మెరిసిన మిస్ వరల్డ్ అందాలభామలు
x
పార్కులో సేదతీరుతున్న అందాల భామలు

మెరిసిన మిస్ వరల్డ్ అందాలభామలు

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు శుక్రవారం పిల్లలమర్రి,ఎక్స్‌పీరియంలలో సందడి చేశారు.


ఏడు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు శుక్రవారం సందడి చేశారు. హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ బృందం శుక్రవారం పిల్లలమర్రిని సందర్శించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ కు చేరుకున్నారు. తెలంగాణ పండుగల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ నృత్యాల మధ్య సుందరీమణుల బృందానికి స్వాగతం పలికారు. మొదట శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామిని అందాల భామలు దర్శించుకున్నారు. అనంతరం మ్యూజియాన్ని సందర్శించారు. కాసేపు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.




గిరిజన యువతుల బంజారా నృత్యం చేయగా, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వారితో జత కలిశారు.తర్వాత పిల్లలమర్రి మహావృక్షాన్ని వీక్షించారు. చెట్టు చరిత్ర, మహావృక్షం పునరుజ్జీవనం గురించి అటవీ శాఖ అధికారి వారికి వివరించారు. నారాయణపేట, గద్వాల చేనేత వస్త్రాలు, హస్తకళలు, కళాకృతులు స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం మర్రి చెట్టు వద్ద గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం మొక్కలు నాటారు.




ఎక్స్‌పీరియం ఎకో-టూరిజం పార్కులో...

మిస్ వరల్డ్ ఆసియా-ఓషియానియా గ్రూప్ నుంచి 24 మంది పోటీదారులు, మిస్ వరల్డ్ 2024, చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవాతో కలిసి అద్భుతమైన ఎక్స్‌పీరియం ఎకో-టూరిజం పార్క్‌ను సందర్శించారు. 250 ఎకరాలలో విస్తరించి ఉన్న ఎక్స్‌పీరియంలో అందాల భామలు సేదతీరారు.అందాలభామలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని, లయబద్ధమైన లయలకు అనుగుణంగా నృత్యం చేశారు.సన్‌డౌనర్ పాయింట్ ,బుద్ధ ఇన్‌సైడ్ ట్రీ స్పాట్, రెడ్ టైల్ ఫార్మేషన్ స్పాట్ ,ఓవల్/గొడుగు ఆకారంలో ఉన్న ట్రీ స్పాట్,ఈజిప్షియన్ రాక్ స్పాట్ లను వీక్షించారు.


Read More
Next Story