టన్నెల్ వద్ద రంగంలోకి దిగిన ప్రత్యేకాధికారి, మరోసారి కడావర్ డాగ్స్
x

టన్నెల్ వద్ద రంగంలోకి దిగిన ప్రత్యేకాధికారి, మరోసారి కడావర్ డాగ్స్

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల మరో ఆరు మృతదేహాలను వెలికితీసేందుకు సహాయ పనులను ముమ్మరం చేశారు.సీఎం నియమించిన ప్రత్యేకాధికారి శివశంకర్ గురువారం రంగంలోకి దిగారు.


ఎస్ ఎల్ బి సి సొరంగంలో చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను వెలికితీయడం కోసం గురువారం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనుల పర్యవేక్షణ కోసం నియమితులైన ఐఎఎస్ అధికారి శివశంకర్ గురువారం టన్నెల్ వద్ద రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. టన్నెల్ లోపల దుర్వాసన వెలువడుతున్న నేపథ్యంలో మృతదేహాల జాడను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేకాధికారి శివశంకర్ మరోసారి కడావర్ డాగ్స్ ను టన్నెల్ లోపలకు పంపించారు.


సహాయ పనులు వేగవంతం
ఎస్ ఎల్ బీసీ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి గురువారంసహాయక చర్యలు వేగవంతం చేశారు. ఆయన సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.ఈ సందర్భంగా శివశంకర్ లోతేటి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు 34 రోజులుగా నిరంతరం సహాయక చర్యలో పాల్గొంటుయన్నారు. ప్రతిరోజు మూడు షిఫ్టులలో 600 మంది సిబ్బంది పాల్గొంటూ సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయన చెప్పారు.



టన్నెల్ లోపల దుర్వాసన

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల మరో ఆరు మృతదేహాల కోసం పలు విభాగాల సహాయ సిబ్బంది గాలిస్తూనే ఉన్నారు. గురువారం నాడు టన్నెల్ లోపల లోకో రైలు ముందు భాగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ ఉన్న ప్రాంతంలో నుంచి దుర్వాసన వచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో మృతదేహాలు ఉండవచ్చనే అనుమానంతో సిబ్బంది తవ్వకాలు చేపట్టారు.

నిరంతరాయంగా సహాయక చర్యలు
టన్నెల్ ప్రమాదం జరిగిన రోజు నుంచి నిరంతరా యంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్ ఎల్ బీసీ ప్రత్యేక అధికారి శివశంకర్ చెప్పారు. సహాయక చర్యల్లో భాగంగా సొరంగంలో ఉన్న మట్టిని టీబీఎం భాగాలను ఊట నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.



మరోసారి కడావర్ డాగ్స్

టన్నెల్ లోపల సహాయక చర్యల ద్వారా వెలువడిన వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నట్లు శివశంకర్ చెప్పారు.నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని అత్యధిక సామర్థ్యం గల పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రమాదం ప్రదేశం సమీపంలో టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు కేరళకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన కడావర్ డాగ్స్ ను గురువారం ఉదయం 11 గంటలకు ఎస్ ఎల్ బి సి సొరంగంలోనికి పంపినట్లు శివశంకర్ తెలిపారు.



మృతుడి కుటుంబానికి రూ.25లక్షల చెక్

నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట వద్ద జరిగిన ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు.మనోజ్ కుమార్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ను వారి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.


Read More
Next Story