బోరున విలపించిన సబితా ఇంద్రారెడ్డి
x

బోరున విలపించిన సబితా ఇంద్రారెడ్డి

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో అగ్గి రాజేశాయి. ఈ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గా సభలో ఆర్గ్యుమెంట్ జరిగింది.


నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గరం గరంగా సాగాయి. డిప్యూటీ సీఎం, ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టగా.. దీనిపై రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో అగ్గి రాజేశాయి. ఈ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గా సభలో ఆర్గ్యుమెంట్ జరిగింది. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది. అసెంబ్లీ నుంచి బయటకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి.. బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అవమానించేలా మాట్లాడారని బోరున విలపించారు.

అసలు రేవంత్ ఏమన్నారంటే...

కేటీఆర్ మాట్లాడితే.. మీరు పోరాటం చేయండి, మేము కలిసికట్టుగా మద్దతిస్తాం అంటున్నారు. వారి ప్రతిపక్ష నాయకుడే సభకి రారు. ఇంక వాళ్ళెక్కడ కలిసికట్టుగా మద్దతు ఇస్తారు. వెనకున్న అక్కల్ని నమ్ముకుంటే కేటీఆర్ గతి జూబిలీహిల్స్ బస్టాండే. ఇక్కడ ముంచే అక్కడ చేరారు అంటూ రేవంత్ ఘాటుగా విమర్శించారు.

సబిత ఆగ్రహం...

ఆయన వ్యాఖ్యలపై సభలో స్పందించిన సబితా ఇంద్రారెడ్డి... రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద వాలితే కాల్చేస్తా అన్నాడు. ఇప్పుడు అంతమందిని ఎందుకు చేస్ర్చుకున్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించా. నీకు మంచి భవిష్యత్తు ఉంది పార్టీలో, సీఎం అవుతావు అని ఒక అక్కగా మనసారా ఆశీర్వదించా. కానీ ప్రతిసారి ముఖ్యమంత్రి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అంటూ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. మేము ముంచాము అని కేటీఆర్ తో అంటున్నారు. మేము ఎవరిని మోసం చేశామో ముఖ్యమంత్రి చెప్పాలి. ఆడబిడ్డల్ని అవమానిస్తున్నారు. సీఎం చేసిన వ్యాఖ్యల్ని విత్ డ్రా చేసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.

భట్టి కౌంటర్..

సబిత ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి తెచ్చుకున్నారని భట్టి విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా.. కాంగ్రెస్ పార్టీ నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే.. నాకు సపోర్ట్ గా ఉండకుండా వారి స్వలాభం కోసం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన నాయకురాలు సబిత ఇంద్రారెడ్డి. ఇంటికెళ్లి బతిమాలినా మీ స్వార్థం కోసం వెళ్లిపోయారు.. ఇంకా ఏం మొహం పెట్టుకుని సీఎం గురించి మాట్లాడుతున్నారు.. బాధ పడాల్సింది మేము, ఆవేదన చెందాల్సింది మేము అని భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.

మోసం చేశారు కాబట్టే చెప్పిన.. -రేవంత్

భట్టి మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ప్రజా జీవితం లో ఉన్నప్పుడు చర్చ ఉంటుంది. వ్యక్తిగత సంభాషణని సబితక్క సభలో పెట్టారు కాబట్టి చెబుతున్నా.. అక్క నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమే. నువ్వు సీఎం అవుతావు అని కూడా చెప్పారు. 2019లో మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ నన్ను కోరింది. అక్కడ పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారు. నాకు టికెట్ వచ్చిన వెంటనే కేసీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్ లో చేరారు. అధికారం కోసం బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. అండగా ఉంటానని చెప్పి, తమ్ముడిలాంటి నన్ను మోసం చేశారు కాబట్టే ఆమెను నమ్మవద్దని కేటీఆర్ కు చెప్పా' అని రేవంత్ అన్నారు.

విలపించిన సబిత...

సభ అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి సబితా ఇంద్రారెడ్డి మీడియా ఎదుట మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మహిళలను అవమానించారన్నారు. వారి మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. "మీ వెనుక కూర్చొన్న మహిళలని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే దిక్కు అంటూ మమ్మల్ని అవమానపరిచారు. అక్కలను నమ్ముకుంటే బతుకు ఆగమైపోతదని అన్నట్లుగా సీఎం మాట్లాడారు. మమ్మల్ని నమ్మితే బతుకు బస్టాండ్ అన్న మాట నాకు చాలా బాధనిపిస్తోంది అని బోరున విలపించారు సబిత.

"భట్టి కూడా నా కారణంగానే ఎల్ఓపీ పోయిందన్నట్లుగా అన్నారు. ఏ మొఖం పెట్టుకొని వచ్చారని ఆయన అన్నారు.. ఇది చాలా బాధనిపించింది. మేము ఏం తప్పు చేయలేదు.. చాలా మంది పార్టీలు మారారు. మేము కాంగ్రెస్ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందో.. ఎలా మెడబట్టి బయటకు గెంటే ప్రయత్నం చేశారో మాకే తెలుసు. ఇది మమ్మల్ని మాత్రమే కాదు మొత్తం తెలంగాణ మహిళలను అవమానించినట్లే. వెంటనే మమ్మల్ని అన్న మాటలకు క్షమాపణ చెప్పాలి" అని సబితా ఇంద్ర రెడ్డి డిమాండ్ చేశారు.

Read More
Next Story