ఈ మాజీ పోస్టు మాస్టర్ కు పిచ్చుకలే ప్రపంచం
x
రజాక్ ఏర్పాటు చేసిన పక్షిగూళ్లలో పిచ్చుకల సందడి

ఈ మాజీ పోస్టు మాస్టర్ కు పిచ్చుకలే ప్రపంచం

ఊరపిచ్చుకలంటే అతనికి ప్రాణం...పిచ్చుకల పరిరక్షణకు మాజీ పోస్ట్ మాస్టర్ రజాక్ 15 ఏళ్లుగా పాటుపడుతున్నారు.


హైదరాబాద్ శివార్లలోని మీర్ పేట ప్రశాంతిహిల్స్ కాలనీలోని విశ్రాంత తపాలాశాఖ ఉద్యోగి ఎం ఏ రజాక్ ఇల్లు అది...హైదరాబాద్ నగరంలోని మీర్ పేట ప్రశాంతిహిల్స్ కాలనీ ఫేజ్ 4 అభివృద్ధి కమిటీ ప్రధానకార్యదర్శి అయిన ఎం ఏ రజాక్ కు ఊర పిచ్చుకలంటే ప్రాణం. అతని ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఆ ఇంట్లోనే నలు మూలలా పలు పక్షి గూళ్లు దర్శనమిచ్చాయి. ఆ పక్షుల గూళ్లలో ఊర పిచ్చుకలు, గోరింకలు, చిలుకలు, తెల్ల గోరింకలు, గువ్వలు, కుంజులు, నల్లపిట్టలు, బుల్ బుల్ పిట్టలు, పావురాళ్లు సందడి చేస్తూ కనిపించాయి.తన ఇంట్లోని గూళ్లలో నివాసం ఏర్పరచుకున్న పక్షులకు రోజూ గింజలు వేస్తూ వాటి కిలకిలరావాలతో తన్మయత్వం చెందుతుంటానంటారు పిచ్చుకల పరిక్షకుడు ఎం ఏ రజాక్.




అంతరించిపోతున్న ఊర పిచ్చుకలు

చీడపీడలు, పురుగులు, క్రిమికీటకాలను తింటూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఊర పిచ్చుకలు క్రమేణా అంతరించి పోతున్నాయి. సెల్ టవర్ల రేడియేషన్ కారణంగా, హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్ గా మారడంతో పిచ్చుకల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. వేసవిలో పిచ్చుకలు తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో పిచ్చుకలను ధాన్యాన్ని వేయడంతో పాటు తాగేందుకు నీళ్ల తొట్టెలు ఏర్పాటు చేయాలని ప్రచారం చేస్తున్నారు రజాక్. హైదరాబాద్ నగరంలో పిచ్చుకల ఆవాసాలు కొరవడ్డాయి. వాతావరణం విషతుల్యంగా మారడంతో పిడికెడంత ఉన్న పిచ్చుక కూడా మనుషుల మధ్య జీవించలేక పోతోంది. ప్రకృతికి, మనుషులకు మేలు చేసే పిచ్చుకలను బతికించుకోవాలంటారు పిచ్చుకల పరిరక్షకుడు రజాక్.

పిచ్చుకల పరిరక్షణ ఎలా మొదలైందంటే...
2008వ సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా మార్చాల గ్రామంలోని తపాలా కార్యాలయంలో సబ్ పోస్టుమాస్టరుగా ఎం ఏ రజాక్ పనిచేస్తుండగా ఒక ఊరపిచ్చుక ప్రతీరోజూ గడ్డిని నోట కరచుకొని తీసుకువచ్చి గూటిని అల్లేందుకు యత్నిస్తుంది. గోడపై రంధ్రం చిన్నగా ఉండటంతో పిచ్చుక తెచ్చి పెట్టిన గడ్డి కాస్తా నిలబడటం లేదు. గడ్డి పరక నిలబడకుండా కింద పడుతుండటంతో స్వీపర్ ఆ విషయాన్ని సబ్ పోస్టు మాస్టర్ అయిన రజాక్ కు చెప్పింది. అంతే ఆలోచించిన రజాక్ ఒక చిన్న కుండ తీసుకువచ్చి అక్కడ గోడకు వేలాడదీశారు. దీంతో ఊరపిచ్చుకల జంట అందులో పిల్లల్ని పెట్టింది. ప్రతీరోజూ పిచ్చుకల కిలకిలరావాలతో సందడిగా మారింది. అది చూసిన రజాక్ పిచ్చుకల పరిరక్షకుడిగా మారి గూళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.



15 ఏళ్లుగా 4వేల పక్షిగూళ్ల పంపిణీ

హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్ గా మారటంతో ఊరపిచ్చుకలకు గూళ్లు కరువయ్యాయి. గూడు కట్టుకునేందుకు పుల్లలు సైతం దొరకడం లేదు. పిచ్చుకల గూళ్ల గురించి ఆలోచించిన రజాక్ నాటి నుంచి 4వేలకు పైగా పిచ్చుకల గూళ్లను మట్టితో తయారు చేయించి ఉచితంగా పక్షిప్రేమికులకు అందజేశారు.రజాక్ పోస్టుమాస్టరుగా పదవీ విరమణ చేసి తన స్వస్థలమైన మీర్ పేట కు వచ్చినా గత 15 ఏళ్లుగా ఊరపిచ్చుకలకు గూళ్లను తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.



పిచ్చుకలే పిల్లలుగా...

తపాలాశాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన రజాక్ కు ముగ్గురు పిల్లలు. ముగ్గురూ పిల్లలూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. తనకు వచ్చే పెన్షన్ డబ్బుతో పిచ్చుకలనే పెంచుతూ వాటితోనే గడుపుతుంటారు. మీర్ పేటలోని తన ఇంట్లో పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేసి, వాటికి సజ్జలను ఆహారంగా వేస్తూ నీళ్ల తొట్టెల్లో నీటిని నింపుతుంటారు. పిచ్చుక గూళ్లలో పిచ్చుకలు ఉదయాన్నే కిచకిచమంటూ శబ్ధం చేస్తూ తనను నిద్ర లేపుతుంటాయంటాయని చెబుతారు.

జూపార్కు నెస్ట్ టీమ్ సభ్యుడిగా...
హైదరాబాద్ జూపార్కులో 2014వ సంవత్సరంలో జరిగిన పక్షి ప్రేమికుల సమావేశంలోనూ రజాక్ పాల్గొన్నారు. జూపార్కులో ఏర్పాటు చేసిన నెస్ట్ టీమ్ లో రజాక్ సభ్యుడయ్యారు. మీర్ పేటలోని నందిహిల్స్, సెవెన్ హిల్స్, ప్రశాంతి హిల్స్, కర్మన్ ఘాట్,బడంగ్ పేట, అల్మాస్ గూడ తదితర కాలనీల్లో వేలాది పక్షిగూళ్లను పంపిణీ చేశారు.‘‘నేను పెన్షన్ డబ్బులతోపాటు కొందరు దాతలు అందించిన సాయంతో మట్టితో పక్షిగూళ్లను తయారు చేయించి వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నాను’’అని రజాక్ చెప్పారు.



పిచ్చుక కనిపిస్తే చాలు గూడు కడుతూ...

ఊర పిచ్చుక కనిపిస్తే చాలు ఎం ఏ రజాక్ వాటి కోసం గూడు కడుతుంటారు.పిచ్చుకల గూళ్లు, చిన్న నిచ్చెన తీసుకొని ద్విచక్రవాహనంపై కాలనీల్లో తిరుగుతూ పక్షిగూళ్లు కడుతుంటారు. పిచ్చుకలకు గింజలు వేస్తూ వాటి దాహార్తిని తీర్చేందుకు తొట్టెల్లో నీళ్లు పెడుతుంటారు. కాలనీ వాసులకు మట్టితో చేసిన కుండ ఆకారంలో ఉన్న గూళ్లను బహుమతిగా అందిస్తుంటారు. కాంక్రీట్ జంగిల్ లో గూడు లేని పక్షులకు గూళ్లు ఏర్పాటు చేయడమే తన జీవిత లక్ష్యమంటారు రజాక్. పిచ్చుకలకు గూడు కల్పిస్తే అవి పిల్లల్ని పెట్టి పిచ్చుకల సంఖ్యను పెంచుతుంటాయని అంటారు.పిచ్చుకల పరిరక్షకుడిగా మారిన రజాక్ పై ఇటీవల అన్నపూర్ణ స్టూడియో వాళ్లు వచ్చి డాక్యుమెంటరీ కూడా తీశారు.

పిచ్చుకల పరిరక్షణపై ప్రతిన
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మార్చి 20వతేదీన ప్రతీ ఏటా పిచ్చుకల పరిరక్షణపై ప్రచార కార్యక్రమాన్ని చేపడతారు. ఊర పిచ్చుకలు అంతరించి పోకుండా పరిరక్షించడమే కాకుండా వాటిని కాపాడాలని ప్రచారం చేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులతో ఊరపిచ్చుకల సంరక్షణకు పాటుపడతామని ప్రతిన చేయించారు.



పిచ్చుకలతో మేలు

ఇళ్ల ముందు, పెరట్లలో మొక్కలు పెంచుకుంటుంటే చీడ పీడలు, పురుగులు వాలి మొక్కలను నాశనం చేస్తుంటాయి. పురుగుల వల్ల ప్రజలకు చర్మవ్యాధులు కూడా సంక్రమిస్తుంటాయి. ఈ పురుగులను పిచ్చుకలు తిని మనకు మేలు చేస్తుంటాయి. పిచ్చుకలను బతకనిస్తే మనకు బతుకునిస్తాయని ఎంఎ రజాక్ చెబుతారు. వేసవికాలంలో ఎండ వేడిమి ధాటికి పలు పిచ్చుకలు దాహంతో చనిపోతుంటాయని, వేసవిలో పిచ్చుకలకు చిన్న పళ్లాల్లో నీరు పెట్టి రక్షించాలని సూచించారు. అంతరించి పోతున్న ఊరపిచ్చుకలను మనం కాపాడి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.

ఉచిత పిచ్చుక గూళ్ల కోసం ఫోన్ చేయండి
ఊర పిచ్చుకలను పెంచాలనుకునే వారు ఉచితంగా అందించే పిచ్చుక గూళ్ల కోసం 98485 41025 ఫోన్ నంబరుకు ఫోన్ చేయాలని పిచ్చుక పరిరక్షకుడు ఎం ఏ రజాక్ కోరారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం అట్టపెట్టెలతో పక్షి గూళ్లను తయారు చేసి అందిస్తుండటంతో వాటిని కూడా తాను పంపిణీ చేస్తున్నానని చెప్పారు.



పిచ్చుకల పరిరక్షణలోనే ఆనందం

‘‘నేను గత 15 ఏళ్లుగా పిచ్చుకల పరిరక్షణలో పాలుపంచుకుంటున్నాను. పిచ్చుకల పరిరక్షణ, వాటికి గూడు కల్పించడంలోనే నాకు ఆనందం కలుగుతుంది. ఊర పిచ్చుకలు అంతరించి పోకుండా కాపాడటమే నా జీవిత లక్ష్యం అందులోనే నాకు సంతోషం’’అంటారు పిచ్చుకల పరిరక్షకుడు ఎం ఏ రజాక్.


Read More
Next Story