సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వనపర్తి జిల్లా వనపర్తి (Wanaparthy)పట్టణానికి చెందిన చీర్ల కృష్ణ సాగర్ గతంలో తన తండ్రికి తోడుగా వ్యవసాయం చేస్తుండేవాడు. ఇంటి నుంచి పొలానికి తండ్రికి భోజనం క్యారేజీని తీసుకువెళ్లడం, పొలంలో చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తుండేవాడు. అలా పొలంలో ఉండగా రెండు మూడు సార్లు పాములు కనిపించాయి. అంతే పాములు తన తండ్రికి కరిస్తే ప్రాణహాని జరిగే అవకాశముందని భావించిన కృష్ణ సాగర్ పొలంలో కనిపించిన మూడు పాములను వేర్వేరు రోజుల్లో కొట్టి చంపాడు.
పాము కాటుకు గురై...
వనపర్తిలోని సాయికృష్ణ కాలనీకి చెందిన రైతు కుటుంబంలో పుట్టిన చీర్ల కృష్ణ సాగర్ తన తండ్రికి సహాయంగా పనిచేసేందుకు పొలం వెళ్లాడు...పొలంలో వేసిన గుడిసెలో నుంచి సల్కె పార తీసుకురమ్మని తండ్రి చెప్పడంతో కృష్ణ సాగర్ పార తీసుకుంటుండగా దాని కింద ఉన్న 8 అడుగుల పొడవున్న జెర్రిపోతు అతని ఎడమకాలికి కాటేసింది.(Snake Bite) అంతే పామును చూసిన కృష్ణ సాగర్ తాను పాము విషం వల్ల మరణిస్తానని భయపడ్డాడు. తనను కరిచిన పామును చంపేసి దాన్ని తీసుకొని హుటాహుటిన చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.
మలుపుతిప్పిన పాము కాటు ఘటన
జెర్రిపోతు తనను కాటేసిందని డాక్టర్లకు చెప్పి చికిత్స చేయమని అడిగాడు. వైద్యులు అతనికి యాంటీవీనం ఇంజక్షన్ చేశారు. ఆ తర్వాత విషపూరితం కాని జెర్రిపోతు పామును చూసి అది కరిస్తే యాంటీవీనం ఇంజక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అతన్ని చికిత్స కోసం మరో ఆసుపత్రికి పంపించారు. అక్కడ వైద్యులు చికిత్స చేయడంతో పాము కాటు నుంచి సాగర్ కోలుకున్నాడు. ఈ ఘటన సాగర్ జీవితాన్ని మలుపు తిప్పింది.పాము కాటు తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన కృష్ణ సాగర్ యూట్యూబ్ ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా పాముల గురించి తెలుసుకున్నాడు.
పాము వచ్చింది సార్...
- వనపర్తి పట్టణంలో ర్యాంకర్ స్కూల్ వద్ద చెట్టుపై గ్రీన్ వైన్ అరుదైన పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనలు చెంది కృష్ణ సాగర్ కు ఫోన్ చేశారు. అంతే హుటాహుటిన వచ్చిన సాగర్ గ్రీన్ వైన్ పసిరిక పామును పట్టుకొని అడవిలో వదిలేశారు. ఈ పాము ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో ఉంటుందని చెప్పారు.
- వనపర్తి పట్టణ శివార్లలో ఒక్క రోజే పది పాములు ఇళ్లలోకి వచ్చాయని ఫిర్యాదులు అందటంతో రంగంలోకి దిగిన సాగర్ వాటిని పట్టుకున్నాడు. ఇందులో ఆరు నాగుపాములు, 4 విషం లేని సర్పాలని సాగర్ చెప్పారు.
- చిట్యాల కుందేళ్ల ఫాంవద్ద అతి పెద్ద నాగు పాము వచ్చింది. దీంతో పామును పట్టుకోవడానికి సాగర్ ఐరన్ రాడ్, ప్లాస్టిక్ డబ్బా తీసుకొని వచ్చి దాన్ని పట్టుకొని అందులో బంధించి అడవిలో వదిలేశారు.
- అత్యంత ప్రమాదకరమైన రక్తపింజరను పట్టుకొని దాన్ని సాగర్ అడవిలో వదిలేశారు. ప్రాణాలకు తెగించి రక్తపింజరను సాగర్ పట్టుకున్నాడు.
సర్పరక్షకుడిగా మారి...సాగర్ స్నేక్ సొసైటీ ఏర్పాటు చేసి...
