గణేష్ ఉత్సవాల్లో వెల్లివిరిసిన మతసామరస్యం,ముస్లింలు ఏం చేశారంటే...
తెలంగాణలో మతసామరస్యం వెల్లివిరిసింది.ఖమ్మం,అసిఫాబాద్‌లలో గణేష్ లడ్డూలను ముస్లింలు దక్కించుకున్నారు.చిల్కూరు ఆలయఅర్చకులు మిలాద్‌ఉన్ నబీ వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ సంస్కృతి విలసిల్లింది. మిలాదున్ నబీ, గణేష్ ఉత్సవాల్లో మతసామరస్యం వెల్లివిరిసింది. ఖమ్మంలో జరిగిన వేలంలో గణేష్ లడ్డూలను ముస్లిం షేక్ లతీఫ్ దక్కించుకున్నారు. మరోవైపు కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో జరిగిన వేలంలో గణేష్ లడ్డూను అఫ్జల్, ముస్కాన్ దంపతులు దక్కించుకున్నారు.మిలాద్ ఉన్ నబీ సందర్భంగా చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ హైదరాబాద్ నగరంలోని మసీదును సందర్శించి, రక్తదానం చేసి పరమత సహనాన్ని చాటుకున్నారు.
గణేష్ లడ్డూను వేలంలో గెల్చుకున్న ముస్లిం
ఖమ్మం నగరంలో రెండు లడ్డూలను వేలం వేయగా స్థానిక వ్యాపారి షేక్ లతీఫ్ తన కుమారుడు షేక్ హనీఫ్ అయ్యన్ పేరు మీద లక్కీ డ్రాలో లడ్డూను గెలుచుకున్నారు. దీంతో ఖమ్మం నగరంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఖమ్మం నగరంలో మొదటిసారి ఓ ముస్లిం వేలంలో గణేష్ లడ్డూను దక్కించుకున్నారు.నగరంలోని 33వ మున్సిపల్ డివిజన్‌లోని గాంధీనగర్‌కు చెందిన ముస్లిం కుటుంబ సభ్యులు దేవీ నవరాత్రులు, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. గత మూడేళ్లుగా హిందూ-ముస్లింల ఐక్యతను పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ లడ్డూ వేలంలో లతీఫ్ కుటుంబ సభ్యులు షేక్ ఫిరోజ్, షేక్ యాకూబ్, జానీ, బాల గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మణికంఠ, శ్వేతార్థ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకురాలు సుగుణ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ పట్టణంలో...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని భట్పల్లిలోని శ్రీ విఘ్నేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డూను రూ.13,126కు దంపతులు అఫ్జల్, ముస్కాన్ దంపతులు దక్కించుకున్నారు. పండల్‌లో జరిగిన వేలం పాటలో దంపతులు రూ.13,126కు లడ్డూను దక్కించుకున్నారు.ఆసిఫాబాద్ పట్టణంలో ముస్లిం మతానికి చెందిన అఫ్జల్, ముస్కాన్ దంపతులు భక్తిప్రపత్తులతో గణేష్ లడ్డూను దక్కించుకొని మతసామరస్యాన్ని చాటుకున్నారు.నిమజ్జనంలోనూ పలువురు ముస్లింలు పాల్గొని పరమత సహనాన్ని చాటుకున్నారు.
లడ్డూ ప్రసాదాన్ని అందరికీ పంచుతాం : అఫ్జల్, ముస్కాన్ దంపతులు
గణేష్ లడ్డూ వేలంలో గెలవడం గౌరవంగా భావిస్తున్నామని అఫ్జల్, ముస్కాన్ దంపతులు తెలిపారు. ప్రతి ఒక్కరికీ లడ్డూ ప్రసాదాన్ని పంచుతామని వారు పేర్కొన్నారు.మత సామరస్యంతో తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు.
మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో బాలాజీ ఆలయ అర్చకులు
చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ హైదరాబాద్ నగరంలోని మసీదును సందర్శించి మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రక్తదానం చేశారు.హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ఆలయ పూజారి పాల్గొన్నారు. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని మసీద్-ఈ-మహమ్మద్ హుస్సేన్ వద్ద నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తాన్ని సేకరించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మత సామరస్యాన్ని వ్యాప్తి చేశారు.
రక్తదానం చేసిన ఆలయ అర్చకులు
హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సంవత్సరాలుగా చేస్తున్న కృషిని ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ అభినందించారు. మసీదులో రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముస్లిం సోదరుల కృషిని అభినందించారు. వారి రక్తదానం ప్రాణాలను కాపాడేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన ఇంజినీరింగ్ బ్యాచ్‌మేట్స్ ముజ్తబా హసన్ అస్కారీ, సిఎస్ రంగరాజన్ రక్తదాన కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు వారి మధ్య ఉన్న స్నేహం, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.నగరంలో వినాయక చతుర్థి సందర్భంగా హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చూసి తాను నిజంగా స్ఫూర్తి పొందానని ముజ్తబా హసన్ అన్నారు.
గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతం : తెలంగాణ డీజీపీ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం పోలీసుల కనుసన్నల్లోనే ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు.ప్రజలు మతసామరస్యంతో గణేష్ ఉత్సవాలతోపాటు మిలాద్-ఉన్-నబీని జరుపుకున్నారని డీజీపీ పేర్కొన్నారు. ‘‘శాంతి, దయ, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి , సమాజ శ్రేయస్సు కోసం పని చేయడానికి కలిసి రండి.అందరికీ మిలాదున్ నబీ, గణేష్ ఉత్సవ శుభాకాంక్షలు’’ అని డీజీపీ తెలిపారు.
Next Story