తెలంగాణలో లోకాయుక్త పెండింగ్ కేసుల పరిష్కారంపై కొత్త ఆశలు
x
తెలంగాణ లోకాయుక్త కార్యాలయం

తెలంగాణలో లోకాయుక్త పెండింగ్ కేసుల పరిష్కారంపై కొత్త ఆశలు

తెలంగాణలో లోకాయుక్త, ఉప లోకాయుక్తలు పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పెండింగ్ కేసుల పరిష్కారంపై కొత్త ఆశలు ఏర్పడ్డాయి.


తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్టిస్ బీఎస్‌ జగ్జీవన్‌ కుమార్‌ సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రజలు లోకాయుక్తకు ఫిర్యాదులు సమర్పించారు. లోకాయుక్తలో పెండింగులో ఉన్న కేసులు కొత్త లోకాయుక్త, ఉప లోకాయుక్తల నియామకంతో పరిష్కారమవుతాయని ఫిర్యాదు దారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి వీలుగా లోకాయుక్తలో ఖాళీగా ఉన్న అధికారుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు పెండింగ్ కేసుల విచారణను లోకాయుక్త, ఉప లోకాయుక్తలు వేగిరం చేయాలని ఫిర్యాదు దారులు కోరుతున్నారు.




నాలుగు నెలలుగా లోకాయుక్త ఖాళీ

తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్తల పోస్టులను గత నాలుగు నెలలుగా ఖాళీగా ఉండటంలో పలు కేసులు పెండింగులో ఉన్నాయి. 2024 డిసెంబరు 23 వతేదీన గత లోకాయుక్త, ఉప లోకాయుక్తల పదవీ కాలం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అవినీతి, అక్రమాలపై గత నాలుగు నెలల కాలంలో 480 ఫిర్యాదులు వచ్చాయని లోకాయుక్త డిప్యూటీ రిజిస్ట్రార్ కె నీరజ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

లోకాయుక్తలో పెండింగ్ కేసులు పరిష్కారమయ్యే దెన్నడు?
లోకాయుక్తలో మొత్తం మూడు వేల కేసులు పెండింగులో ఉన్నాయని ఆమె తెలిపారు. గడచిన నాలుగు నెలలుగా కేసుల విచారణ చేపట్టే వారు కొరవడటంతో లోకాయుక్త పరిపాలన విభాగం అధికారులు కేసుల విచారణకు వాయిదాలు వేశారు. లోకాయుక్తలో పెండింగు కేసులతో పాటు దర్యాప్తు చేసే డిప్యూటీ డైరెక్టర్ల అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కేసుల విచారణలో తీవ్ర జాప్యం
తెలంగాణ లోకాయుక్తలో కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2023 జనవరి 1వతేదీ నాటికి లోకాయుక్త వద్ద 2,280 కేసులు, ఉప లోకాయుక్త వద్ద 1311 కేసులు కలిపి మొత్తం 3,591కేసులు పెండింగులో ఉన్నాయి. 2023వ సంవత్సరంలో మరో 1530 ఫిర్యాదులు కొత్తవి వచ్చాయి. 2023వ సంవత్సరం డిసెంబరు నాటికి 3,605 కేసులు పెండింగులో ఉన్నాయని లోకాయుక్త విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడైంది. పలు కేసులో విచారణలోనే పెండింగులో ఉన్నాయి.

విడుదల చేయని 2024 వార్షిక నివేదిక
లోకాయుక్త గత నాలుగు నెలలుగా ఖాళీగా ఉండటంతో 2024 వార్షిక నివేదిక కూడా విడుదల చేయలేదు. లోకాయుక్త 2024 వార్షిక నివేదిక సిద్ధంగా ఉంది. కొత్తగా నియమితులైన లోకాయుక్త జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ముందుగా రాష్ట్రగవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమర్పించాక విడుదల చేస్తారని లోకాయుక్త డిప్యూటీ రిజిస్ట్రార్ కె నీరజ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



గవర్నర్ ను కలిసిన లోకాయుక్త, ఉపలోకాయుక్తలు

తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్‌ జగ్జీవన్‌ కుమార్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం వీరు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సీఎం రేవంత్ రెడ్డిని లోకాయుక్త, ఉపలోకాయుక్తలు కలిశారు. లోకాయుక్త, ఉప లోకాయుక్తలను సోమవారం తెలంగాణ డీజీపీ జితేందర్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.



Read More
Next Story