Danam Nagender | ‘అధికారుల వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు’
అధికారులు చేస్తున్న పనుల వల్ల మేము ప్రజల మధ్య తిరగలేకపోతున్నామని మండిపడ్డ దానం.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. బుధవారం చింతల్‌బస్తీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకున్న ఆయన గురువారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో ఉన్న అక్రమ నిర్మాణాలు అధికారులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలు కూల్చేవారైతే అవి ఎక్కడ ఉన్నా ఒకేలా చర్యలు తీసుకోవాలని, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రూల్ అంటే కుదరదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా అధికార యంత్రాంగంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు అవలంబిస్తున్న తీరును కూడా ఆయన తప్పుబట్టారు. హైదరాబాద్‌లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగానే ఆయన అధికారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
అధికారుల తీరు ఏకపక్షం
కూల్చివేతల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు. ‘‘పేదల ప్రజల జీవనాధారాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారు. అధికారులు చేస్తున్న పనుల వల్ల మేము ప్రజల మధ్య తిరగలేకపోతున్నాం. పేదల ఇళ్లను కూల్చడం సరయింది కాదు. ఓల్డ్ సిటీలో ఉన్న అక్రమ నిర్మాణాలు అధికారులకు కనిపించడం లేదా? కూల్చివేతలు చేయాలంటే ఓల్డ్ సిటీ నుంచే ప్రారంభించాలి’’ అని డిమాండ్ చేశారు. అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన వాడిని.. హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రబుత్వాలకు మనుగడ ఉండదు. ప్రభుత్వ ఆధీనంలోనే అధికారులు పనిచేయాలి. హైడ్రా.. చెరువులను కాపాడటానికి పనిచేస్తుంది. దానిని స్వాగతిస్తున్నాం. మూసీ ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరికరణ చేసి, పర్యాటక కేంద్రంగా మారుస్తుంది’’ అని ఆయన అన్నారు.
చింతల్ బస్తీలో ఏమన్నారంటే..
ఖైరతాబాద్‌లో చింతల్‌బస్తీ అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అధికారులు బుధవారం ఉపక్రమించారు. ఈ విషయం తెలిసిన వెంటనే దానం నాగేందర్ అక్కడకు చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. కూల్చివేతలను వెంటనే ఆపేయాలని అన్నారు. అసలు స్థానిక ఎమ్మెల్యేలకు ఒక ముక్క సమాచారం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని అధికారులను నిలదీశారు. ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వచ్చిన పేదలపై దౌర్జన్యం చేస్తున్నారా అంటూ అధికారులపై మండిపడ్డారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చే వరకు అక్కడి కూల్చివేతలను నిలిపివేయాలని అధికారులకు సూచించారు. లేనిపక్షంలో పేదలతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.