RS Praveen | మంత్రిపదవిలో ఉండే అర్హత కొండా సురేఖకు లేదా..?
తనపై కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఆర్‌ఎస్ ప్రవీణ్ తిప్పికొట్టారు. ఆధారాలు ఉంటే సీబీఐకి ఇవ్వాలంటూ ఛాలెంజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తీవ్ర విమర్శలు చేశారు. అసలు మంత్రి పదవిలో ఉండే అర్హత ఆమెకు లేదన్నారు. ఆమెను తెలంగాణ ప్రజలు గతంలోనే తిరస్కరించారని, మహిళలు ఉద్దేశించి ఆమె చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టే చెప్పిందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తనపై కూడా కొండా సురేఖ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు చేస్తూ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గతంలో ఐపీఎస్ అధికారికగా ఉన్న తనను కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చి సత్కరించిందని గుర్తు చేశారు. అటువంటి విద్యార్థులకు పెట్టే ఆహారంపై తాను కుంభకోణాలు చేశానని కొండా సురేఖ అనడం ఏమాత్ర సబబు కాదని, అందుకు తగ్గ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఆరోపణలన్న మాత్రం నోటికి వచ్చింది మాట్లాడటం కాదని, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అయితే ప్రస్తుతం తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లోని విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, తినడానికి నాణ్యమైన ఆహారం, తాగడానికి శుభ్రమైన తాగునీరు కూడా వారికి అందడం లేదని ఆయన విమర్శించారు.
వారి కోసం ‘గురుకులా బాట’
‘‘తెలంగాణలోని గురుకుల విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘గురుకుల బాట’ అనే కార్యక్రమాన్ని చేరపట్టారు. బీఆర్ఎస్ చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నులో వణుకుపుట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యాశాఖకు మంత్రి లేరు, సంక్షేమ శాఖకు మంత్రిలేరు. రాష్ట్రంలోని గురుకులాలు ప్రమాదంలో ఉన్నాయి. నాణ్యమైన భోజనం కోసం విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి’’ అని విమర్శలు గుప్పించారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఏడేళ్ల సర్వీస్‌ను వదిలి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. అటువంటి తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని కొండా సురేఖ ఆరోపించారని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. ఈ విషయంలో సాక్ష్యాలు ఉంటే తనపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా అన్నారు.
కొండా సురేఖ ఏమన్నారంటే..
‘‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గురుకుల సెక్రటరీగా పని చేసి కోట్ల కుంభకోణం చేశారు. గత ప్రభుత్వం ప్రవీణ్ కుమార్‌పై విచారణ చేయలేదు. ఫుడ్ పాయిజన్ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రమేయం ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనను సైకో రావు నడుపుతున్నారు అని నేను నమ్ముతున్నా. ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో మాఫీయా నడిపారు. గతంలో జరిగిన తరహాలో అన్యాయాలు, అక్రమాలు జరుగకుండా పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించటానికి టెండర్ ప్రక్రియ ద్వారా సరకులు అందిస్తున్నాం’’ అని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు.