
కంచ గచ్చిబౌలి భూములు
సుప్రీం ఆదేశాలతో కంచ గచ్చిబౌలిలో ప్లాంటేషన్‌కు అటవీశాఖ ప్రణాళిక
సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అటవీశాఖ అధికారుల్లో కదిలిక వచ్చింది. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్లాంటేషన్ కోసం ప్రణాళిక రూపొందించారు.
సుప్రీంకోర్టు ఆదేశంతో నరికివేతకు గురైన వంద ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల్లో ప్లాంటేషన్ కోసం తెలంగాణ అటవీశాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. వంద ఎకరాల్లో వివిధ రకాల మొక్కలు నాటాలని అటవీ శాఖ నిర్ణయించింది.దీని కోసం హైదరాబాద్ అటవీ విభాగం అధికారులు ప్లాంటేషన్ ప్రణాళికను సిద్ధం చేశారు. తెలంగాణ అధికారులు పదిరోజుల్లోనే రాత్రీ పగలూ ఐటీ పార్కు ఏర్పాటు కోసం వంద ఎకరాల్లో జేసీబీలను పెట్టి చెట్లను నరికివేసి, పక్షులు, జింకల ఆవాసాలను ధ్వంసం చేసింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో నరికివేతకు గురైన వంద ఎకరాల్లో అడవిని పునరుద్ధరించాలంటే కనీసం మొక్కలు నాటి, వాటిని పరిరక్షించేందుకు పదేళ్ల సమయం పడుతుందని తెలంగాణ అటవీశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.
సుప్రీం కమిటీ నివేదిక ఏం చెప్పిందంటే...
హైదరాబాద్ నగరంలోని జీవవైవిధ్య హాట్‌స్పాట్ అయిన కంచ గచ్చిబౌలిలోని 100 ఎకరాల పచ్చని అటవీ భూమిని రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చట్టవిరుద్ధంగా వృక్షసంపదను ఎలా తొలగించారో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ నివేదికలో వెల్లడించింది.సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ గచ్చిబౌలి కంచ భూముల మీద నివేదిక ఇచ్చింది. గచ్చి బౌలి భూములను డీమ్డ్ ఫారెస్టు గా గుర్తించవచ్చని, టి ఎన్ గోదవర్మన్ కేసులో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వీటిని కూడా డీమ్డ్ ఫారెస్టుగా గుర్తించాలని సుప్రీం కోర్టుకు కమిటీ సిఫార్సు చేసింది.
కంచ గచ్చిబౌలి భూములపై పెదవి విప్పని అటవీఅధికారులు
కోర్టులకు సెలవు ఉన్న రోజుల్లో, వారాంతాల్లో కంచె గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లు నడపడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీమ్డ్ ఫారెస్టుగా గుర్తించిన ఈ భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించాలని లేకుంటే అధికారులను జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తెలంగాణ అటవీశాఖ అధికారులు ప్రెస్ తో మాట్లాడేందుకు విముఖత చూపించారు.కంచ గచ్చిబౌలి భూములపై విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాము దీనిపై ఏమీ చెప్పలేమని అటవీశాఖ అధికారులు చేతులెత్తేశారు.
అటవీ భూముల పరిరక్షణకు చట్టాలెన్నో...
అటవీశాఖ రిజర్వు ఫారెస్టుగా గుర్తించిన భూమిలో చెట్లను నరికివేస్తే పలు అటవీ రక్షణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అటవీ భూములు, వన్యప్రాణుల పరిరక్షణకు పలు చట్టాలు అమలులో ఉన్నాయి. తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967, రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ 1972,ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, బయోడైవర్శిటీ యాక్ట్ 2005, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అమలులో ఉన్నాయి. కానీ వృక్షాలు ఉన్న ప్రైవేటు, లేదా ప్రభుత్వ భూమి అయినా డీమ్డ్ ఫారెస్టుగానే పరిగణించాలని గతంలో సుప్రీంకోర్టు ఓ కేసులో తేల్చిచెప్పింది.
కంచ గచ్చిబౌలి భూములు డీమ్డ్ ఫారెస్టే...
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలం ప్రభుత్వ రెవెన్యూ భూమిగా రికార్డుల్లో నమోదై ఉంది. కానీ ఈ భూమిలో చెట్లు పెరగడంతో పాటు జింకలు, పక్షులు ఉండటంతో ఈ భూమి రెవెన్యూది అయినా డీమ్డ్ ఫారెస్టుగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కంచ గచ్చిబౌలి భూముల్లో ఐటి పార్క్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కల నెరవేరే అవకాశం లేనట్లే.చెట్లు ఉన్న ఏ భూమి అయినా డీమ్డ్ ఫారెస్ట్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు వృక్షాలు నరకకుండా చర్యలు చేపట్టాలి.
టి ఎన్ గోదవర్మన్ తీర్పు ఏం చెబుతుందంటే...
