
ఢిల్లీలోని తెలంగాణ భవన్
సరిహద్దుల్లోని తెలంగాణ వాసులను ఆదుకుంటున్న అధికారులు
ఆపరేషన్ సింధూర్, భారత్-పాక్ దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో ఉంటున్న తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది.
భారత్ -పాక్ సైనిక బలగాల మధ్య దాడులు జరుగుతున్న యుద్ధ వాతావరణంలో దేశ సరిహద్దుల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు తెలంగాణ కంట్రోల్ రూం అధికారులు ఆదుకుంటున్నారు. యుద్ధ ప్రభావిత సరిహద్దు ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్న తెలంగాణ వాసులకు అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ కేంద్రంగా అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ విపత్తు సహాయ కేంద్రానికి ఇప్పటికే 30 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు.
వసతి సౌకర్యాలు
సరిహద్దుల నుంచి ఢిల్లీకి చేరిన తెలంగాణ పౌరులకు ఉచిత ఆహారంతో వసతి కూడా కల్పించారు.తెలంగాణ భవన్ లోనే కాకుండా అవసరమైతే బయట కూడా తెలంగాణ వాసులకు వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలంగాణ భవన్ అధికారులు చెప్పారు. సరిహద్దుల నుంచి వచ్చిన వారికి ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వీలుగా తెలంగాణ భవన్ లో వైద్య శిబిరాన్ని ఏర్పాుటు చేశారు. తెలంగాణ భవన్ నుంచి విమానాశ్రయానికి, రైల్వేస్టేషన్లకు సురక్షిత ప్రయాణం కోసం రవాణ సౌకర్యం కల్పించారు. సరిహద్దుల్లోని తెలంగాణ వాసులందరినీ వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ చెప్పారు.
కాశ్మీర్ నుంచి 8 మంది తెలంగాణ వాసుల రాక
కాశ్మీరులోని సరిహద్దుల్లో ఉండే తెలంగాణ వాసులు యుద్ధ వాతావరణం నేపథ్యంలో వారు ఢిల్లీకి తిరిగి వచ్చారు. తెలంగాణ భవన్ కు వచ్చిన 8 మందిని సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశామని ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు చెప్పారు. ఢిల్లీలోని కంట్రోల్ రూం 24 గంటలూ పనిచేస్తుందని తెలంగాణ అధికారులు చెప్పారు.
Next Story