దీక్ష విరమించిన మోతీలాల్... నిరుద్యోగుల డిమాండ్స్ పై నేడే నిర్ణయం?
x

దీక్ష విరమించిన మోతీలాల్... నిరుద్యోగుల డిమాండ్స్ పై నేడే నిర్ణయం?

ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ గాంధీ ఆసుపత్రిలో ఓయూ జేఏసీ నాయకుడు మోతీలాల్ దీక్ష చేస్తున్నారు.


ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ గాంధీ ఆసుపత్రిలో ఓయూ జేఏసీ నాయకుడు మోతీలాల్ దీక్ష చేస్తున్నారు. తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తోన్న ఆయన మంగళవారం తన దీక్షను విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నిరుద్యుగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నానని చెప్పారు. తొమ్మిది రోజుల పాటు దీక్ష చేసినా ఒక్క ఉద్యోగం కూడా పెరగలేదన్నారు. ఇన్ని రోజులు అన్న పానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేశానన్నారు.

ఇప్పుడు తన ఆరోగ్యం సరిగ్గా లేదని, క్రియాటిన్ లేవల్స్ పెరిగి కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చిందని మోతీలాల్ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నాయకుల పెత్తనం పోయినా మన బతుకు మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 25 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారని, కానీ.. ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం జీవోలను రిలీజ్ చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

కాగా, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ తో పాటు, ఇతర నిరుద్యోగులతో చర్చలు జరిపింది. ఇవాళ ఉదయం కూడా గాంధీ భవన్ లో పలువురు నిరుద్యోగులతో కమిషన్ చర్చలు జరిపింది. వారి డిమాండ్స్ ని నోట్ చేసుకున్న కమిషన్.. ఆ అంశాలపై సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనుంది. అనంతరం నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

నిరుద్యోగుల డిమాండ్లు...

గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.

గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.

25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.

గురుకుల ఉపాధ్యాయ పోస్టులను బ్యాక్ లాగ్ లో ఉంచకూడదు.

నిరుద్యోగులకు రూ.4 వేలు భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి.

Read More
Next Story