ఆరుగురు బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు
ఆరుగురు బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు విధిస్తూ హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు తీర్పు చెప్పింది. మహిళలను వ్యభిచారంలోకి నెట్టిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
మహిళలను వ్యభిచారంలోకి నెట్టిన మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులకు హైదరాబాద్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది.దోషులు మహ్మద్ యూసుఫ్ ఖాన్, అతని భార్య బితీ బేగం, సోజిబ్ రుహుల్, అమీన్ ధాలీ, మొహమ్మద్ అబ్దుల్ సలామ్ కౌన్లా జస్టిన్, షీలా జస్టిన్ అలియాస్ షియులీ ఖాతున్లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2019వ సంవత్సరంలో అరెస్టు చేసింది. వీరిని ఐపీసీ, అనైతిక ట్రాఫికింగ్ లోని వివిధ సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించారు.ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం దోషులకు జీవిత ఖైదుతోపాటు 24వేల జరిమానాను విధించింది.జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు అదనంగా 18 నెలల సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో జడ్జి పేర్కొన్నారు.
ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీసుకువచ్చి...
ఉద్యోగాలు, మంచి జీతం ఇస్తామని చెప్పి బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను మోసగించి, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా చేసి, ఇక్కడ వారిని వ్యభిచారంలోకి దింపినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది.
యువతులను రక్షించిన పోలీసులు
2019వ సంవత్సరం ఆగస్టు నెలలో జరిగిన ఆపరేషన్‌లో హైదరాబాద్‌లోని ఉప్పుగూడలోని కందికల్ గేట్ ప్రాంతంలోని ఒక ఇంటి నుంచి ఐదుగురు యువతులను తెలంగాణ పోలీసులు రక్షించారు. దీనిపై ఛత్రినాక పోలీస్ స్టేషన్లో అసలు కేసు నమోదు చేశారు. ఎన్ ఐ ఏ దర్యాప్తు చేపట్టి 2019 సెప్టెంబర్ 17వ తేదీన కేసును తిరిగి నమోదు చేసింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2020 మార్చి 10వతేదీన నలుగురిపై చార్జిషీట్‌ను దాఖలు చేసింది.ఆ తర్వాత మిగిలిన ఇద్దరిపై 2020 ఆగస్టు నెలలో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.