రేవంత్ ఢిల్లీ టూర్ మతలబేంటి?
x

రేవంత్ ఢిల్లీ టూర్ మతలబేంటి?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. సీఎం అయిన తర్వాత ఏడు నెలల కాలంలో 20 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్, ఇవాళ 21 వ సారి ఢిల్లీ వెళ్లడం.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. సీఎం అయిన తర్వాత ఏడు నెలల కాలంలో 20 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్, ఇవాళ 21 వ సారి ఢిల్లీ వెళ్లడం వెనక మతలబేంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో ఢిల్లీ పాలన అంటూ విమర్శిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి రేవంత్ ఢిల్లీ టూర్ లో కొన్ని ముఖ్యమైన పనులు చక్కబెట్టుకురానున్నారని తెలుస్తోంది.

రాహుల్ కి ఆహ్వానం...

రైతు రుణమాఫీ అమలు చేస్తున్న నేపథ్యంలో వరంగల్ కృతజ్ఞత సభ నిర్వహించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ సభకు రావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వనించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ లతో కలసి రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ కానున్నారు. కృతజ్ఞత సభకి రావాలని పిలవనున్నారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి శనివారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా శనివారం ఉదయం హస్తినకు చేరుకుని ఎన్డీఎస్ఏ చైర్మన్ తో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ అమలు ప్రక్రియను ప్రారంభించడంతో.. 2022 లో 'వరంగల్ డిక్లరేషన్' పేరుతో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకున్నట్లయింది. ఇదే విషయాన్ని ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్ కు ఈ ముగ్గురు నేతలు వివరించనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామనే విషయాన్ని రాష్ట్ర ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతోపాటు, రుణమాఫీ అమలుపై జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చేయడంలో భాగంగా అదే వరంగల్ లో ఈ నెలాఖరులో రైతు కృతజ్ఞత సభకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర టూర్ కు రాహుల్ ని ఆహ్వానించనున్నారు.

మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై చర్చలు...

ఆషాఢమాసం రాకముందే రెండవ క్యాబినెట్ విస్తరణ, పీసీసీ నియామకం జరపాలని రాష్ట్ర కాంగ్రెస్ భావించింది. దీనిపై రేవంత్ రెడ్డి హస్తినలో మకాం వేసి చర్చలు కూడా జరిపారు. ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణపై స్పందిస్తూ... కాంగ్రెస్ బీఫార్మ్ పై గెలిచినవారికే మంత్రి పదవులు ఉంటాయని ప్రకటించారు కూడా. కానీ ఆయన ఢిల్లీ నుంచి ఉట్టి చేతులతో వచ్చారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై నిరన్యం జరగలేదు. ఇంతలో ఆషాఢమాసం కూడా వచ్చేసింది. దీంతో నెలరోజులు నియామకాలకు బ్రేక్ పడింది.మరో రెండు వారాల్లో ఆషాఢమాసం ముగియనుంది. దీంతో మరోసారి పెండింగ్ లో ఉన్న మంత్రి పదవులు, పీసీసీ చీఫ్ నియామకంపై చర్చలు జరిపేందుకే సీఎం ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇంకా మంత్రివర్గ విస్తరణలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే.

నామినేటెడ్ పదవులపైనా నిర్ణయం...

రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ లు ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో భేటీ అవనున్న తరుణంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులపైనా ఆసక్తి నెలకొంది. పదవులు ఆశిస్తున్నవారిలో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర సర్కార్ పది రోజుల కిందట 35 రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఇంకా 20 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో జరిగిన నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతోపాటు పలువురు మహిళా నేతలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా, కేసీ వేణుగోపాల్ ని కలిశారు. సోమవారం రాహుల్ ను కలిసి విషయాన్ని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఉత్తమ్ అక్కడే ఉండడంతో వారిని కూడా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు కలిసే అవకాశం ఉంది.

Read More
Next Story