హైదరాబాద్‌లో మంకీపాక్స్ అలర్ట్.. ప్రత్యేకవార్డులు,మెడికల్ కిట్స్ రెడీ
x

హైదరాబాద్‌లో మంకీపాక్స్ అలర్ట్.. ప్రత్యేకవార్డులు,మెడికల్ కిట్స్ రెడీ

కేరళ,ఢిల్లీల్లో మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి.దీంతో వైద్యఆరోగ్యశాఖ అలర్ట్ అయింది.గాంధీ,ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేకవార్డులు, మెడికల్ కిట్స్‌ను సిద్ధం చేశారు.


ఆఫ్రికా దేశంలో వ్యాప్తి చెందిన మంకీపాక్స్ భారతదేశంలోనూ కలకలం రేపుతోంది. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో 15 మంకీపాక్స్ కేసులు నమోదైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది.

- హైదరాబాద్ నగరంలో ఆఫ్రికన్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున, ఇది అంటువ్యాధి కావడంతో ప్రబలే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరించారు.
- తెలంగాణలో మంకీపాక్స్ రోగుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వారికి అందించేందుకు మెడికల్ కిట్లను సిద్ధం చేశారు.
మంకీపాక్స్‌పై ఆరోగ్యశాఖ సమాయత్తం
మంకీపాక్స్ పై వైద్యఆరోగ్యశాఖను సమాయత్తం చేశామని తెలంగాణ వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. ఈ వైరస్ నివారణపై మంత్రి ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రుల్లో మంకీపాక్స్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆర్వీ కర్ణన్, అజయ్ కుమార్, రవీందర్ నాయక్ లతో మంత్రి ఎంపాక్స్ సన్నద్ధతపై సమీక్షించారు. ఈ వైరస్ నివారణకు కావాల్సిన మందులను వైద్యఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంచింది. దీంతోపాటు మంకీపాక్స్ మెడికల్ కిట్లను కూడా రెడీగా ఉంచామని మంత్రి పేర్కొన్నారు.

ఆఫ్రికాలో 17,500 కేసులు
ఆఫ్రికా దేశంలో ఇప్పటికే 17,500 మంకీ ఫాక్స్ కేసులు నమోదయ్యాయి.ఈ మహమ్మారి వల్ల 460 మంది మరణించారు.ఇది అంటువ్యాధి కావడంతో పాటు ఆఫ్రికన్ విద్యార్థులు హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఉన్నందున డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికతో హైదరాబాద్ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
-ఆఫ్రికన్ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి వచ్చి ఉన్నందున, ఈ అంటు వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.ఉన్నత విద్య అభ్యసించే ఆఫ్రికన్ విద్యార్థులకు హైదరాబాద్ ప్రముఖ గమ్యస్థానంగా ఉంది.

అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ రామమోహన్ రావు
ఆఫ్రికా దేశం నుంచి హైదరాబాద్ కు విద్యార్థులు వచ్చినందున,మంకీఫాక్స్ వైరల్ ఇన్‌ఫెక్షన్ గురించి సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ నగరానికి చెందిన ఆశ్రిత ఆసుపత్రి డాక్టర్ రామ్మోహన్ రావు చెప్పారు.ఉస్మానియా యూనివర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీతోపాటు పలు ప్రాంతాల్లో ఆఫ్రికన్లు నివశిస్తున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

రోగుల కోసం ప్రత్యేకవార్డు సిద్ధం చేశాం : గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
హైదరాబాద్ నగరంలో ఆఫ్రికా విద్యార్థుల వల్ల మంకీఫాక్స్ వైరస్ ప్రబలినట్లు ఎలాంటి కేసులు రాలేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.అయితే మంకీపాక్స్ రోగుల చికిత్స కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశామని, ఎంపాక్స్ మెడికల్ కిట్లను సిద్ధంగా ఉంచామని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్ గురించి హైదరాబాద్ లో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని డాక్టర్ రాజారావు కోరారు.