పర్యావరణ రక్షణతోపాటు జీవ వైవిధ్యం కోసం తోడ్పడుతున్న పాములను పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తించిన చీర్ల కృష్ణ సాగర్ సర్పరక్షకుడిగా మారారు.(Good Samaritan Snakes) పాముకాటు బాధితుడైన సాగర్ సర్ప రక్షకుడిగా మారి సాగర్ స్నేక్ సొసైటీని (Sagar Snake Society)ఏర్పాటు చేశాడు. అలా వనపర్తిలో సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడిగా, సర్ప రక్షకుడిగా సాగర్ 12 ఏళ్ల జీవనయానంపై ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పాములే కాదు జంతుజాలం పరిరక్షణకు 12 ఏళ్లుగా పాటుపడుతున్న సాగర్ జర్నీ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
11వేల పాములను రక్షించాను...
‘‘నేను ఇంటరుమీడియెట్ వరకు చదువుకున్నాను. 2004వ సంవత్సరంలో నాకు పోలీసుశాఖలో హోంగార్డుగా (Home Guard)ఉద్యోగం వచ్చింది. వనపర్తిలో ఉద్యోగం చేస్తూనే మరో వైపు జనవాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకొని వాటిని అడవుల్లో వదిలివేస్తుండే వాడిని. అలా పాముల గురించి నాకు అనుభవం మీద పూర్తిగా అవగాహన ఏర్పడింది.పాములన్నీ విషపూరితం కాదని తెలుసుకొని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాను. ఎలుకలను తింటూ జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్న పాములను చంపవద్దని, అవి కనిపిస్తే నాకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు.దీంతో నాకు రోజుకు 30 నుంచి 40 మంది ప్రజల నుంచి తమ ఇళ్లలోకి పాము వచ్చిందని దాన్ని మీరొచ్చి పట్టుకోండి అని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో నేను ప్రారంభించిన సాగర్ స్నేక్ సొసైటీ ద్వారా 40 మంది యువకులకు పాములు పట్టడంలో అవగాహనతో పాటు శిక్షణ ఇచ్చి వాలంటీర్లుగా నియమించాను. అలా మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో 11వేల పాములను రక్షించి వాటిని దట్టమైన అడవులున్న తిరుమలయ్య గుట్ట,బుద్ధారం, శ్రీశైలం నల్లమల అడవుల్లో వదిలి వేశాను.
పాములన్నీ విషపూరితం కాదు...
పాములన్నీ విషపూరితం కాదు. కేవలం నాగుపాము, కట్లపాము, రక్తపింజర,ఇండియన్ స్పెక్టా కిల్డ్ వైపర్, సా స్కేల్డ్ వైపర్ పాములు అత్యంత విషపూరితమైనవి. క్యాట్ స్నేక్, గ్రీన్ వెనీ స్నేక్ అర్ధ విషంతో కూడినవి. జెర్రిపోతు, నీరుకట్ట, కొండచిలువ, కుర్రీ, ఉల్ఫ్, గ్రీన్ స్నేక్, నాగులమాస్, రెండు తలల కూడు పాములు విషపూరితం కాదు.జనవాసాల్లోకి వస్తే 28 రకాల పాములను పట్టుకొని, వాటిని రక్షించి అడవుల్లో వదిలివేశాను. ప్రస్థుతం నేను కొత్తకోట ట్రాఫిక్ పోలీసుస్టేషనులో హోంగార్డుగా పనిచేస్తూ పాములను పడుతూ ఉచిత సేవలు అందిస్తున్నాను. ఇళ్లలోకి వస్తే ఉచితంగా పాములను పట్టుకుంటూ వాటిని అడవుల్లో వదులుతూ జీవ వైవిధ్యం కోసం నా వంతు కృషి చేస్తున్నాను.
పోలీసు శాఖ నుంచి బైక్ బహుమతి
నేను పాములను పట్టుకుంటూ ప్రజలను పాము కాట్ల బారి నుంచి కాపాడుతున్నందుకు పోలీసు శాఖ గత ఎస్పీ అపూర్వరావు నాకు బైక్ ను బహుమతిగా అందించారు. గురురాఘవేంద్ర ట్రేడర్సుకు చెందిన మోహన్ నాకు టీ షర్టులు, గ్లౌజులు కొనిచ్చారు. సింగపూర్ దేశం నుంచి మరో దాత తిరుమల మహేష్ నాకు షూస్, హ్యాండ్ గ్లౌజులు పంపించారు. ఇలా దాతల చేయూతతో నేను పాములను పట్టే సేవలు ఉచితంగా చేస్తున్నాను.
