మూసీ, హైడ్రా బాధితుల కన్నీటి వ్యథ
మూసీనదీ బాధితులు, హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు వచ్చి తన్నీరు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిల ముందు కన్నీరుమున్నీరుగా రోదిస్తూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.
‘పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలగొడితే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండె ఆగిపోతుంది’’ అని మూసీ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
- ‘‘మా ఇళ్లకు మార్కింగ్ ఇస్తూ కూలగొడుతామంటున్నారు, దీనివల్ల కంటిమీద కునుకు ఉండట్లేదు, మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కావట్లేదు’’ అని మరో హైడ్రా బాధితురాలు రోదిస్తూ చెప్పారు.
- ‘‘పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నాం, అన్నం కూడా తిన్మామో లేదో మాకే తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో క్షణక్షణం భయంతో గడపవలసి వస్తుంది.
గొంతులో అన్నం దిగట్లేదు.దయచేసి మాకు న్యాయం చేయండి ’’ అంటూ మరో బాధితుడు విలపించారు.
- ‘‘అసలు మేం ఇల్లు కొన్నప్పుడు ఇలాంటివి ఏవీ మాకు తెలియదు, లక్షల కొద్ది బ్యాంకు లోన్లు తెచ్చి, ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు ఇల్లు కూల్చేస్తే మా పిల్లలు రోడ్డున పడతారు.
తెల్లారితే అసలు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. టీవీ చూస్తుంటే భయం అవుతుంది’’ అని మరో బాధితురాలు ఆవేదనగా చెప్పారు.
- ‘‘ప్రభుత్వమే మమ్మల్నీ మోసం చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే, మా సొంత జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఇలా అక్రమంగా ఇళ్లు కూల్చేయడం సరికాదు.నాకు కళ్ళు కనిపించవు.. మా బాధ చెప్పుకుందాం అని ఇక్కడికి వచ్చాను’’ అంటూ ఓ వృద్ధుడు ఆవేదనగా చెప్పారు.
- ‘‘ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చి కరెంట్ బిల్ ఇచ్చి, టాక్స్ కట్టించుకుంటూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద బ్యాంకులు లోన్లు ఇచ్చిన ఇళ్లను అక్రమం అని కూలగొడితే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ’’అని మరో బాధితుడు ప్రశ్నించారు.
బుచ్చమ్మది ఆత్మహత్య కాదు హత్యే : మాజీ మంత్రి హరీష్ రావు
కూకట్ పల్లిలో హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, అది రేవంత్ రెడ్డి చేసిన హత్య అని మాజీమంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.బుచ్చమ్మ ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి పెళ్లిళ్లు చేసిందని, ఆ ఇల్లు కూలగొడితే తన బిడ్డల భవిష్యత్తు ఏం అవుతుందని బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆయన వాపోయారు. మొన్న కూడా ఒక ఇల్లు కూలకొట్టే సరికి ఒకరు గుండె పోటుతో చనిపోయిందన్నారు.
కన్నీరుమున్నీరవుతున్న బాధితులు
తెలంగాణ భవన్ లో తమ ఆవేదన చెప్పుకుంటూ హైడ్రా బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.‘‘రేవంత్‌రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు. పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నావ్’’ అని హరీష్ రావు విమర్శించారు. హైడ్రా హైడ్రొజన్ బాంబులా మారిందని దీనివల్ల ఎవరికీ కంటిమీద కునుకులేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.తెలంగాణలో రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని చెప్పారు.‘‘మీరు దేశమంతా తిరిగి బుల్డోజర్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు.ముందు తెలంగాణాలో బుడ్జోజర్ రాజ్‌ను ఆపండి’’ అంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు.
బాధితులకు అండగా బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం
తెలంగాణ భవన్‌లో 24 గంటలు బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం బాధితుల సహాయం కోసం ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు.‘‘మీకు మేమంతా రక్షణ కవచంగా నిలబడతాం.మీరు ఫోన్ చేస్తే.. మేం మీకు అండగా నిలబడతాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు’’ అని హరీష్ రావు బాధితులకు భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో హరీశ్ రావు సమావేశమయ్యారు.బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు వస్తుందన్నారు.
అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి...
హైదరాబాద్ ఖ్యాతిని సీఎం రేవంత్ దెబ్బ తీస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాతే మూసీపై ముందుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.హైడ్రా బాధితులంతా తమ కుటుంబ సభ్యులని, మీ కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు.
పెద్దలకో నీతి, పేదోడికి ఓ నీతా?
రేవంత్‌రెడ్డి సోదరునికి నోటీసులిచ్చి 45 రోజులు టైం ఇస్తారా.. పేదోడికైతే రాత్రిరాత్రికే వచ్చి బుల్డోజర్లతో కూలగొడతారా? అని హరీష్ రావు ప్రశ్నించారు.‘‘గత కాంగ్రెస్ హయాంలోనే బాధితులంతా ఇళ్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు.కష్టంతో భూములు కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.మున్సిపాలిటీల కెళ్లి పర్మిషన్ తీసుకున్నారు. ఇళ్లు కట్టుకునేందుకు బ్యాంకు కెళ్లి లోన్‌లు పెట్టుకున్నారు. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టారు.ఇప్పుడు వాటిని కూల్చడం అన్యాయం’’ అని హరీష్ రావు ప్రశ్నించారు.
LIVE: తమ గోడు చెప్పుకోవడానికి తెలంగాణ భవన్ కు వచ్చిన హైడ్రా బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న మాజీ మంత్రులు @BRSHarish, @BrsSabithaIndra.https://t.co/nmDPVB2OFc
— BRS Party (@BRSparty) September 28, 2024
Next Story