చంద్రబాబుకు రేవంత్ సర్టిఫికేట్
x

చంద్రబాబుకు రేవంత్ సర్టిఫికేట్

చంద్రబాబునాయుడు వ్యక్తిత్వంపై రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెట్లు చేశారు


చంద్రబాబునాయుడు వ్యక్తిత్వంపై రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెట్లు చేశారు. ఒక విధంగా చంద్రబాబుకు రేవంత్ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చినట్లే ఉంది. మీడియాతో మాట్లాడుతున్నపుడు లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డి ఇంటిముందున్న సెక్యూరిటి నిర్మాణాలను కూల్చేసిన విషయం ప్రస్తావనకు వచ్చింది. చంద్రబాబు తనకు ఫోన్ చేసి జగన్ ఇంటిముందున్న సెక్యూరిటి నిర్మాణాలను కూల్చేయించారనే ప్రచారంలో వాస్తవంలేదన్నారు.

చంద్రబాబు మరీ ఇంత చిల్లరగా వ్యవహరించరని రేవంత్ చెప్పారు. జగన్ ఇంటిముందున్న సెక్యూరిటి నిర్మాణాల కూల్చివేతకు చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు. తనకు ఫోన్ చేసి సెక్యూరిటి నిర్మాణాలను కూల్చేయమని చెప్పేంత స్ధాయి కాదు చంద్రబాబుది అన్నారు. ఒక మంత్రిపట్టుబట్టి జగన్ ఇంటిముందున్న నిర్మాణాలను కూల్చేయించినట్లు రేవంత్ చెప్పారు. అయితే ఆ మంత్రి ఎవరో మాత్రం చెప్పలేదు. నిర్మాణాలను కూల్చకుండా అడ్డుపడమని వైవీ సుబ్బారెడ్డి 50 సార్లు ఫోన్లు చేసినట్లు తెలిపారు. అలాగే ఖమ్మంకు చెందిన ఒక మంత్రి ద్వారా కూడా నిర్మాణాల కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నంచేసినట్ల చెప్పారు. అయినా సదరు మంత్రి అంగీకరించకుండా పట్టుబట్టి నిర్మాణాలను కూల్చివేయించినట్లు రేవంత్ చెప్పారు. నిర్మాణాల కూల్చివేత విషయం తన దృష్టికి రాగానే వెంటనే సంబంధిత అధికారిని జీఏడీకి అటాచ్ చేసినట్లు చెప్పారు.

చంద్రబాబుతో వ్యక్తిగత సంబంధాలున్నా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎలా పరితపిస్తారో తెలంగాణా ప్రయోజనాల కోసం తానూ అదే విధంగా తపిస్తానని గుర్తుచేశారు. ఏపీ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ఉన్నా తెలంగాణా ప్రయోజనాల విషయంలో రాజీపడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదన్నారు. చంద్రబాబు చెప్పారని, చంద్రబాబు కోసమని తాను తెలంగాణా ప్రయోజనాల కోసం రాజీపడితే ప్రజలు తనను ఎందుకు రాజకీయాల్లో ఉంచుతారని ఎదురు ప్రశ్నించారు. తన ఉద్యోగం కోసమే చంద్రబాబును వదిలివచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. చంద్రబాబు కోసం తన ఉద్యోగాన్ని వదులుకుంటారా ? అని అడిగారు. మొత్తంమీద రేవంత్ తాజా వ్యాఖ్యలతో అవసరమైతే చంద్రబాబును ఢీ కొంటాననే సంకేతాలను పంపించినట్లు అర్ధమవుతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విభజన చట్టం ప్రకారం పరిష్కారమవ్వాల్సిన రెండు రాష్ట్రాల ప్రయోజనాలపై వివాదాలు బాగా పెరిగిపోయాయి. 2014లో ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీయార్, చంద్రబాబు కూర్చుని పరిష్కరించుకోవాల్సిన సమస్యలపై దృష్టిపెట్టలేదు. పైగా కేసీయార్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు చంద్రబాబు ఓటుకునోటు వ్యవహారానికి తెరలేపారు. ఆ విషయం బయటపడగానే అప్పట్లో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య లాంటి కొందరిని కేసీయార్ ప్రభుత్వం అరెస్టుచేసింది. ఆ దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ వదిలి విజయవాడకు వెళ్ళిపోయారు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అలాగే ఉండిపోయాయి. పైగా విభజన చట్టాన్ని లెక్కచేయకుండా కేసీయార్ కొన్ని సంస్ధలను ఏకపక్షంగా సొంతం చేసేసుకున్నారు. దానిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తంచేసినా లెక్కచేయలేదు.

తర్వాత వచ్చిన జగన్ కూడా విభజన సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టలేదు. దాంతో సమస్యలు పెరిగిపోయి ఇపుడు వివాదంగా మారిపోయాయి. కాబట్టి రెండురాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం అంత సులభంకాదు. ఇదే సమయంలో గట్టిగా ప్రయత్నిస్తే పరిష్కారం కానంత జటిల సమస్యలు కూడా కావు. కాకపోతే త్యాగాలకు రెండు ప్రభుత్వాలు సిద్ధపడి, పట్టువిడుపులు ప్రదర్శిస్తే కేంద్రప్రభుత్వ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కారమయ్యే అవకాశముంది. మరి చంద్రబాబు కోసం తన ఉద్యోగం వదులుకుంటానని అని గంభీరంగా ప్రకటించిన రేవంత్ చర్చల్లో కూర్చున్నపుడు ఏమిచేస్తారో చూడాలి.

Read More
Next Story