కేసీఆర్ లేఖ క్షుణ్ణంగా చదివా... ఆ అద్భుతాలన్నీ విద్యార్థులకు బోధించాలి
x

'కేసీఆర్ లేఖ క్షుణ్ణంగా చదివా... ఆ అద్భుతాలన్నీ విద్యార్థులకు బోధించాలి'

లేఖలో తెలంగాణను విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడంలో కేసీఆర్.. సాంకేతిక నిపుణుల బృందం దార్శనికత, శ్రమను స్పష్టంగా చిత్రీకరించారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.


ముఖ్యమైన స్థానాలకు వ్యక్తులను ఎన్నుకునే ముందు ప్రభుత్వం క్షుణ్ణంగా నేపథ్యాన్ని తనిఖీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. విద్యుత్ పాలసీపై విచారణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే...

"తెలంగాణ విద్యుత్ పాలసీపై జస్టిస్ నర్సింహారెడ్డి జారీ చేసిన నోటీసుపై కేసీఆర్ ఇచ్చిన రిప్లై నేను క్షుణ్ణంగా చదివాను. 12 పేజీల లేఖలో తెలంగాణను విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడంలో కేసీఆర్.. సాంకేతిక నిపుణుల బృందం దార్శనికత, శ్రమను స్పష్టంగా చిత్రీకరించారు. దక్షిణ తెలంగాణలో కృష్ణా నది ఒడ్డున థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం నన్ను విశేషంగా ఆకట్టుకుంది. 5000 మెగావాట్ల లోటు అగాధం నుంచి 20,000 మెగావాట్ల సామర్థ్యానికి గరిష్ట స్థాయికి చేరుకోవడం అంటే సామాన్యమైన విజయం కాదు. మన స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ లాగా ఇంతటి భారీ దార్శనిక ప్రాజెక్టులను రికార్డు సమయంలో చేపట్టి పూర్తి చేయలేరు. వాస్తవానికి ఈ గొప్ప విధాన అద్భుతాలన్నింటినీ దేశవ్యాప్తంగా వ్యాపార, పబ్లిక్ పాలసీ పాఠశాలల్లో కేస్ స్టడీస్‌గా బోధించాలి.

వైద్యులు అత్యవసర వార్డులలో రోగులకు చికిత్స చేసినప్పుడు, ల్యాబ్ పరీక్షల ఫలితాలలో ఖచ్చితత్వం పట్టించుకోరు. కొందరు ఇలాంటి పరీక్షల్లో సమయాన్ని కూడా వృథా చేయరు. వారు మొదట ప్రాణాలను రక్షించడానికి వారి గట్ ఫీలింగ్ ని అనుసరిస్తారు. 2014లో తెలంగాణ కేసు కూడా అలానే ఉంది. లైఫ్ సపోర్ట్ పై ఉన్న రాష్ట్రం విషయంలో కేసీఆర్ కూడా అలానే వ్యవహరించారు.

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలనపై ఆసక్తి కలిగి ఉండి, తమకంటూ మంచి పేరు తెచ్చుకుంటే, మునుపటి ప్రభుత్వం ఇప్పటికే నిర్మించిన దాని సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరచాలనే దానిపై వెంటనే దృష్టి పెట్టాలి. కమీషన్లను ఏర్పాటు చేయడం వల్ల సమయం, ప్రజాధనం వృధా చేయడమే కాకుండా, ప్రస్తుత పాలక యంత్రాంగం ప్రతీకార వైఖరిని బయటపెడుతోంది.

ఓయూ భూములను ఆక్రమించారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి, 2006లో సీటు బెల్టు పెట్టుకోనందుకు ఎస్‌ఐ జరిమానా విధించినందుకు రచ్చ సృష్టించిన న్యాయమూర్తి, బీహార్‌లో 'మొఘల్ బాద్‌షా' లా వ్యవహరించడంతో వీడ్కోలుకు హాజరుకావడానికి సహచరులు నిరాకరించిన న్యాయమూర్తి... జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశంపై విచారించేందుకు ఏర్పాటైన కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉండే అర్హత లేదు. ముఖ్యమైన స్థానాలకు వ్యక్తులను ఎన్నుకునే ముందు ప్రభుత్వం క్షుణ్ణంగా నేపథ్య తనిఖీలు చేసి ఉండాలి.

"జస్టిస్ నర్సింహారెడ్డి గారూ, దయచేసి నైతిక విలువలతో, సాంకేతిక కారణాలతో మీరే కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోండి. మీకు గానీ, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి కేసీఆర్, ఆయన సాంకేతిక నిపుణుల బృందం ఏమి చేశారో వ్యాఖ్యానించే హక్కు లేదు. తీర్పు చెప్పే హక్కు చరిత్రకు మాత్రమే ఉంది." అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జస్టిస్ నరసింహారెడ్డిని విమర్శించారు.

Read More
Next Story