కొనసాగుతున్న మూసీ మార్కింగ్.. అడ్డంతిరిగిన జనం..
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ముసీ పరివాహక ప్రాంతాల్లో రివర్ బెడ్ నిర్మాణాలను గుర్తించే పనుల్లో అధికారులు ఫుల్ బిజీ అయ్యారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ముసీ పరివాహక ప్రాంతాల్లో రివర్ బెడ్ నిర్మాణాలను గుర్తించే పనుల్లో అధికారులు ఫుల్ బిజీ అయ్యారు. మూసీ పరివాహక ప్రాంతాలన్నింటిలో సర్వేలు చేసి.. పలు కట్టడాలకు మార్కింగ్ చేస్తున్నారు. దాదాపు 16 బృందాలు పలు ప్రాంతాల్లో ఈ సర్వేను చేస్తున్నాయి. ఒక్కసారి సర్వే పూర్తయితే.. వెంటనే అధికారులు తమ బుల్డోజర్లకు పని చెప్పనున్నారు. ఈ క్రమంలో మూసీ నిర్వాసితులు అధికారులను అడ్డుకుంటున్నారు. సర్వే చేయడానికి వీళ్లేదని, మార్కింగ్ చేయొద్దంటూ అడ్డగించి వెనక్కు పంపుతున్నారు. పలు ప్రాంతాల్లో గురువారం ఇదే పరిస్థితి నెలకొనడంతో ఈ రోజు సర్వే అధికారులు భారీ బందోబస్తుతో పరివాహక ప్రాంతాలకు చేరుకున్నారు. పోలీసు భద్రత నడుమ వారు నిర్మాణాల మార్కింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో అక్కడ స్థానికులు, అధికారుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇల్లు కూలిస్తే తమకు చావే శరణ్యం అంటున్నారు నిర్వాసితులు. కాగా ఇప్పటికే ఈ అంశంలో మూసీ నిర్వాసితులకు బీజేపీ కార్పొరేటర్ల, నేతలు సంఘీభావం తెలిపారు. నిర్వాసితులకు తాము అండగా ఉంటామని ఈటెల రాజేందర్ భరోసా ఇచ్చారు.
పెట్రోల్ పోసుకున్న యువకుడు..
మూసీ ప్రాంతంలో సర్వే చేసే అధికారులను అడ్డుకోవడంలో భాగంగా ఓ యువకుడు తన ఒంటిపై పెట్రోలో పోసుకున్నాడు. ఈ ఘటన చైతన్యపురి సత్యనగర్‌లో చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ‘‘నా భార్య 9నెలల గర్భిణీ. ఇప్పుడు మా ఇల్లు కూల్చస్తే నేను, నా భార్య ఎక్కడి పోవాలి’’ అంటూ అతడు కన్నీరుమున్నీరయ్యాడు. ఈ నేపథ్యంలోనే తమకు ముందు పునరావాసం చూపాలని, ఆ తర్వాత సర్వే చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ‘‘మీ మానాన మీరు కూల్చుకుంటూ పోతే రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇళ్లు. ఒక్కసారి రోడ్డున పడేస్తా ఎక్కడి పోవాలి. పునరావసం కల్పించిన తర్వాతే సర్వేలైనా, కూల్చివేతలైనా చేయాలి’’ అని పలువురు స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాదుకూడదు.. కూల్చడమే మా పని అంటే మాత్రం తమ శవాలపై నుంచే బుల్డోజర్లు వెళ్లాల్సి ఉంటుందని కూడా స్థానికులు హెచ్చరిస్తున్నారు.
కూల్చివేతలకు రేపే ముహూర్తమా..
మూసీ పరివాహక ప్రాంతాల్లో చేస్తున్న సర్వే వేగం పెంచడంతో ఈ శనివారం, ఆదివారాల్లోనే అక్కడ కూల్చితేలు చేపట్టాలని హైడ్రా ప్లాన్ చేస్తోందని అంటున్నారు. బాధితులు ఈరోజు మార్కింగ్ పూర్తి చేసుకుని శనివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు షురూ చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారన్న వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గురువారం రోజున సర్వే చేసిన అధికారులు దాదాపు 12 ఇళ్లను ఖాళీ చేయించారు. మరికొన్ని ఇళ్లను ఖాళీ చేయించడానికి కూడా ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూల్చడానికి సన్నాహాలు చేస్తున్నారని గ్రహించి స్థానికులు.. అధికారులను అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లను కూల్చే అధికారం ఎవరిచ్చారని నిలదీస్తున్నారు.