరయా
x

పిల్లల ప్రాణాలు తీస్తున్నా,హైదరాబాద్‌లో వీధి కుక్కల వైభోగమే వేరయా

వీధికుక్కలు పిల్లల ప్రాణాలు తీస్తున్నా ప్రభుత్వ అధికారులు, డాగ్ లవర్స్, జంతు సంక్షేమసంఘాల సభ్యులు మాత్రం కోట్లాది రూపాయలతో వీధికుక్కల ఆలనపాలన చూస్తూనే ఉన్నాయి.


తెలంగాణలో హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లోనూ పిల్లలపై కుక్కల దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.తాజాగా శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో నాలుగేళ్ల బాలుడు కీయాన్స్ పై వీధికుక్కలు దాడి చేసి కరిచాయి. కీయాన్స్ అనే బాలుడు నీలోఫర్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.

- రాష్ట్రంలో పలు చోట్ల క్రూరంగా మారిన వీధి కుక్కలు పిల్లల్ని కసితీరా కొరికి చంపేస్తున్నాయి. అయినా అధికారులు, డాగ్ లవర్స్ లలో స్పందన కనిపించడం లేదు.
- కోకాపేట సబితానగర్ లో ఓ దివ్యాంగ బాలుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- కరీంనగర్ లో హరినందన్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వీధి కుక్కల సంక్షేమానికి చర్యలు
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కల వరుస దాడుల్లో పలువురు పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నా, వీధి కుక్కల సంక్షేమానికి జీహెచ్ఎంసీతోపాటు జంతు సంక్షేమ సంఘాలు పలు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. బతుకు దుర్భరంగా మారడంపై పలువురు తమది ‘కుక్క బతుకు’ అని అంటుంటారు. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం వీధికుక్కల జీవితం మాత్రం వైభోగమే వేరయా అన్నట్లు మారింది.

కుక్కల కోసం రూ.11.5కోట్ల బడ్జెట్
జీహెచ్ఎంసీలో వీధి కుక్కల సంక్షేమానికి రూ.11.5కోట్ల రూపాయలతో బడ్జెట్ కేటాయించింది. హైదరాబాద్ నగరంలో జరిపిన డాగ్ సర్వేలో 5.8 లక్షల వీధికుక్కలున్నాయని తేలింది. వీధి కుక్కల చికిత్సలతో పాటు వాటికి వైద్యం అందించేందుకు ఆరుగురు డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, కేంద్రాలు పనిచేస్తున్నాయి.వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కోసం కార్యక్రమం చేపట్టారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షెల్టర్లు
హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వీధి కుక్కల కోసం 17 షెల్టర్లను ఏర్పాటు చేశారు.హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కల కోసం జీహెచ్ఎంసీ షెల్టర్లను నడుపుతోంది. పశువైద్యులను అందుబాటులో ఉంచడంతో పాటు వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి, వీటికి సేవలు చేసేందుకు వాలంటీర్లను నియమించారు. ఎల్ బినగర్, కూకట్ పల్లి, జీడిమెట్ల, పటేల్ నగర్ డాగ్ షెల్టర్లు ఉన్నాయి. దీంతో పాటు కొత్తగా కాటేదాన్, రాజేంద్రనగర్, నల్లగండ్ల ప్రాంతాల్లో వీధి కుక్కల కోసం కొత్త షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు.

ఒక్కో కుక్క ఆపరేషన్ కోసం రూ.1500
ఒక్కో కుక్కకు యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి వారంరోజుల పాటు ఆ కుక్కకు మందులిచ్చి,సంరక్షించి దానికి యాంటీ రాబీస్ వ్యాక్సిన్ వేసి, ఆ కుక్కను ఏ ప్రాంతం నుంచి తీసుకువస్తే ఆ ప్రాంతంలోనే వదిలివేస్తున్నారు. ఏబీసీ, ఏఆర్ వై కోసం ఒక్కో కుక్కకు 1500రూపాయలను హైదరాబాద్ నగరంలోని పీపుల్స్ ఫర్ ఎనిమల్స్, బ్లూక్రాస్ లాంటి పలు సంస్థలకు జీహెచ్ఎంసీ డబ్బులు చెల్లిస్తోంది. వీధి కుక్కలు కరుస్తున్నా వీటి సంక్షేమానికి జీహెచ్ఎంసీ నిధులు వెచ్చిస్తూనే ఉంది.

