Turmeric Board | పుసపు మీద పరిశోధన సాగలేదు,
కొత్త వంగడాలు రాలేదు, పసుపు దిగుబడి పెరగలేదు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తల దృప్టికి తీసుకువెళ్తానంటున్న పసుపు బోర్డు కొత్త చెయిర్మన్
నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన పసుపు రైతు పల్లె గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించారు. పసుపు బోర్డు ఛైర్మన్ కాగానే పసుపు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం ఢిల్లీ వెళ్లిన పల్లె గంగారెడ్డి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి పసుపు బోర్డు చేపట్టబోయే కార్యాచరణను వారి ముందు ఉంచారు.
-దేశంలో పసుపు నకు గిట్టుబాటు ధర కల్పించి, పసుపు రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి ఢిల్లీ నుంచి ‘ఫెడరల్ తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
పసుపు రైతుగా తోటి రైతుల సాధక బాధకాలు తెలిసిన వాడిగా...
‘‘మా తాతల కాలం నాటి నుంచి పసుపు సాగు చేస్తున్నాం, ప్రస్థుతం నేను కూడా మూడు ఎకరాల్లో పసుపు వేశాను. దశాబ్దాలుగా పసుపు పండిస్తున్న నాకు పసుపు రైతులు ఎదుర్కొంటున్న అన్నీ సమస్యలపై అపారమైన అవగాహన ఉంది. మా తాతల కాలం నాటి నుంచి గుంటూరు రకం పసుపునే పండిస్తున్నాను, వరిలో కొత్త రకం వంగడాలను శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి అందుబాటులోకి తీసుకురావడంతో దిగుబడి రెట్టింపు అయింది. కానీ పసుపు దిగుబడి పెరగ లేదు. పసుపులో అధునాతన వంగడాలు రాలేదు. అందుకే పసుపు బోర్డు ఛైర్మన్ గా నేను శాస్త్రవేత్తలతో మాట్లాడి పసుపులో కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నాను.పసుపులో పరిశోధనలు చేసేందుకు ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలను నియమించాలని కోరాను.పసుపులో కురికమిన్ శాతం పెంచేందుకు వీలుగా కొత్త వంగడాలను ఉద్యాన వన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని కోరాను.’’
పసుపుబోర్డుకు భవనం కేటాయించండి
‘‘దేశంలోని తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మేఘాలయ, అసోం, మణిపూర్ రాష్ట్రాల్లో పసుపు సాగుచేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 30వేల ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. దేశంలోని పసుపు రైతులందరి ప్రయోజనం కోసం పసుపు బోర్డు పనిచేయనుంది. పసుపు బోర్డును నిజామబాద్ లోని స్సైసెస్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కానీ పసుపు బోర్డుకు నిజామాబాద్ నగరంలో అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని తాను కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తోపాటు ఆ శాఖ అధికారులను కోరాను. ప్రస్థుతం స్పైసెస్ బోర్డు నుంచి కొంత మంది ఉద్యోగులను పసుపుబోర్డుకు కేటాయించారు. పసుపు బోర్డు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే అదనంగా అధికారులు, ఉద్యోగులను నియమించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖను కోరాను.’’
కేంద్రవాణిజ్య శాఖ మంత్రిని కలిసిన పల్లె గంగారెడ్డి
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి గురువారం కలిసి పసుపు రైతుల సమస్యల గురించి మాట్లాడారు. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న పసుపు బోర్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో పసుపు రైతుల దీర్ఘకాల సమస్యలను తీర్చాలని పల్లె గంగారెడ్డి మంత్రిని అభ్యర్థించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పసుపునకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధర అందించాలని తాను కోరినట్లు పల్లె గంగారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పసుపునకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి పసుపునకు వ్యాల్యూ పెరిగేలా చేయాలని సూచించారు.
రైతులకు సబ్సిడీపై బాయిలర్లు, పాలిషర్లు
పసుపు రైతులకు సబ్సిడీపై బాయిలర్లు, పాలిషర్లు ఇప్పించేందుకు పసుపు బోర్డు కార్యాచరణ రూపొందించనుందని పల్లె గంగారెడ్డి చెప్పారు. కూలీల కొరత ఉన్నందున పసుపు సాగులో యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాఫీ బోర్డు, వెదురు బోర్డుల తరహాలో పసుపు బోర్డుకు బడ్జెట్ నిధులు కేటాయించి పసుపు రైతుల దీర్ఘకాల సమస్యలను పరిష్కరించేందుకు బోర్డు పక్షాన తాను కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పల్లె గంగారెడ్డి వివరించారు. పోటీ ప్రపంచంలో పసుపు దిగుబడిని పెంచడంతోపాటు రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు.
- పసుపు బోర్డు ఛైర్మన్ అయ్యాక తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అధికారులను కలిసి పసుపుబోర్డు కార్యాచరణను ప్రారంభించినట్లు పల్లె గంగారెడ్డి చెప్పారు. త్వరలో జాతీయ పసుపుబోర్డు మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.
Next Story