తెలంగాణ విద్యార్థులకు అక్షయపాత్ర
x

తెలంగాణ విద్యార్థులకు 'అక్షయపాత్ర'

కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టు పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.


హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టు పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. కొడంగల్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో ప్రతి రోజు 28వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సీఎస్సార్‌ ఫండ్స్‌తో నిర్వహించే ఈ కార్యక్రమంపై ఫౌండేషన్ ప్రతినిధులతో ఆదివారం ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నందున, ఆ అంశంపై పూర్తిగా అధ్యయనం చేయాలని సీఎం ఇస్కాన్ ప్రతినిధులు సూచించారు.

ఇస్కాన్ అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..

అక్షయ పాత్ర ఫౌండేషన్ భారతదేశంలోని కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) కి సంబంధించిన లాభాపేక్షలేని ట్రస్ట్. ఈ సంస్థ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని (పాఠశాల మధ్యాహ్న భోజన కార్యక్రమం) నిర్వహిస్తోంది. తెలంగాణలోను పలు ప్రాంతాల్లో వీరి సెంట్రలైజ్డ్ కిచెన్స్ నుండి వేలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు.

మార్చి 2018లో కందిలో ప్రారంభమైన అక్షయపాత్ర వంటశాల 1,134 పాఠశాలల్లో 92,371 మంది పిల్లలకు ఆహారం అందిస్తోంది. నార్సింగిలో 2017 సెప్టెంబర్‌లో వంటశాల ప్రారంభం కాగా.. ప్రస్తుతం 187 పాఠశాలల్లో 28,773 మంది చిన్నారులు భోజనం చేస్తున్నారు. నవాబ్‌పేటలోని వంటగది జూలై 2019లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇక్కడ నుంచి ప్రస్తుతం 383 పాఠశాలల్లో 26,508 మంది పిల్లలకు ఆహారం అందిస్తోంది. 2017 ఆగస్టులో వరంగల్‌లో మొదలవ్వగా... ప్రస్తుతం 152 పాఠశాలల్లోని 12,517 మంది పిల్లలకు ఈ కేంద్రీకృత వంటశాల ద్వారా ఆహారం అందిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తోన్న మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. నాణ్యత లోపంతోపాటు, కలుషిత ఆహరం తిని అనేకమంది చిన్నారులు తరచూ ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా మొదట కొడంగల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు.

హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ "అన్నపూర్ణ"

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హ‌రేకృష్ణ మూమెంట్ ఛారిట‌బుల్ ఫౌండేష‌న్ సహకారంతో 2014 మార్చి 1న నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ వ‌ద్ద అన్నపూర్ణ భోజన పథకం ప్రారంభించబడింది. మొదట ప్రయోగాత్మకంగా 8 కేంద్రాల‌లో రోజుకు 2,500 మందికి భోజ‌నాన్ని అందించారు. ఆ తరువాత ద‌శ‌ల‌వారిగా న‌గ‌రంలోని పలు ప్రాంతాలలో దాదాపు 150 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రోజుకు 45 వేల అన్నపూర్ణ భోజనాలను అందించేవారు. ఈ పథకంలో భాగంగా రూ. 5కే భోజనం అందించేందుకు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ తో హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం లబ్ధిదారులు 5 రూపాయలు చెల్లించనుండగా, రూ. 19.25 జీహెచ్‌ఎంసీ చెల్లిస్తోంది.

Read More
Next Story