తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
x

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్ నేతలు చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారి తీసింది.


మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్ నేతలు చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారి తీసింది. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పై సీఎం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పు పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు, రేవంత్ దిష్టిబొమ్మ దహనాలకు పిలుపునిచ్చింది. సీఎం వారికి క్షమాపణలు చెప్పేవరకు వెనక్కు తగ్గబోమని తేల్చేసింది.

గురువారం అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళనలు కొనసాగించారు. దీంతో అసెంబ్లీ గందరగోళంగా మారింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సీట్లలో కూర్చోలేదు. మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో హౌస్ నుంచి బయటకు వెళ్లే వరకు దాదాపు మూడు గంటల పాటు నిలుచునే నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌ ఎదుట ఎమ్మెల్యేలు ధర్నా చేయడంతో మార్షల్స్‌ వారిని సభా ప్రాంగణం నుంచి తరలించారు.

అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మంత్రి బిల్లు గురించి వివరిస్తుండగా... తమ నేతలకి మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ ని కోరారు. స్పీకర్ అనుమతించకపోవడంతో వెల్ వద్దకు చేరుకొని బైఠాయించారు. “నహీ చలేగా నహీ చలేగా, తానా షాహీ నహీ చలేగా”, “ముఖ్యమంత్రి డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. దీంతో సభా ప్రాంగణంతో రసాభాసగా మారింది.

అనంతరం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకి దిగారు. దీంతో మార్షల్స్‌ వారిని సభా ప్రాంగణం నుంచి బయటకి తరలించారు. బయటే నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ... మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తరలించారు.

Read More
Next Story