మంత్రితో BRS ఎమ్మెల్యేలు భేటీ... జస్ట్ మర్యాదపూర్వకంగానే...
x

మంత్రితో BRS ఎమ్మెల్యేలు భేటీ... జస్ట్ 'మర్యాద'పూర్వకంగానే...

తెలంగాణ ఐటీ శాఖ మంత్రిని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం సచివాలయంలో కలిశారు.


తెలంగాణ ఐటీ శాఖ మంత్రిని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం సచివాలయంలో కలిశారు. వీరి భేటీ గురించి గులాబీ అధిష్టానం గుబులు పడుతుందేమో. అస్సలు అవసరం లేదు. ఎందుకంటే వీళ్లది మర్యాదపూర్వక భేటీ అట! వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిగారిని అడిగారట.. 'మర్యాద'పూర్వకంగానే సుమీ. కానీ నమ్మకాల్లేవ్ దొర. ఇలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశామంటారు. నాలుగు రోజుల్లో కండువాలు మార్చేస్తారు.. ఇవన్నీ మాకు తెలియవా అని జనాలు మాట్లాడుకుంటున్నారు.

అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరతారు అని చెప్పింది మొదలు వరుసపెట్టి నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. రేపు ఇంకో ఐదు మంది చేరతారు అని పొద్దున్న కాంగ్రెస్ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఐదుగురు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుంపుగా మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాము అని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...

రంగారెడ్డి జిల్లా ఇంచార్జి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని సచివాలయంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణ రావు, అరికెపుడి గాంధీ, మర్రి రాజశేఖర్, వివేకానంద లు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి ఎల్.బి.నగర్ నియోజకవర్గానికి పలు నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో మరో రెండు నూతన ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు. అలాగే నూతన ఎస్.ఎన్.డి.పీ. పనుల నిమిత్తం రూ.100 కోట్లు, నూతన వాటర్ డ్రైనేజీ పనుల నిమిత్తం మరో రూ. 100 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి రాజకీయాలకు అతీతంగా పనులు చేయడం జరుగుతుందని అన్నారు. తప్పకుండా మీరు కోరిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. తప్పకుండా మంజూరు చేస్తామని మంత్రి వాళ్లకి కూడా హామీ ఇచ్చారు. ఇదండీ సంగతి.

Read More
Next Story