కాంగో నుంచి విస్తరిస్తున్న మంకీపాక్స్
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో మంకీపాక్స్ మొట్టమొదటిసారి వెలుగుచూసింది. ఈ అంటు వ్యాధి చుట్టుపక్కల ఆఫ్రికా దేశాలకు వ్యాప్తి చెందింది. కోవిడ్ -19 కంటే ప్రమాదకరమైన మంకీపాక్స్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించింది. మంకీపాక్స్ కారక వైరస్ క్లేడ్ 1 బీ అత్యంత ప్రమాదకరమైనదని వైద్యులు గుర్తించారు.పాకిస్థాన్ దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. సౌదీఅరేబియాలోని జెడ్డా నుంచి వచ్చిన పాకిస్థాన్ వాసికి ఈ వైరస్ సోకిందని పాక్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

భారతదేశానికి వ్యాపించిన వైరస్
మొదటి సారి ఈ వైరస్ పాకిస్థాన్, స్వీడన్, భారతదేశాల్లోకి పాకింది. దీంతో విమానాశ్రయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఈ వైరస్ పై అప్రమత్తత ప్రకటించింది. బురుండి, కెన్యా, రువాండా, ఉగాండా దేశాల్లో ఈ వైరస్ ప్రబలుతోంది. ఆఫ్రికా దేశం కూడా ఈ వైరస్ పై పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇప్పటికే మన దేశంలో 15 మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి.

ఈ వైరస్ ప్రాణాపాయం
గతంలో ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన మశూచికి (స్మాల్ పాక్స్) మంకీపాక్స్ కు పోలిక ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎలుకలు, చింపాంజీలు,కుందేళ్ల నుంచి సోకే మంకీపాక్స్ మనుషులకు ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధిలా వ్యాపిస్తుంది.పిల్లలు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి ఈ వైరస్ ముప్పు ఎక్కువ. ఈ వైరస్ సోకితే ప్రాణాపాయం కూడా ఉంటుంది.

ఎంపాక్స్ లక్షణాలు
జ్వరం, చర్మంపై నొప్పితో కూడిన దద్దర్లు, పొక్కులు ఏర్పడటం మంకీపాక్స్ లక్షణం.ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక 7 నుంచి 17 రోజుల్లో దద్దుర్లు వస్తాయి. తీవ్ర జ్వరంతోపాటు ఒళ్లు,కీళ్ల నొప్పులు,తలనొప్పి ఉంటుంది. గొంతునొప్పి,గొంతులో గరగరతో రోగికి బాధ ఉంటుందని వైద్యులు చెప్పారు.

ఈ వైరస్ కు మశూచి టీకా
మంకీపాక్స్ సోకినా తీవ్రంగా ఉండకుండా ముందు జాగ్రత్తగా కొన్ని దేశాల్లో ఇప్పటికే మశూచి టీకాను తీసుకుంటున్నారు. ఈ టీకా వల్ల ఎంపాక్స్ సోకినా నాలుగు రోజుల్లో తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

ముందుజాగ్రత్తలు
మంకీపాక్స్ వైరస్ సోకిన వారి ఉమ్మి, మూత్రం, శరీర ద్రవాలు చర్మానికి తగిలితే ఈ వైరస్ వస్తున్నందున వ్యాధిగ్రస్థులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. చర్మానికి అయిన గాయాల ద్వారా కూడా ఈ వైరస్ సోకే ప్రమాదమున్నందున వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలి. ఈ వైరస్ సోకిన వారితో లైంగిక సంపర్కం చేయకూడదు.

విమానాశ్రయాల్లో అలర్ట్
దేశంలోని విమానాశ్రయాలు,పాకిస్థాన్, బంగ్లాదేశ్ నౌకాశ్రయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ రోగులు కనిపిస్తే వెంటనే తెలపాలని కోరింది. ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా,సఫ్దర్ జంగ్, లేడీ హార్డింగ్ ఆసుపత్రుల్లో ఎంపాక్స్ రోగుల చికిత్స కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.


Read More
Next Story