కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా.. విచారణ వాయిదా..
మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. కాగా ఒకవైపు నాగార్జున కోర్టును ఆశ్రయించినప్పటికీ.. కొండా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కఠిన చర్యలు తీసుకునేవరకు వదిలే ప్రసక్తే లేదని అఖిల్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ స్థానం, ఆమె మంత్రి పదవి పరిస్థితి ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ.. తాను రానున్న కాలంలో కూడా ఇలానే మాట్లాడతాననంటూ వివరణ ఇచ్చారు. ఇది కాస్తా.. ఆమె నమ్మకంగా చెప్తున్నారంటే.. నిజంగా ఆమె అన్నట్లు జరిగిందా అన్న అనుమానాలను కూడా కొందరు నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: నాగ్
‘‘సదరు మంత్రి తన వ్యాఖ్యలతో మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశారు. నా కుమారుడు నాగచైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. 2021లో కొన్ని అనివార్య కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ తమతమ జీవితాలను గౌరవంగా జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో తన రాజకీయాల కోసం వీరి విడాకుల అంశాన్ని పావుగా వినియోగించుకోవడం ఏమాత్రం సబబు కాదు. దశాబ్దాలు సినీ పరిశ్రమలో కానీ, ప్రజల్లో కానీ కాపాడుకుంటూ వస్తున్న మా కుటుంబ గౌరవాన్ని సైతం సదరు మంత్రి తన వ్యాఖ్యలతో దెబ్బతీశారు. ఆమె వ్యాక్యలతో మా కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
మళ్ళీమళ్ళీ మాట్లాడుతా..
కాగా తీవ్ర వివాదంగా మారిన తన వ్యాఖ్యలపై కొండా సురేఖ మరోసారి స్పందిస్తూ మళ్ళీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తానేమీ తప్పు మాట్లాడలేదని, ఇదే విధంగా అవసరమైన మళ్ళీ మళ్ళీ మాట్లాడతానని వెల్లడించారు. ‘‘నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారో ఎవరికైనా తెలుసా? ఎవరైనా ఒక్కమాటైనా చెప్పారా? నాగార్జున కుటుంబం నుంచి ఎటువంటి సమాచారమైనా బయటకు వచ్చిందా? ఒక ఆడపిల్లగా సమంత తన విడాకుల గురించి చెప్పుకోగలదా? నేను చెప్పింది వాస్తవం అని నేను కూడా అనడం లేదు. కానీ నాకున్న సమాచారం మేరకే నేను వ్యాఖ్యలు చేశాను. నేను ఏదైనా ఉన్నది ఉన్నట్లే మాట్లాడతా. నాకు ఉన్న సమాచారాన్ని బయటపెట్టడాన్ని భయపడను. ఇటువంటి సమాచారం మరేదైనా భవిష్యత్తులో నాకు తెలిస్తే అప్పుడు కూడా ఇలానే మాట్లాడతా. అందులో సందేహం లేదు’’ అని ఆమె స్పష్టం చేశారు.
అవన్నీ అబద్ధాలే..: నాగచైతన్య
కొండా సురేఖ వ్యాఖ్యలను హీరో నాగచైతన్య తోసిపుచ్చారు. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ‘‘జీవితంలో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన పని. బాధాకరమైనది కూడా. చాలా ఆలోచించిన తర్వాతే నేను, నా మాజీ భార్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకరాంతోనే ఒక నిర్ణయం తీసుకున్నాం. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు. సమాజంలో మహిళలకు గౌరవం, మద్దతు దక్కాలి’’ అని నాగచైతన్య తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు కొండా సురేఖ మంత్రి కాకపోయినా.. సాటి మహిళగా అయినా ఆమె ఆలోచించి ఉండాల్సిందని, విడాకులు అనేవి ఒక మహిళ జీవితంపై ఎంత ప్రభావం చూపుతాయో ఊహించి ఉండాల్సింది అని కూడా నాగచైతన్య హితవు పలికారు.
బుద్ధి చెప్పాల్సిందే: అఖిల్
అర్థంపర్థం లేని విషయంపై స్పందించాల్సి రావడం చాలా బాధాకరమని, కానీ కొన్నికొన్ని సార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్పనిసరి అని అఖిల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ‘‘కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్దంగా, అతి జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గు చేటు. ఆమె మాటలు మా కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశాయి. ఆమె తన స్వార్థ రాజకీయాల కోసం ఎటువంటి సంబంధం లేని మా కుటుంబాన్ని లాగడం సహించదగినది కాదు. ఆమె తన రాజకీయ క్రీడలో మాలాంటి అమాయకులను బలిపశువులను చేశారు. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఇలాంటి వ్యక్తికి న్యాయపరంగా బుద్ధి చెప్పి తీరాలి. ఇలాంటి వాళ్లకు సమాజాంలో ఉండే అర్హత లేదు. ఆమెను ఎట్టిపరిస్థితుల్లో క్షమించకూడదు’’ అంటూ అఖిల్ మండిపడ్డారు.