ప్రతి సీఎంకి ఒక బ్రాండ్ ఉంది: రేవంత్
x

ప్రతి సీఎంకి ఒక బ్రాండ్ ఉంది: రేవంత్

దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు.. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు అని చెప్పారు.


భారతదేశం ఇప్పుడు ప్రపంచదేశాలతో పోటీ పడుతోందంటే అందుకు ఆనాడు నెహ్రూ చూపిన దార్శనికతే కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి చిల్లా మంచిరేవులలో ఆయన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు. అనంతరం భారతదేశ విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలన్నీ కూడా నెహ్రూ స్థాపించినవేనన్నారు.

‘‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతీ పోలీస్ సిబ్బందికి ఇది అత్యంత ముఖ్యమైనది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచాం. ఆనాడు పండిట్ జవహర్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయి. నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరింది. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు.. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయి’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానంసంపాదించుకున్నారు. హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్ ను గుర్తుంచుకుంటారు. అలాగే ఇవాళ నేను క్రియేట్ చేసిన నా బ్రాండ్ “యంగ్ ఇండియా”. మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నాం. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది మా బ్రాండ్. నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం’’ అని తెలిపారు.

‘‘ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నాం. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది. దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి… ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైనిక్ స్కూల్ కు ధీటుగా పోలీస్ స్కూల్ ను తీర్చి దిద్దాలి. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పోలీస్ స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీస్ స్కూల్ కు ఆర్ధిక సాయం అందించాలి. పోలీస్ స్కూల్ కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story