వీధి కుక్కలను పట్టుకునేందుకు డాగ్ క్యాచర్స్ బృందాలు
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలను పట్టుకునేందుకు డాగ్ క్యాచర్స్ బృందాలు పనిచేస్తున్నాయి. అంబర్ పేటలో బాలుడిని వీధికుక్కలు దాడి చేసి చంపిన ఘటన తర్వాత వీధి కుక్కలను పట్టుకునేందుకు మూడు షిప్టుల్లో డాగ్ క్యాచర్స్ పనిచేసేలా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. కరుస్తున్న కుక్కలు, పిచ్చి కుక్కలను పట్టుకొని వాటిని వారం రోజుల పాటు పరిశీలనలో ఉంచి వీటికి స్టెరిలైజేషన్ శస్త్రచికిత్స, యాంటీరాబీస్ వ్యాక్సిన్ వేసి తర్వాత వాటిని పట్టుకువచ్చిన ప్రదేశాల్లోనే వదిలి వేస్తున్నామని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె చక్రపాణిరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కుక్కల్ని చంపితే పోలీసు కేసులా ?
కుక్కలు పిల్లల్ని కరిచినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సరికదా పిచ్చి కుక్కలు, పిల్లల్ని కరిచిన కుక్కల్ని ప్రజలు ఆగ్రహంతో చంపితే మాత్రం ఎనిమల్ ప్రీవెన్షన్ ఆఫ్ క్రూయాలటీ ఎగినెస్ట్ ఎనిమల్స్ చట్టం ప్రకారం ప్రజలపైనే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. పిల్లలను కుక్కలు చంపుతున్నా డాగ్ లవర్స్ మాత్రం నిత్యం కుక్కల సంక్షేమం తప్ప, పిల్లల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు.

డాగ్ ఫీడర్స్ ఎంపిక కోసం జీహెచ్ఎంసీ ప్రకటన
గత పదేళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో 3,36,767 మందిని వీధి కుక్కలు కరిచాయని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిసన్ రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రతీరోజూ కుక్కకాట్లతో చికిత్స కోసం ప్రజలు ఆసుపత్రులకు తరలివస్తున్నా అధికారుల్లో చలనం లేకుండా పోయింది. చివరికి రాష్ట్ర హైకోర్టు కుక్కల దాడులను నియంత్రించాలని మొట్టికాయలు వేసింది. హైకోర్టు మొట్టికాయలతో వీధి కుక్కలను కొడితే గారెల బుట్టలో పడినట్లు వీధి కుక్కలకు షెల్లర్లతోపాటు వీటి ఫీడింగ్ కోసం జీహెచ్ఎంసీ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది.

వీధి కుక్కలకు ఫీడింగ్ కోసం కొత్త విధానం
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కోరింది. దీనికోసం డాగ్ ఫీడర్ ఫాం లింక్ ద్వారా క్యూఆర్ కోడ్ నమోదు చేసుకోవాలని కోరారు. జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీధికుక్కలకు ఆహారం పెట్టేందుకు అనువైన ప్రాంతాలను జీహెచ్ఎంసీ గుర్తించాలని నిర్ణయించింది.వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీధి కుక్కలకు ఫీడింగ్ చేసే డాగ్ లవర్స్ ను జీహెచ్ఎంసీ అధికారులు ప్రోత్సహిస్తున్నారు.



వీధి కుక్కలకు బ్లూక్రాస్ సేవలు

సినీనటి అక్కినేని అమల నేతృత్వంలో హైదరాబాద్ నగరంలో 1992వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన బ్లూక్రాస్ స్వచ్ఛంద సంస్థ గత 32 ఏళ్లుగా వీధి కుక్కలకు సేవలందిస్తోంది. 5,46,181 జంతువులను రెస్క్యూ చేయడంతో పాటు 1,42,598 వీధి కుక్కలకు ఏబీసీ, ఏఆర్‌వీ శస్త్రచికిత్సలు చేయించింది. గాయపడిన వీధి కుక్కలకు చికిత్స అందించడంతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు వేసింది. వీధికుక్కలకు నిత్యం వైద్యం చేయడంతోపాటు మందులను కూడా ఉచితంగా అందిస్తోంది.

హైదరాబాద్‌లో వీధికుక్కల సంరక్షణ కోసం హెల్ప్ లైన్లు
హైదరాబాద్ నగరంలో వీధికుక్కల సంరక్షణ కోసం పలు జంతు సంక్షేమ సంఘాలు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయి. పీపుల్స్ ఫర్ ఎనిమల్స్, బ్లూక్రాస్, పశుసంవర్థక శాఖ,ఉప్పల్ ఎనిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్,కంపాషినేట్ సొసైటీ ఫర్ ఎనిమల్స్ సంస్థలున్నాయి.దీంతోపాటు వీధి కుక్కల దత్తత కోసం జీహెచ్ఎంసీ పథకం అమలు చేసింది. దేవన్స్ హోప్ ఆధ్వర్యంలో వీధి కుక్కల చికిత్స కేఫ్ కం షెల్టర్ ఏర్పాటు చేశారు.

హైకోర్టు ఆదేశం
నగరం వెలుపల వీధి కుక్కల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుక్కల దాడి లేదా వీధి కుక్కల కదలికల ఫిర్యాదులపై స్పందించేందుకు ప్రత్యేకంగా యానిమల్ బర్త్ కంట్రోల్ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రజలపై వీధి కుక్కల దాడులను అరికట్టడానికి ఏమి చేయాలనే దానిపై అధికారులు దృష్టి సారించాలని నొక్కిచెప్పింది. వీధి కుక్కల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించాలని ఆదేశించింది.




Read More
Next Story