HYDRAA | భవిష్యత్ తరాల కోసం బాట వేయడమే హైడ్రా గోల్: రంగనాథ్
జీవ వైవిద్య వేడుకలో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఛైర్మన్.. హైడ్రాపై ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్ వేదికగా జరిగిన జీవ వైవిద్యం కోసం చెరువుల సంరక్షణ కార్యక్రమంలో హైడ్రా(HYDRAA)పై నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఛైర్మన్ సి. అచలేందర్ రెడ్డి అభినందించారు. హైదరబాద్‌లో చెరువులు, కుంటల సంరక్షణ కోసం హైడ్రా అహర్నిశలు శ్రమిస్తుందని, వారు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. జీవవైవిద్యానికి ఊతమిచ్చే చెరువుల పరిరక్షణలో హైడ్రాకు నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. ప్రతి నగరంలో హైడ్రా లాంటి వ్యవస్థ ఉండేలా సిఫారసు చేస్తామన్నారు. భవిష్యత్ తరాలకు చక్కటి వాతావరణాన్ని, జీవన విధానాన్ని అందించడంలో హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారి చర్యలను వివరిస్తామన్నారు. హెరిటేజ్ చెరువుగా పేరుగాంచిన అమీన్‌పురా చెరువును మంచినీటి సరస్సుగా మార్చడానికి తమవంతు సహకారం అందిస్తామని.. ఈ విషయంలో హైడ్రా చొరవ బాగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు చక్కని సమాజాన్ని అందించడమే హైడ్రా లక్ష్యమని చెప్పారు.
రంగనాథ్ ఏమన్నారో ఆయన మాటల్లో
- సమస్త జీవకోటికి ప్రాణాధారమైన నీటి వనరులను పరిరక్షించి జీవవైవిద్యాన్నికాపాడేందుకు కృషి చేస్తామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు చెప్పారు.
- ఈ క్రమంలోనే చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణపై ఎక్కువ దృష్టి పెట్టామని.. అన్నారు. చెరువులలో మంచినీరు పుష్కలంగా ఉంచి.. పరిసరాల్లో మొక్కలను నాటి.. పర్యావరణాన్ని కాపాడడంతో పాటు.. జీవ వైవిద్యం ఉండేలా చర్యలు తీసుకుంటాం.
- జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో అర్బన్ బయోడైవర్సిటీ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో శనివారం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారు మాట్లాడారు.
- చెరువులు పరిరక్షణ, వాటి పునరుద్ధరణ, ప్రజావసరాలకోసం కేటాయించిన స్థలాలు, పార్కులు, రహదారులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ కాకుండా చూడడం హైడ్రా ప్రధాన విధి.
- దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పడు.. ప్రజల ప్రాణాలను పరిరక్షించడంతో పాటు.. ఆస్తి నష్టం కాకుండా చూడడం మరో విధి.
- చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, నాలాలు ఆక్రమణల పాలవ్వకుండా.. అనేక చట్టాలున్నాయి. అవన్నీ కచ్చితంగా అమలయ్యేలా హైడ్రా చర్యలు తీసుకుంటుంది.
- ఈ క్రమంలో హైడ్రా పోలీసు స్టేషన్‌ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాం. వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
- హైడ్రా యాక్షన్‌లోకి వచ్చాక.. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల అంశాన్ని అందరూ చర్చించుకుంటున్నారు. తాము కొంటున్న ఇల్లు, లేదా ఇంటి స్థలం చెరువులో ఉందా.. ప్రభుత్వ స్థలమా అన్ని విధాల సరైనదేనా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. శిఖం భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనే విషయాన్ని కూడా ప్రజలు తెలుసుకున్నారు.
- ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, కబ్జా చేయడం పేదవారి కంటే ధనవంతులు, సంపన్నులే ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నారు. అలాగే అన్ని రాజకీయ పార్టీల వారూ ఆక్రమణల్లో ఉన్నారు. ఆక్రమణలకు పాల్పడితే ఏ ఒక్కరినీ వదలం. జూబ్లీహిల్స్‌లోని లోటస్ పాండ్‌లో ఏకంగా ఎకరం స్థలం కబ్జా చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించగా.. హైడ్రా అడ్డుకుంది.
- నగరంలో చెరువులు 61 శాతం కబ్జాకు గురయ్యాయి.. మనం పటిష్ట చర్యలు చేపట్టకపోతే.. ఉన్న 39 శాతం చెరువులు కూడా వచ్చే 15 ఏళ్లలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. చెరువుల పరిరక్షణపై అందరూ దృష్టి పెడుతున్నారు. భవిష్యత్ తరాల వారికి యిది ఎంతో అవసరం.
- ఈ క్రమంలోనే ఎన్ ఆర్ ఎస్ ఏ, సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, ఇరిగేషన్, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ తదితర ప్రభుత్వ విభాగాలన్నిటి సహకారంతో చెరువుల లెక్కతో పాటు.. వాటి విస్తీర్ణం ఎంత ఉందో తేల్చుతాం. పార్కులకోసం కేటాయించిన స్థలాలు, రహదారులు.. ఇలా అన్ని విషయాలపై పూర్తి సమాచారంతో డేటా తయారు చేస్తున్నాం.
- హైడ్రా అంటే కూల్చడం కాదు.. చెరువులను పునరుద్ధరించి.. అక్కడ చక్కటి వాతావరణం ఏర్పడేలా చేయడమే హైడ్రా లక్ష్యం. చక్కటి వతావరణంలో మెరుగైన ప్రజాజీవనం కల్పించడం. ప్రజలకు కూడా హైడ్రా చర్యలపై అవగాహన వచ్చింది. విద్యార్థులు కూడా ఎంతో అవగాహనతో హైడ్రాకు మద్ధతు పలుకుతున్నారు.
- చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ.. అక్కడ నిర్మాణాలు చేపట్టరాదని, చేపడితే వాటిని కూల్చి వేయవచ్చునని కోర్టు తీర్పులు ఎంతో స్పష్టంగా ఉన్నాయి. అలాగే రహదారులు, పార్కులు, ప్రజావసరాలకోసం కేటయించిన స్థలాలు ఆక్రమణలు కాకూండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా కోర్టులు చక్కటి దిశానిర్దేశం చేశాయి. ఇందుకు ఇటీవల హైకోర్టు, సుప్రిం కోర్టు తీర్పులే నిదర్శనం.
- హైడ్రా చర్యలకు ప్రభుత్వ సహకారం మెండుగా ఉంది. భవిష్యత్ తరాలకోసం బాటలు వేయాలని చక్కటి దిశానిర్దేశం ప్రభుత్వం నుంచి ఉంది. అందుకే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నాం. అస్సలు చెరువు ఎలా ఉంటుంది.. చెరువుతో పర్యావరణం ఎలా మెరుగుపడుద్ది అనేది చేసి చూపెడతాం.
- చెరువులు కబ్జా కాకుండా చూడడమే కాకుండా.. కాలుష్యంతో నిండిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలోనే ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సమావేశం అయ్యాం. చెరువులు కలుషితం కాకుండా ఇరు శాఖలు కలసి పని చేయాలని నిర్ణయించాం.
- పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల్లోకి రాకుండా చూస్తాం.. అలాగే గేటెడ్ కమ్యూనిటీలన్నీ ఎస్‌టీపీ(సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు)లు పెట్టుకోవాల్సిందిగా సూచిస్తాం. ఇప్పటికే కొంతమంది పెట్టుకున్నా.. అవి సరిగా పని చేయడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. మేము క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పడు కూడా స్వయానా చూశాం. మున్ముందు మురుగు నేరుగా వదలకుండా చర్యలు తీసుకుంటాం.