
టన్నెల్‌లో ముందుకు సాగని సహాయ పనులు,రంగంలోకి మెరైన్ కమాండో ఫోర్స్
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోయి అయిదు రోజులు గడిచినా లోపల చిక్కుకున్న 8మంది జాడ బుధవారం నాటికి ఇంకా తెలియలేదు.బుధవారం మెరైన్ కమాండో ఫోర్స్ ను రంగంలోకి దించారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ కూలిపోయి బుధవారానికి అయిదు రోజులు గడిచినా సహాయ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు.ఫిబ్రవరి 22వతేదీ ఉదయం 8 గంటలకు ఒక్కసారిగా టన్నెల్ పై నుంచి పెద్ద రాళ్లు రప్పలు, బురద, నీటి ఊటతో కూలిపోయింది. దీంతో సొరంగం చేస్తున్న టన్నెల్ బోరింగ్ మెషీన్ ముక్కలు చెక్కలైంది. కూలిన ప్రాంతంలో టన్నెల్ బోరింగ్ మెషీన్ ముక్కలు, బురద, మట్టి, బండరాళ్లు పేరుకుపోవడంతో అసలు సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. అయిదురోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీతో పాటు పలు నిపుణుల బృందాలు టన్నెల్ లోపలకు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు యత్నిస్తున్నా బురద, నీటి వల్ల అంతరాయం ఏర్పడుతోంది. అయిదు రోజులు అయినా కనీసం టన్నెల్ లోపల సహాయ కార్యక్రమాలు సజావుగా సాగడం లేదని ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి పరిశీలనలో వెల్లడైంది.
ఆచూకీ లేకుండా పోయిన కార్మికులు
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోయిన ప్రాంతంలో టన్నెల్ బోరింగ్ మెషీన్, పెద్ద పెద్ద బండరాళ్లు, 15 మీటర్ల ఎత్తులో బురద, గంట గంటకు టన్నెల్ గోడల నుంచి 5వేల లీటర్ల నీరు ఉబికి వస్తుంది.దీంతో తాము కనీసం సహాయ కార్యక్రమాలు చేపట్టలేక పోతున్నామని ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన ఓ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అయిదు రోజులు గడిచినా ఇప్పటి వరకు తాము బృందాలుగా లోపలకు వెళ్లి వస్తున్నామే కానీ సహాయ కార్యక్రమాలు చేపట్టలేక పోతున్నామని ఎస్డీఆర్ఎఫ్ అధికారవర్గాలు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా టన్నెల్ లోపల ఆచూకీ లేకుండా పోయిన ఇద్దరు ఇంజినీర్లు, కార్మికుల ఆచూకీని కనిపెట్టలేక పోయాయని ఆర్మీకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.
బురదలో కూరుకుపోయిన కార్మికులు
టన్నెల్ లోపల ఒక్కసారిగా కూలడంతో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులు బురదలో కూరుకుపోయి ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన ఓ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం కష్టమేనని అయిదు రోజులు గడిచిన నేపథ్యంలో వారు ప్రాణాలతో ఉన్నారనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆ అధికారి తెలిపారు. టన్నెల్ కూలిన ప్రాంతంలో దారి మూసుకుపోయిందని , ఇలాంటి భయంకర పరిస్థితుల్లో కార్మికులు బయటపడటం ప్రశ్నార్థకమేనని ఓ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు.
గల్లంతైన వారి జాడ ఏది?
గత అయిదు రోజులుగా భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్,సింగరేణి, జాతీయ రహదారులు, ఎన్‌జీఆర్ఐ, జీఎస్ఐ, ర్యాట్ మైనింగ్ నిపుణుల బృందాలు, నవయుగ, మెఘా, ఎల్ అండ్ టీ, మద్రాస్ ఐఐటీ, హైడ్రా, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు దశలవారీగా టన్నెల్ లోపలకు వెళ్లి సహాయ చర్యలు చేపట్టేందుకు యత్నించినా బురద, గంట గంటకు ఉబికివస్తున్న నీరు ఆటంకంగా మారింది. టన్నెల్ లోపల ఎండో బోట్, ఫోబ్ వంటి కెమెరాలు, స్కానింగ్ పరికరాలను పంపినా టన్నెల్ లోపల గల్లంతైన వారి జాడ మాత్రం తెలియలేదు.
