ఆలయ అన్నదాన సత్రం నిర్మాణానికి రూ 35.25 కోట్లు
ఆగష్టు నెలలో స్వామి వారి దర్శనానికి వచ్చినపుడు హామీ ఇచ్చి, కేవలం మూడు నెలలు గడిచేలోగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేయించారు.స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా, మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం చెప్పారు. వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి అన్నదాన సత్రం మంజూరు చేయడం పై రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
రూ.76 కోట్లతో రాజన్న సన్నిధి అభివృద్ధి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద రూ.76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి పూజ నిర్వహించారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు సీఎంకు వివరించారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు
సీఎం రేవంత్ కు స్వాగతం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయం లోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి , రాజరాజేశ్వరి అమ్మవారు వద్ద అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలను ముఖ్యమంత్రి నిర్వహించారు. పూజల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రి వర్యులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు
సీఎం రేవంత్ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే లు మేడిపల్లి సత్యం , కవంపల్లి సత్యనారాయణ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్,డిజిపి జితేందర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.
రూ.235 కోట్లతో మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు
రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. రూ.50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. రూ.45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ చేశారు.
పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
రూ.52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, రూ.3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి సీఎం శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలో రూ.26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని సీఎం ప్రారంభించారు.గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు రూ.85 లక్షల పరిహారాన్ని పంపిణీ చేశారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును సీఎం పంపిణీ చేశారు.