సుప్రీంకోర్టు 2016వ సంవత్సరంలో ఇచ్చిన తీర్పు దేశంలోనే సంచలనం రేపింది. టి ఎన్ గోదవర్మన్ తీర్పు అటవీ (సంరక్షణ) చట్టం 1980 ప్రకారం ఈ భూమి డీమ్డ్ ఫారెస్ట్ గా అర్హత పొందిందని సుప్రీం ఎంపవర్డ్ కమిటీ నివేదిక పేర్కొంది.2016 జూన్ 1వతేదీన కేరళలోని మలబార్ ప్రాంతంలోని రాచరిక నీలంబర్ కోవిలకం కుటుంబ సభ్యుడు టి.ఎన్. గోదావర్మన్ 86 సంవత్సరాల వయసులో మరణించారు.భారతదేశ అడవులను రక్షించడానికి సుప్రీంకోర్టు ద్వారా ఒక కీలక తీర్పును ఆయన రాబట్టారు. 1995వ సంవత్సరంలో తమిళనాడులోని నీలగిరిలోని గూడలూర్‌లో సహజమైన అటవీ ప్రాంతాల విధ్వంసం చూసి గొదవర్మన్ బాధపడ్డాడు.1969వ సంవత్సరంలో గూడలూర్ జన్మమ్ ఎస్టేట్స్ రద్దు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, ఈ అటవీ ప్రాంతాలు నిలంబూర్ కోవిలకం యొక్క జన్మమ్ భూములను కేరళ రాష్ట్రం స్వాధీనం చేసుకుంది.సుప్రీంకోర్టు ఆదేశాలు, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి భారీగా అడవులను నరికివేశారు.దీంతో చెట్లు ఉన్న ఏ భూమిని అయినా డీమ్డ్ ఫారెస్టుగా గుర్తిస్తామని, అక్కడ చెట్లను నరికి వేయరాదంటూ సుప్రీం ఆదేశాలిచ్చింది.
ఉల్లంఘనలెన్నో...
కంచ గచ్చిబౌలిని డీమ్డ్ ఫారెస్ట్ గా సుప్రీం సాధికారత కమిటీ నివేదిక పేర్కొంది.ఈ కమిటీ మరికొన్ని ఉల్లంఘనలను వెలుగులోకి తెచ్చింది.కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు రెండవ నివేదికను సమర్పించింది.409.12 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో 56 శాతానికి పైగా దట్టమైన అటవీ విస్తీర్ణం ఉందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) నిర్ధారించింది. ఇది రాష్ట్ర, జిల్లా సగటు కంటే చాలా ఎక్కువ. ఈ భూమిలో 7.08 శాతం చాలా దట్టమైన అడవి ఉందని తేల్చి చెప్పింది. 31.89 శాతం మధ్యస్థ దట్టమైన అడవి,మరో 17.17 శాతం ఓపెన్ ఫారెస్ట్ అని నివేదికలో పేర్కొంది. డెల్టా కార్పొరేషన్‌కు చెందిన కాంట్రాక్టర్ గోవిందు కృష్ణ 125 చెట్లను అక్రమంగా నరికివేశారని నివేదిక గుర్తించింది.టీఎస్ఐఐసీ పర్యవేక్షణలో జరిగిన ఈ చెట్లను నరికివేశారని తెలిపింది.
సుమోటోగా సుప్రీం విచారణ
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సుమోటోగా జోక్యం చేసుకుంది. కెమెరా ట్రాప్‌లు, నీటి తొట్టెలు వంటి ప్రాథమిక వన్యప్రాణుల రక్షణ వ్యవస్థలను అమలు చేయాలని కమిటీ కోరింది. స్థానిక పక్షి జాతులకు ముప్పు కలిగించేలా వీధి కుక్కలను తొలగించడానికి జీహెచ్ఎంసీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించింది.కంచ భూమిని అడవిగా ప్రకటించి, నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వర్షాకాలంలో 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించాలని, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం భూమిని పరిరక్షణ రిజర్వ్‌గా ప్రకటించాలని, అన్ని సరస్సులను తడి భూములుగా రక్షించాలని కోరింది. 12 నెలల్లోపు హైదరాబాద్ విశ్వవిద్యాలయ పర్యావరణ వ్యవస్థలోని మురుగునీటిని తొలగించాలని కోరింది.
నిపుణుల కమిటీని నియమించాలి
శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, రిమోట్ సెన్సింగ్ నిపుణులతో నిపుణుల కమిటీని పునర్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూములకు కఠినమైన అటవీ నిర్వచనాలను అమలు చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ఉన్నత స్థాయి ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకమిటీ సిఫార్సు చేసింది.కంచ గచ్చిబౌలిలోని వంద ఎకరాల పచ్చని చెట్లను నరికి వేశారని సుప్రీంకోర్టు సాధికార కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ భూమిలో ప్లాంటేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
సుప్రీం కమిటీ సందర్శన
ఏప్రిల్ 10వతేదీన కంచ గచ్చిబౌలిని సుప్రీం సెంట్రల్ సాధికార కమిటీ సందర్శించింది.కమిటీలోని ఇద్దరు సభ్యులు మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రప్రకాష్ గోయల్, మహారాష్ట్ర మాజీ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ సునీల్ లిమాయేలు రాష్ట్ర అటవీ శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఏప్రిల్ 10న 400 ఎకరాల కంచ గచ్చిబౌలిని సందర్శించారు. కంచ గచ్చిబౌలిలో అటవీ సంరక్షణ చట్టం, వన్యప్రాణుల రక్షణ చట్టం నిబంధనలను వర్తింపజేయడానికి సంబంధించి అటవీ శాఖ తీసుకున్న చర్యలు, భారీ యంత్రాలను ఉపయోగించి భూమిని చదును చేయడానికి సంబంధించి తీసుకున్న చర్యలను కూడా పరిశీలించారు. కంచ గచ్చిబౌలిలో అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఏప్రిల్ 3వతేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది.
Next Story