ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్న కాలుష్యం, పీసీబీకి ఫిర్యాదు
హైదరాబాద్ శివార్లలో నిబంధనలకు నీళ్లు వదిలి కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. అక్రమంగా రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నడపటం, భవన నిర్మాణాలపై ప్రజలు ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో సర్వే నంబరు 315 పి లో అశోకా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ టీజీ రెరా, కాన్సెంట్ ఫర్ ఎష్టాబ్లిష్ మెంట్ లేకుండా అక్రమంగా ఏఎస్ బీఎల్ స్ప్రెక్టా పేరిట నాలుగు బ్లాక్ లలో జీ ప్లస్ 39 అంతస్తుల్లో 1200 ఫ్లాట్లను నిర్మిస్తున్నారని పుప్పాలగూడ నవనామి రెసిడెన్సీ నివాసులు పర్యావరణ యాక్టివిస్టు డాక్టర్ లుబ్నా సర్వత్ తో కలిసి సనత్ నగర్ కాలుష్య నియంత్రణ మండలికి వచ్చి ఫిర్యాదు చేశారు.సరైన అనుమతులు లేకుండా అపార్టుమెంట్ నిర్మిస్తున్నారని డాక్టర్ లుబ్నా సర్వత్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు.
రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ మూసివేత ఉత్తర్వులు బేఖాతర్
వాయు, ధ్వని కాలుష్యాన్ని వెదజల్లుతున్నరెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ మూసివేత ఉత్తర్వులను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసినా దాన్ని బేఖాతర్ చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ సర్వేనంబరు 285,286,287 లలో ఏర్పాటైన ఫీనిక్స్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన రెడీ మిక్స్ కాంక్రీట్ కాలుష్యం వల్ల నవనామి రెసిడెన్సి ప్రజలు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. మూసివేసిన ప్లాంటును మళ్లీ తెరిచేందుకు అనుమతించిన నేపథ్యంలో మళ్లీ స్థానిక నివాసులు పీసీబీకి ఫిర్యాదు చేశారు.
కాలుష్యంపై పీసీబీకి ఫిర్యాదు
39 అంతస్తుల అపార్టుమెంట్ నిర్మాణం వల్ల దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలికి స్థానిక పుప్పాలగూడ ప్రజలు ఫిర్యాదు చేశారు. హైరైజ్ అపార్టుమెంట్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయని, దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని డాక్టర్ లుబ్నా సర్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఏఎస్ బీఎల్ స్ప్రెక్టా నిర్మిస్తున్న ప్రాంతం సమీపంలో మామసాని కుంట,దాని ఛానెల్‌లు,మేకసాని కుంట,బల్కాపూర్ ఛానెల్,బ్రహ్మం కుంటలు ఉన్నాయి.
కాలుష్య నియంత్రణ మండలి నుంచి అశోక్ బిల్డర్స్ అపార్టుమెంట్ నిర్మాణానికి కాన్సెంట్ ఫర్ ఎష్టాబ్లిష్ మెంట్ తీసుకోకపోవడాన్ని డాక్టర్ లుబ్నా సర్వత్ తప్పు బట్టారు. దీనిపై పీసీబీ బిల్డరుపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వాయు, ధ్వని కాలుష్యం వల్ల తాము పలు అనారోగ్యాలకు గురవుతున్నామని పుప్పాలగూడ ప్రజలు ఫిర్యాదు చేశారు. తాము మాస్కు లేనిదే ఇళ్లలో నుంచి బయటకు రాలేక పోతున్నామని ప్రజలు ఆవేదనగా చెప్పారు.
Next Story