Mulugu Encounter | విషం ఇచ్చి చంపారు, మావోయిస్టుల సంచలన లేఖ
x

Mulugu Encounter | విషం ఇచ్చి చంపారు, మావోయిస్టుల సంచలన లేఖ

ఓ విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే చల్పాక అడవుల్లో ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా కాల్చి చంపారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు.


ములుగు జిల్లా ఏటూర్ నాగారం చల్పాక గ్రామ పోల్ కమ్మవాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా కాల్చి చంపారని(Mulugu Encounter) మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.


భోజనంలో విషం కలిపారు...
‘‘నవంబరు 30వతేదీన సాయంత్రం ఏడుగురితో ఉన్న మా దళం చల్పాక అడవుల్లో ఉన్న ఆదివాసీ గ్రామానికి వచ్చి భోజనాలు ఏర్పాటు చేయమని కోరింది. ముందుగానే పోలీసులకు అప్రూవర్ గా మారిన ఇన్ ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు, స్పృహ కోల్పోయిన కామ్రేడ్లను పట్టుకొని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 గంటలకు అతి సమీపం నుంచి కాల్చి చంపారు’’అని జగన్ తన ప్రకటనలో తెలిపారు.

అమరులకు విప్లవ జోహార్లు
ములుగు అడవుల్లో పోలీసుల మోసపూరిత వ్యూహంలో చిక్కి ప్రజల కోసం ప్రాణాలర్పించిన కామ్రేడ్లు కురుసం మంగు అలియాస్ పాపన్న,తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బద్రు,కోటి జెఎం డబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్యుడు ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు, ఇల్లెందు నర్సంపేట్ ఏరియా కమిటీ సభ్యుడు ముచాకీ అందాల్ అలియాస్ కరుణాకర్,ఏరియా కమిటీ సభ్యురాలు ముచాకీ బూమే అలియాస్ జమున,రీజనల్ కంపెనీ -2 మొదటి ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు పూనెం చోటు అలియాస్ కిశోర్, రీజనల్ కంపెనీ -2లోని రెండవ ప్లటూన్ సభ్యుడు కర్ణం కామాల్, ఏటూర్ నాగారం మహదేవ్ పూర్ ఏరియా దళం సభ్యుడు జైసింగ్ లకు రాష్ట్ర మావోయిస్టు కమిటీ విప్లవ జోహార్లు అర్పించింది.

డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు
కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యాకాండకు నిరసనగా డిసెంబరు 9వతేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ కు మావోయిస్టు కమిటీ పిలుపు ఇచ్చింది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, వ్యాపార సంస్థలు బందును పాటించాలని జగన్ కోరారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం,ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాలని, దీనిపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్ కమ్మవాగు వరుస ఎన్ కౌంటర్లను మేధావులు ఖండించాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ కోరారు.

పదేళ్లలో 44 ఎన్ కౌంటర్లు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పదేళ్లలో జరిగిన 44 ఎన్ కౌంటర్లలో 96 మంది మావోయిస్టులు మరణించారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక 2015వ సంవత్సరం నుంచి 22 మంది మావోయిస్టులు కాల్పుల్లో మరణించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి చెందిన నలుగురు సభ్యులు మరణించారు. మావోయిస్టుల కోసం 21 కంపెనీల కేంద్ర బలగాలు, యాంటీ మావోయిస్టు దళం, గ్రేహౌండ్స్ బృందాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరోలు గాలింపు చేపట్టాయి.










Read More
Next Story