ఆలంపూర్ టు హైదరాబాద్ 237 కిలోమీటర్ల దూరం హరితయాత్ర
మొక్కలు నాటి పచ్చదనాన్ని, ప్రాణవాయువు ఆక్సిజన్ ను పెంచండి అనే నినాదంతో నేను 237 కిలోమీటర్ల దూరం ఆలంపూర్ టు హైదరాబాద్ వరకు 17 రోజుల హరిత పాదయాత్ర చేపట్టాను.ఈ సందర్భంగా కిలోమీటరుకు నాలుగు మొక్కలు నాటుతూ ముందుకు సాగాను. దారిపొడవునా ఇలా 1016 మొక్కలు నాటాను. నా హరిత పాదయాత్రతో విద్యార్థులు, అటవీశాఖ అధికారులు స్పందించి వారు కూడా మొక్కలు నాటారు. ప్రతీ ఆదివారం సెలవు రోజు- ఒక ఊరు పేరిట కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటుతూనే ఉన్నాను. ఇప్పటికే 20 గ్రామాల్లో మొక్కలు నాటాను.
కొండచిలువను రక్షించి...
చెరువులో మత్స్యకారులు ఏర్పాటు చేసిన వలలో ఉన్న చేపలను తినేందుకు వచ్చిన కొండచిలువ నెట్ లో చిక్కి గాయపడింది. పెద్ద కొండచిలువను కాపాడి ఇంటికి తీసుకువచ్చి వెటర్నరీ వైద్యులతో చికిత్స అందించి అది కోలుకున్నాక దాన్ని అడవిలో వదిలేశాను. పాములే కాకుండా కుక్కల దాడిలో గాయపడిన జింకలను ఇంటికి తీసుకువచ్చి చికిత్స చేయించి వాటిని అడవిలో వదిలేశాను. అడవి పందులు, నక్కలు, నెమళ్లు, ముంగిసలు, కుందేళ్లు, మొసళ్లు ఇలా ఒకటేమిటి అన్ని రకాల వన్యప్రాణులను కాపాడి వాటిని అడవిలో వదిలేశాను. పాములు, జంతువులు, వన్యప్రాణుల సేవలతోనే నాకు జీవితంలో సంతృప్తి లభిస్తుంది.
అవార్డులు, రివార్డులు ఎన్నెన్నో...
పాములే కాకుండా జంతువులను రక్షిస్తూ మొక్కలు నాటుతూ నేను చేస్తున్న స్వచ్ఛంద సేవలకు గుర్తింపుగా జిల్లా కలెక్టరు నుంచి 17 మెరిటోరియస్ సర్టిఫికెట్లు ఇచ్చి ప్రశంసించారు. గత డీజీపీ అంజనీకుమార్ నాకు రాష్ట్రపతి సేవా పతకం కోసం సిఫారసు చేశారు.నేను చేస్తున్న సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నాకు నంది అవార్డు ఇచ్చింది. వనపర్తి ప్రాంతంలో స్నేక్ పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర అటవీశాఖను కోరుతూ లేఖ రాశాను. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మాజీ మంత్రి నిరంజన్ రావు, కేటీఆర్, ఎస్పీ రమా రాజేశ్వరి తదితరుల నుంచి నాకు ప్రశంసలు లభించాయి.
సాగర్ స్నేక్ సొసైటీ యూట్యూబ్
సాగర్ స్నేక్ సొసైటీ పేరిట యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి పాముల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ కు ఇప్పటికే 2,19,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు. దీంతో పాటు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల ద్వారా పాముల గురించి అవగాహన కల్పించి పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం కోసం పాములను సంరక్షించాలని ప్రచారం చేస్తున్నాను. నేనే కాకుండా పదోతరగతి చదువుతున్న నా కుమారుడు అవినాష్ సాగర్ కు కూడా పాములు పట్టడంలో శిక్షణ ఇచ్చాను. నాతో పాటు నా కుమారుడు కూడా పాములను రక్షించే పనిలో దించాను. ప్రకృతిని పరిరక్షించడం, పాములు, ఇతర జంతుజాలాన్ని నా ప్రాణమున్నంత వరకు కాపాడటమే నా జీవిత లక్ష్యం’’ అంటూ హోంగార్డు, సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణ సాగర్ వివరించారు.