పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు..అవస్థలు పడుతున్న ప్రజలు
x

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు..అవస్థలు పడుతున్న ప్రజలు

కూరగాయల ధరలు కొండెక్కడంతో కొనాలన్నా,తినాలన్నా మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు.ఉల్లి, టమాటాలతోపాటు అన్నీ కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి.


రుతువపనాలు మందకొడిగా సాగుతుండటంతో తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణంతోపాటు దిగుబడులు గణనీయంగా తగ్గాయి. పండిన కొన్ని కూరగాయలు గ్రామాలకే సరిపోతుండటంతో హైదరాబాద్ నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయను తెప్పించుకోవాల్సి వస్తోంది. దీంతో రవాణ చార్జీల భారంతో అన్ని కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగాయి.

- టమాటాతో పాటు అన్ని కూరగాయలు, ఆకు కూరల ధరలు మండుతున్నాయి. దీంతో తాము ధరలు పెంచక తప్పడం లేదని బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ కమీషన్ ఏజెంటు జి అజయ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కొండెక్కిన కూరగాయల ధరలు

వేసవికాలంలో తీవ్ర వడగాల్పుల ప్రభావం, రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన మేర వర్షాలు కురవక పోవడంతో కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గింది. రుతువపనాల్లో బ్రేక్ రావడంతో జూన్ నెలలో సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదైంది. దీంతో కూరగాయల ధరలు ఆకాశన్నంటాయి. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, బంగాళా దుంపల ధరలు ఎగబాకాయి. బంగాళాదంపు కిలో ధర నాణ్యతను బట్టి 40 నుంచి 60 రూపాయలు చెబుతున్నారు.

సెంచరీ దాటిన కూరగాయల ధరలు

పచ్చిమిర్చితోపాటు బీన్స్, మునక్కాయలు, ఫ్రెంచ్ బీన్స్, మష్రూం ధరలు సెంచరీ దాటాయి. మార్కెట్ లో పచ్చిమిర్చి కిలో 90 రూపాయలకు విక్రయిస్తుండగా, షాపింగ్ మాల్స్ లో వందరూపాయలు దాటింది. కిలో బీన్స్ ధర రకాన్ని బట్టి 119 నుంచి 188రూపాయలకు పెరిగింది.నిమ్మకాయలు కిలో ధర 140 నుంచి 182 రూపాయల దాకా పలుకుతోంది. అల్లం కిలో దర 170 నుంచి 221 రూపాయల దాకా విక్రయిస్తున్నారు. ఎల్లిపాయలు కిలోధర 300 నుంచి 391 రూపాయల దాకా ధర చెబుతున్నారు.

శనివారం నాటి కూరగాయల ధరలు ఇవీ

శనివారం హైదరాబాద్ మార్కెట్ లో వివిధ కూరగాయల ధరలు పెరిగాయి. కిలో బీట్రూట్ ధర 53 నుంచి 64 రూపాయల పలుకుతోంది. క్యాప్సికం కిలో ధర 60 నుంచి 78 రూపాయలకు విక్రయిస్తున్నారు. పచ్చిబఠానీలు కిలో ధర 70 నుంచి 91 రూపాయలు చెబుతున్నారు. క్యాబేజీ కిలో ధర 41 నుంచి 53 రూపాయలు పలుకుతోంది. క్యాలీప్లవర్ ధరకూడా 40 రూపాయలకు పెరిగింది. కిలో వంకాయల ధర 47 నుంచి 61 రూపాయలు చెబుతున్నారు. బెండకాయలు కిలో ధర 50 రూపాయల నుంచి 66 రూపాయలకు విక్రయిస్తున్నారు.

పెరిగిన ఆకుకూరల ధరలు

రుతువవనాల ప్రభావం వల్ల వర్షాలు సరిగా కురవక పోవడంతో ఆకుకూరలు ఆశించిన మేర దిగుబడి రాలేదు. దీంతో పుంటికూర, తోటకూర, బచ్చలికూర,పాలకూర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఆకుకూరల ధరలు పెరిగాయి.

70రూపాయలకు చేరిన టమాట ధర

ముందస్తుగా రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు సజావుగా కురవక పోవడం, రుతుపవనాలకు వచ్చిన విరామం వల్ల టమాటా దిగుబడి తగ్గింది. దీంతో కిలో టమాటా ధర 70 రూపాయలకు దాటింది. తెలంగాణలో టమాట సాగు సజావుగా సాగక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి టమాటాలను తెప్పించుకోవాల్సి రావడంతో వీటి ధరలు అమాంతం పెరిగాయి. మార్కెట్ లో కిలో టమాట ధర 70 రూపాయలకు విక్రయిస్తుండగా, షాపింగ్ మాల్స్ లో వీటి ధర 90 రూపాయలకు పెరిగింది.

తాత్కాలికంగా మూతబడిన కర్రీపాయింట్లు

తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణంతోపాటు దిగుబడి తగ్గడంతో ధరలు కొండెక్కాయి. దీంతో పెరిగిన కూరగాయల ధరలతో కర్రీపాయింట్లు నడపలేమంటూ పలువురు కర్రీపాయింట్లను తాత్కాలికంగా మూసివేశారు. పెరిగిన కూరగాయల ధరలతో కర్రీపాయింట్లు తామెలా నడుపుతామని హైదరాబాద్ నగరంలోని ఫ్రెండ్స్ కర్రీ పాయింట్ యజమానురాలు డి రాజేశ్వరి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఉల్లి ధరల ఘాటు

దేశంలో ఉల్లి ఎగుమతికి కేంద్రం అనుమతించడంతో వీటి ధరలు అనూహ్యంగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలోని మార్కెట్ లో కిలో ఉల్లిగడ్డల ధర 42 నుంచి 44 రూపాయలకు విక్రయిస్తున్నారు. అదే షాపింగ్ మాల్స్ లో అయితే కిలో ఉల్లి ధర 58 రూపాయలకు పెంచారు. పెరిగిన ఉల్లి ధరలతో తాము కొనలేక పోతున్నామని కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వచ్చిన కె గంగాభవానీ ఆవేదనగా చెప్పారు. సాంబారులో వేసుకునే చిన్న ఉల్లిపాయల కిలో ధర 62 నుంచి 86 రూపాయలు పలుకుతోంది.

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు

కూరగాయలే కాదు నిత్యావసర వస్తువులైన పప్పుదినుసులు, పాల ధరలు కూడా పెరిగాయి.ఉత్తరాదిలో గోధుమల దిగుబడి తగ్గడంతో విదేశాల నుంచి ఎగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. డిమాండుకు అనుగుణంగా గోధుమల సప్లయి లేక ధరలు పెరిగాయి. గోధుమపిండి ధర కూడా అమాంతం పెరిగింది. వరి గిట్టుబాటు ధర పెంచడంతో మార్కెట్ లో బియ్యం ధరలు కూడా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. కిందిపప్పు, మినుమలు, శనగల ఉత్పత్తి తగ్గడంతో వీటి ధరలు కూడా పెరిగాయి. ఆగస్టు నెల వరకు దరాఘాతం ఉంటుందని హైదరాబాద్ నగరానికి చెందిన హోల్ సేల్ వ్యాపారి పాండే ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరంలో పప్పుదినుసుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. కిలో కందిపప్పు ధర 165 రూపాయలకు పెరిగింది. కిలో పచ్చిపప్పు 78 రూపాయలు, మినుములు 138 రూపాయలు, పెసరపప్పు కిలో ధర 133 రూపాయలకు పెరిగింది.

Read More
Next Story