ఆశగా ఎదురు చూస్తున్న బంధువులు
టన్నెల్ లోపల చిక్కుకున్న ఇంజినీర్లు, కార్మికుల బంధువులు జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఎస్ఎల్ బీసీ సొరంగం వద్ద ఉన్న సైట్ కార్యాలయానికి తరలివచ్చి తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జాడ లేకుండా పోయిన కార్మికుల గురించి అధికారులు, పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో గల్లంతైన కార్మికుల బంధువులు సైట్ కార్యాలయం వద్ద విషాద వదనాలతో తమ వారి జాడ కోసం కనిపించిన అధికారినల్లా ప్రశ్నిస్తున్నారు. తమవారిని చూసేందుకు కనీసం టన్నెల్ లోపలకు కూడా తమను అనుమతించడం లేదని సైట్ ఇంజినీరు మనోజ్ కుమార్ బంధువు ఆవేదనగా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
రంగంలోకి దిగిన ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు బుధవారం ఉదయం మార్కోస్ ఆపరేషన్ చేపట్టేందుకు ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మార్కోస్ తోపాటు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది టన్నెల్ వద్దకు వచ్చారు. మార్కోస్ సిబ్బంది టన్నెల్ లోపల పరిస్థితులను పరిశీలించాక అసలు సహాయ కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు.
సర్వశక్తులు ఉపయోగిస్తాం: మంత్రుల బృందం
శ్రీశైలం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలు చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి దేశంలో అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జూపల్లి కృష్ణా రావు లు స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆద్వర్యంలోని మంత్రులబృందం ఎస్ ఎల్ బి సి ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి సహాయ కార్యక్రమాలను స్వయంగా అంచనా వేశారు. అనంతరం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణలు ప్రాజెక్ట్ స్థలంలోని జేపి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రమాద సంఘటన జరిగిన విధానాన్నిరాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తోసహా సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు.
పేరుకున్న బురద
ఎస్ఎల్బీసీ సంఘటన స్థలంలో 40 నుంచి 50 మీటర్ల మేర బురద నిండుకుందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 42 మంది సురక్షితంగా బయటికి రాగా, 8 మంది లోపల చిక్కుకున్నారని వివరించారు. బురద నీటిని వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని వివరించారు. ఎడమకాలువ టన్నెల్ లో 11 కిలోమీటర్ల తర్వాత నీటితో ఉందని, అయినప్పటికీ 11 .5 కిలోమీటర్ల దూరం వరకు వివిధ ఏజెన్సీల రక్షణ బృందాలు వెళ్లగలిగాయని వివరించారు. 13.50 కిలోమీటర్ల వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ.బీ.ఎం ) ఉందని, అక్కడికి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. ఇక్కడినుండి ఎయిర్ సప్లై పైప్ లైన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనదని అన్నారు. సొరంగంలో ఎంత దూరం వరకు బురద, నీరు ఉందనేది జీ.ఎస్.ఐ., ఎం.జీ.ఆర్.ఐ లు అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు. చివరి 40 మీటర్లలో నీరు, బురద మట్టి తో ఉందని ఏవిధమైన రాళ్లు, ఇతర ఘన పదార్థాలు ఉన్నట్టు కనిపించడం లేదని స్పష్టం చేశారు. 15 అడుగుల ఎత్తులో, 200 మీటర్ల వరకు ఈ బురద ఉందని అన్నారు. ప్రస్తుతం టన్నెల్ లో 10 వేల ఘనపుటడుగుల (క్యూబిక్ మీటర్లు ) బురద ఉందని ప్రాథమికంగా అంచనా వేశామని, ఈ బురదనీటిని బయటికి తీయడమే ప్రధాన సవాలుగా ఉందని పేర్కొన్నారు.
కన్వేయర్ బెల్టుకు మరమ్మతులు
కన్వేయర్ బెల్ట్ కు మరమత్తులు జరుగుతున్నాయని, ఈ కన్వేయర్ బెల్ట్ కు రేపు సాయంత్రం లేదా ఎల్లుండి లోగా మరమ్మతులు పూర్తవుతాయని తెలిపారు. ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా గంటకు 800 టన్నుల ఘణపుతడుల బురదను బయటికి తీయ వచ్చని అన్నారు. వీటిని మరింత త్వరిత గతిన వెలికి తీయడానికి అక్కడికి వెళ్లగలిగే జేసీపీ లను తీసుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టన్నెల్ లో గంటకు 3600 నుంచి 5000 లీటర్ల ఊట నీరు వస్తుందని తెలిపారు. లోపలినుండి నీటితోపాటు, బురదను కూడా బయటికి తీయడానికి ఒకే పైప్ లైన్ వినియోగించనున్నామని స్పష్టం చేశారు.
Next Story