స్త్రీలకి ఏడాదికి రూ.లక్ష.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటన
x

స్త్రీలకి ఏడాదికి రూ.లక్ష.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటన

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనజాతర సభలలో కాంగ్రెస్ హామీల జల్లు కురిపిస్తోంది. నేడు రాహుల్ గాంధీ స్త్రీలకి ఏడాదికి రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు.


లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జన జాతర సభలో, జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ జనజాతర సభలలో పాల్గొన్నారు. ఈ సభలలో ఆయన ప్రసంగిస్తూ బిజెపి, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్లను ఉద్దేశించి కీలక హామీలు ప్రకటించారు.

ఈ ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటముల రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇండియా కూటమి పోరాటం చేస్తోందని, తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని రాహుల్ ప్రకటించారు. దేశంలో 50 శాతం మంది ఆదివాసీలు దళితులు వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని అన్నారు. అంబేద్కర్, నెహ్రూ, గాంధీల కృషితో రూపొందించిన రాజ్యాంగం వల్లే అన్ని వర్గాల ప్రజలకు దేశంలో న్యాయం జరుగుతోందన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటగా చేసేది కులగణన అని స్పష్టం చేశారు. బహుజనులకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ను బిజెపి తీసేయాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోడీ.. ఆదాని, అంబానీ లాంటి వ్యాపారస్తులకు లక్షల కోట్ల రుణమాఫీ చేస్తున్నారని... రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీలు ఇంటి పనితో పాటు, బయట పనులకు కూడా వెళ్తున్నారని.. మొత్తం 18 గంటలు పని చేస్తున్న వారికి ఎలాంటి జీతభత్యాలు లేవని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు ఏడాదికి రూ. లక్ష చొప్పున అందిస్తామని ప్రకటించారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

Read More
Next Story