ఒలింపిక్స్ లక్ష్యంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్
దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం ఆయన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) హైదరాబాద్ మారథాన్ లో పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మారథాన్ విజేతలకు సీఎం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్పోర్ట్స్ ఈవెంట్స్ కే గచ్చిబౌలి విలేజ్ ని ఉపయోగిస్తామని తెలిపారు. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లు ఎక్కువ పతకాలు సాధించేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే సంవత్సరం ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఖేలో ఇండియా నిర్వహణను తెలంగాణకి ఇవ్వాలని కోరినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్డింగ్ మన దేశం గెలిస్తే హైదరాబాద్ లో గేమ్స్ నిర్వహించే అవకాశాన్ని రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది అని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ వేదికగా మాట ఇస్తున్నానన్నారు.
"గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం. ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్ లో ప్రారంభించబోతున్నాం. అంతర్జాతీయ స్ధాయి కోచ్ లను తీసుకొచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తాం. ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపాము" అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.