
రాజీవ్ స్వగ్రహ దరఖాస్తు ఫీజు స్వాహా
మధ్య తరగతి ప్రజలకు మార్కెట్ ధర కంటే 25శాతం తక్కువ ధరకు ఫ్లాట్లు ఇస్తామని ప్రకటించిన రాజీవ్ స్వగృహ పథకం నీరుకారిపోయింది. ప్రజల సొంతింటి కల సాకారం కాలేదు.
మధ్య తరగతి ప్రజలకు గూడు అందించాలనే ఆశయంతో 2007 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకాన్ని (Rajiv Swagruha scheme)ఆర్భాటంగా ఆరంభించింది. ఆ నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్యతరగతి ప్రజల కోసం ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
25శాతం తక్కువ ధరకు ప్లాట్లు అంటూ ప్రచారం
మధ్యతరగతి లబ్ధిదారులకు ఇళ్లను అందించడానికి 2007వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టింది.ఇందులో భాగంగా 2007 నుంచి 2013 సంవత్సరం వరకు 3,716 ప్లాట్లు 556 ఇండిపెండెంట్ గృహాలు నిర్మించాలని నిర్ణయించారు.మధ్యతరగతి వారికి మార్కెట్ ధర కంటే 25శాతం తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వాలని, అందుకు దరఖాస్తులు కోరగా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు మూడు వేల రూపాయలు, 5 వేల రూపాయలను దరఖాస్తు డిపాజిట్ గా చెల్లించి, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఈ పథకం కింద హైదరాబాద్ నగరంతోపాటు పలు పట్టణాల్లో గృహాల నిర్మాణం చేపట్టారు.ఈ డిపాజిట్ సొమ్మును రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ స్వాహా చేసింది.
లక్షలు వెచ్చించినా నెరవేరని లక్ష్యం
రాజీవ్ స్వగృహ పథకం కింద కోట్ల రూపాయలు వెచ్చించినా ఈ పథకం లక్ష్యం నెరవేరలేదు. వివిధ బ్యాంకుల నుంచి రూ.919 కోట్లు రుణం తీసుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టింది. (Unfulfilled Dream,middle class) ప్రభుత్వం నుంచి రూ.990 కోట్లు కలిపి మొత్తం రూ.1809 కోట్లు రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణానికి వెచ్చించారు. ఈ స్కీం కింద కట్టిన ప్లాట్లు 2,956 కాగా కేవలం 195 ఇళ్లను కొద్దిగా కట్టి మధ్యలో వదిలివేశారు.బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 919 కోట్ల రుణానికి ఇప్పటి వరకు వడ్డీతో రూ.1073 కోట్లు చెల్లించారు.ఇంకా రూ.90 కోట్లు బాకీ చెల్లించాల్సి ఉంది. లక్షలాది రూపాయలు వెచ్చించినా మధ్యతరగతి ప్రజలకు గూడు ఇవ్వాలనే సర్కారు లక్ష్యం నెరవేరలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
జర్నలిస్టులకు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు ఇస్తామని ప్రకటన
హైదరాబాద్ నగరంలోని జర్నలిస్టులకు తక్కువ ధరకు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా శిథిలావస్థలో ఉన్న ఈ ఇళ్లను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేసి విక్రయించాలని ప్రభుత్వం యత్నించినా నాణ్యత లోపం వల్ల ఎవరూ తీసుకోవడం లేదని సీనియర్ జర్నలిస్ట్ గోనే రాజేంద్ర ప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఫ్లాట్లు కొనేందుకు ముందుకు రాలేదు...
రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించడం, సరైన రోడ్లు, తాగునీటి సరఫరా వంటి సౌకర్యాలు లేక చాలా ప్లాట్లు కొనేందుకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఇప్పటివరకు రాజీవ్ స్వగృహ పథకం క్రింద రూ.1809 కోట్లు ఖర్చు చేయగా, ప్లాట్లు అలాట్ చేయగా వచ్చిన పైకం రూ.763 కోట్లు మాత్రమే. అంటే నికరంగా రూ.1046 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. మొదటినుంచి ఈ పథకం ప్రణాళిక ప్రకారం జరగలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం.పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయండి
మధ్యతరగతి ప్రజలకు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ అభివృద్ధి చేస్తామని చెప్పినా, అది కాగితాలకే పరిమితమైందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం.పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ పథకంలో భాగంగా మధ్య తరగతి ప్రజలు ఇళ్ల కోసం మూడు వేలరూపాయలు,రూ. 5వేలను దరఖాస్తు రుసుముగా చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తు రుసుము కూడా సర్కారు ఇవ్వలేదు. అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లకు తగిన నిధులిచ్చి వాటిని పూర్తిచేయాలని, అలాగే ఇప్పటివరకు అలాట్ చేసిన ఇళ్లకు రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు కల్పించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం.పద్మనాభరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి (CM RevanthReddy) మంగళవారం లేఖ రాశారు.
Next Story