N కన్వెన్షన్ కూల్చివేతపై మరోసారి రియాక్టైన నాగార్జున
రెండు రోజులుగా అక్కినేని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
రెండు రోజులుగా అక్కినేని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. మాదాపూర్ లో తుమ్మిడి కుంటకి చెరువును మూడున్నర ఎకరాలు ఆక్రమించి, ఫుల్ ట్యాంక్ లెవెల్ లో హాలు నిర్మించారని హైడ్రా యాక్షన్ తీసుకుంది. శనివారం కట్టడాలను నేలమట్టం చేసింది. దీనిపై నిన్ననే స్పందించారు నాగార్జున, ఆయన ఆరోపణలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కౌంటర్ ఇచ్చారు.
"స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
అయితే నాగార్జున వ్యాఖ్యలకి రంగనాథ్ కూడా కౌంటర్ ఇచ్చారు. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామన్నారు. హైకోర్టు స్టే ఉందనడం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదని స్పష్టం చేశారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) లో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేసామన్నారు. చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని రంగనాథ్ తెలిపారు. గతంలోనే అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ రిక్వెస్ట్ ను తిరస్కరించారని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అయితే, నాగార్జున మేము చట్టప్రకారమే నిర్మాణాలు చేపట్టాము, చెరువు కబ్జా చేయలేదని చెబుతున్నా ఎవరూ విశాల హృదయంతో నమ్మడం లేదు. విమర్శలు గుప్పిస్తున్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకుని కన్వెన్షన్ సెంటర్ జోలికి ఎవరూ రాకుమన్ద మేనేజ్ చేశారు. ఇప్పుడు ఆ పప్పులు ఉడకలేదు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి నాగార్జున లైన్లోకి వచ్చారు. డ్యామేజ్ పూడ్చుకునేందుకు ఇంకొక ట్వీట్ వదిలారు.
"ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ, N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం, నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను" అని నాగార్జున ఎక్స్ ద్వారా వెల్లడించారు.