అడ్డుపడితే బుల్డోజర్లతో తొక్కించి మూసీని ప్రక్షాళన చేస్తా:సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన జన్మదినోత్సవం సందర్భంగా మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర చేశారు.సంగెం నుంచి భీమలింగం వరకు పాదయాత్రలో సీఎం ప్రసంగించారు.
మూసీ కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాను పరిరక్షిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎంతో మందితో చర్చించిన తర్వాతనే తాను మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టానని సీఎం పేర్కొన్నారు. మూసీ కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరమైనదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తుందని సీఎం ఆరోపించారు.
- బీఆర్ఎస్ పార్టీకి దోచుకోవడమే తెలుసునని, ప్రజల కష్టాలు పట్టవన్నారు. నరేంద్రమోదీ గంగా నదీ ప్రక్షాళన చేస్తే, తాను మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ రోజు తన జన్మదినం కాదని, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుతో తన జన్మ ధన్యం కాబోతుందని రేవంత్ పేర్కొన్నారు.
- మూసీ ప్రక్షాళన చేపట్టకుంటే తన జన్మ ఎందుకని ఆయన ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టులో 25వేల కోట్లు తిన్నానని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని సీఎం అన్నారు.ఎవరు అడ్డుపడినా బుల్డోజర్లతో తొక్కించి అయినా మూసీ నదిని ప్రక్షాళన చేస్తానని సీఎం చెప్పారు. వేలమంది ప్రజలు తనకు అండగా నిలబడ్డాక, సంగెం శివయ్య, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా మూసీనదిని ప్రక్షాళన చేస్తానని సీఎం ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
మూసీ నదిలో రూపాయి బిళ్ల వేస్తే కనింపించేదని ఇక్కడి ప్రజలు చెప్పారు, మూసీ నదిలో నీరు కలుషితమై కులవృత్తులు చేసుకునేవారు, రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు. ఫ్లోరైడ్ బాధతో పాటు మూసీ కాలుష్యంతో బాధపడుతున్నారని సీఎం చెప్పారు.నల్గొండ జిల్లా ప్రజలు రజాకార్లను దిగంతాలకు తరిమికొట్టిన చరిత్ర ఉందన్నారు. పౌరుషం నింపిన నల్గొండ గడ్డ నుంచి వారి స్ఫూర్తితో మూసీని ప్రక్షాళన చేసుకుందామని చెప్పారు. తన పదవి ఎవరి దాయా దాక్షిణ్యాల వల్ల వచ్చింది కాదని, ప్రజలు ఇచ్చిన అధికారం అన్నారు.నల్గొండ ప్రజలు బీఆర్ఎస్ కు ఓట్లేయలేదని కేసీఆర్ కక్ష కట్టారని సీఎం ఆరోపించారు. 2025 జనవరిలో చార్మినార్ వద్ద సభ పెడతామని, ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా చూపిస్తానని సీఎం చెప్పారు. శివయ్య సాక్షిగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును పూర్తి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. వాడపల్లి నుంచి జనవరిలో పాదయాత్ర చేస్తానని, 30 రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ చేస్తామని సీఎం ప్రకటించారు.
సీఎంకు గ్రామస్థుల ధన్యవాదాలు
మూసీ కాలుష్యం వల్ల బర్రెలు చనిపోతున్నాయని, పంటలు కూడా సరిగా పండటం లేదని సంగెం గ్రామస్థులు ఆవేదనగా చెప్పారు.కుమ్మరులు, గొర్రెలు కాసుకునేవారు, రైతులు బాగుపడతారని రైతులు చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి సంగెం గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. మూసీ పునరుజ్జీవనంపై సంగెం వాసి రాసిన పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు నడుం కట్టారని ఎమ్మెల్యే చెప్పారు. బోటులో సీఎం ప్రయాణిస్తూ మూసీని పరిశీలించారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.
Hon'ble CM A. Revanth Reddy Participates in Musi Rejuvenation Sankalpa Padayatra Along the Musi River, Sangem https://t.co/KbuLFKDOrv
— Telangana CMO (@TelanganaCMO) November 8, 2024
Next Story