Residential Schools | గురుకులాల బాగుకు రేవంత్ సర్కార్ చర్యలు
తెలంగాణలోని గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలతో సర్కారులో కదిలిక వచ్చింది.గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల బాగుకు కదిలింది.
తెలంగాణలోని గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలతో సర్కారులో కదిలిక వచ్చింది. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేయని విధంగా డైట్ చార్జీలు పెంచడంతో పాటు కామన్ డైట్ మెనూను రేవంత్ సర్కారు శనివారం విడుదల చేసింది.
- రాష్ట్ర వ్యాప్తంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో సహా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గురుకులాలు, హాస్టళ్ల బాట పట్టారు.సీఎంతోపాటు మంత్రులు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేయడంతోపాటు శనివారం మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
- రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచుతాం : సీఎం రేవంత్ రెడ్డి
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని సీఎం అనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని సీఎం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారని, రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకున్న వారు ఎంతో మంది ఐఎఎస్, ఐపీఎస్ లుగా ఎంపికయ్యారని ఐఏఎస్ బుర్రా వెంకటేశం ,ఐపీఎస్ మహేందర్ రెడ్డి లు రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులేనని సీఎం పేర్కొన్నారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలలో సంపూర్ణ విశ్వాసం కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని,విద్యా వ్యవస్థను సమూలంగాప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం చెప్పారు.
డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం
పెరిగిన ధరలు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డైట్ చార్జీలు 40శాతం, కాస్మోటిక్ 200 శాతం పెంచామని సీఎం రేవంత్ చెప్పారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం పెంచడం ఎక్కడా జరగలేదన్నారు.రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23లక్షలు మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, 11వేల ప్రయివేటుశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన చెప్పారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు
‘‘ఫుడ్ పాయిజన్ జరిగి ఈ మధ్య ఒక బాలిక మరణించింది.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు..శ్రీమంతుడుకి , పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుంది..మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం చెప్పారు.ప్రతీ నెలా 10వ తేదీలోగా గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు అందజేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం,వారంలో రెండు,మూడు రోజులు రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం’’అని సీఎం తెలిపారు.
నిరుద్యోగుల్లో నైపుణ్యం పెంచుతాం
నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతోంది...అందుకే రాష్ట్రంలో 75 ఐటీఐ లను టాటా సంస్థతో కలిసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసాం..యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తున్నాం..2028 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నాం.క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిఖత్ జరీన్, సిరాజ్ లాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.క్రీడల్లో రాణించండి... మీలో టాలెంట్ కు సాన పట్టండి.
మెస్ మేనేజ్ మెంట్ కమిటీలు
‘‘భవిష్యత్ లో నేను ఎక్కడికి వెళ్లినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా..ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తప్పవు, విద్యార్థులతో మెస్ మేనేజ్ మెంట్ కమిటీలను ఏర్పాటు చేయండి..వారు తినే ఆహారాన్ని వాళ్లే మానిటరింగ్ చేసుకునే వీలు కల్పించాలని అధికారులను ఆదేశిస్తున్నా’’అని సీఎం పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి భోజనం చేశారు. మధిర నియోజకవర్గం బోనకల్ లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
నేటి నుంచి వసతి గృహాల్లో కొత్త మెనూ ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లు , గురుకులాల్లో పండుగ వాతావరణం నెలకొంది. శనివారం నుంచి కొత్త మెనూ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో నేడు కొత్త మెనూ ప్రారంభం అయింది.పోషకాహారం తో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం డైట్ చార్జీలను ఒక్కసారిగా 40 శాతం పెంచింది. కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచింది. పెంచిన చార్జీల ప్రకారం మెనూలో మార్పులు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయనున్నారు.
ఫలితంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు పోషకాహారం తో పాటు రుచికరమైన భోజనం అందుబాటులోకి వచ్చింది. పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పించారు.పెంచిన మెస్, కాస్మోటిక్స్ చార్జీలతో రాష్ట్ర ప్రభుత్వంపై రెండు సంవత్సరాలకు 470 కోట్ల అదనపు భారం పడనుంది.
Hon'ble Chief Minister Sri A. Revanth Reddy's Visit to TG Social Welfare Residential School at Chilkoor under Uniform Diet Programme https://t.co/jkLcqCrxbK
— Telangana CMO (@TelanganaCMO) December 14, 2024
Next Story