గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్, ఇక జీసీసీ కాంబో గిఫ్ట్ ప్యాకెట్లు
తెలంగాణలో జీసీసీని బలోపేతం చేయడానికి ఆ సంస్థ ఛైర్మన్ కొట్నాక తిరుపతి ప్రణాళిక రూపొందించారు.స్వచ్ఛమైన తేనే, చింతపండు విక్రయాలకు కొత్త ఔట్ లెట్లు తెరవనున్నారు.
తెలంగాణ గిరిజన సహకార సంస్థను(జీసీసీ) బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు ఆ సంస్థ ఛైర్మన్ కొట్నాక తిరుపతి ‘ఫెడరల్ తెలంగాణ’కు వెల్లడించారు. వినియోగదారులకు అటవీ ప్రాంత ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించడంతోపాటు గిరిజనుల ఉపాధి కల్పన కోసం తాము జీసీసీని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ జీసీసీ ఛైర్మన్ గా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొట్నాక తిరుపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జీసీసీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జీసీసీ కౌంటర్ల ద్వారా అటవీ ఉత్పత్తుల విక్రయం
అటవీ ప్రాంతాల్లో గిరిజనులు సేకరించి జీసీసీ కౌంటర్ల ద్వారా స్వచ్ఛమైన తేనె, చింతపండు, మర్చి పౌడర్, సబ్బులు, షాంపూలు,మల్టీగ్రెయిన్ ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకున్నామని జీసీసీ ఛైర్మన్ కొట్నాక తిరుపతి చెప్పారు. స్వచ్ఛమైన తేనె, సబ్బు, షాంపూ, మల్టీగ్రెయిన్ ఆర్గానిక్ ఉత్పత్తులను కలిపి కాంబో గిఫ్ట్ ప్యాకెట్లు తయారు చేసి వాటిని జీసీసీ ఔట్ లెట్ల ద్వారా విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు.
అడవుల్లో గిరిజన హనీ హంటర్స్ తేనె సేకరణ
ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, మంచిర్యాల, నిర్మల్,కరీంనగర్ అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన స్వచ్ఛమైన తేనెను నిర్మల్ పట్టణంలోని జీసీసీ ప్రాసెసింగ్ యూనిట్ లో ప్రాసెసింగ్ చేసి 250,500.1000 మిల్లీ లీటర్ల సీసాల్లో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో గిరిజన హనీ హంటర్స్ సేకరించిన ముడి తేనెను డీఆర్ డిపోల ద్వారా కొనుగోలు చేసి దాన్ని నిర్మల్ ప్రాసెసింగ్ కేంద్రానికి తరలించి శుభ్రపర్చి సీసాల్లో ప్యాక్ చేసి జీసీసీ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు.
స్వచ్ఛమైన జీసీసీ తేనె విక్రయాలకు కొత్తగా ఔట్ లెట్లు
స్వచ్ఛమైన తేనెను విక్రయించేందుకు తెలంగాణలోని అన్ని టీజీ ఆర్టీసీ బస్టాండ్లలో ప్రత్యేక ఔట్ లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జీసీసీ ఛైర్మన్ కొట్నాక తిరుపతి వెల్లడించారు. ఆర్టీసీ బస్టాండ్లలో జీసీసీకి షాపులు కేటాయించాలని తాను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభావకర్ ను కోరతానని చెప్పారు. స్వచ్ఛ మైన గిరిజన తేనెకు సెలబ్రిటీలతో ప్రచారం చేపడతామని ఆయన తెలిపారు.
రెండున్నర కోట్ల రూపాయల విలువైన తేనె నిల్వ
గడచిన పదేళ్లలో జీసీసీని గత కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూసింది. దీంతో తెలంగాణలో రెండున్నర కోట్ల రూపాయల విలువైన తేనె నిల్వలు పేరుకు పోయాయని కొట్నాక తిరుపతి చెప్పారు. జీసీసీ ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు త్వరలో వివిధ ప్రాంతాల్లో ఔట్‌లెట్లను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
సెలబ్రిటీలతో జీసీసీ ఉత్పత్తులకు ప్రచారం
స్వచ్ఛమైన తేనెతోపాటు జీసీసీ అటవీ ఉత్పత్తులకు సెలబ్రిటీలతో ప్రచారం చేపట్టేందుకు జీసీసీ ప్రణాళిక రూపొందించింది.ఆదివాసీల ప్రయోజనాల దృష్ట్యా చిన్న వీడియోల్లో జీసీసీ ఉత్పత్తులను ప్రచారం చేయమని సెలబ్రిటీలను అభ్యర్థిస్తామని తిరుపతి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు, ప్రముఖ దేవాలయాలకు తేనెను సరఫరా చేసేందుకు టెండర్లు వేసేందుకు జీసీసీ ప్రయత్నాలు ప్రారంభించింది.
జీసీసీ అధికారులతో ఛైర్మన్ సమీక్ష
ఇటీవల నిర్మల్‌లోని ప్రాసెసింగ్ యూనిట్‌ను జీసీసీ ఛైర్మన్ కోట్నాక తిరుపతి సందర్శించిన సందర్భంగా జీసీసీ తయారు చేసిన తేనె ఉత్పత్తుల కార్యకలాపాలు, విక్రయాల మందగమనం గురించి అడిగి తెలుసుకున్నారు. జీసీసీ ఉత్పత్తులైన తేనె, చింతపండు, మిర్చి, సబ్బుల విక్రయ కేంద్రాల ద్వారానే కాకుండా కొత్త ఔట్‌లెట్‌ల ద్వారా కూడా విక్రయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తిరుపతి తెలిపారు.
గిరి వాటర్ విక్రయాలకు ప్రణాళిక
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మినరల్ వాటర్ విక్రయాలు పెరిగిన నేపథ్యంలో తాము జీసీసీ ఆధ్వర్యంలో గిరి వాటర్ ను విక్రయించేందుకు కొత్తగా బాట్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఛైర్మన్ కొట్నాక తిరుపతి చెప్పారు. దీంతోపాటు ప్రస్థుతం తెలంగాణలో జీసీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ పంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్ లో మరిన్ని కొత్త పెట్రోలు పంపులు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తిరువతి వివరించారు.
బియ్యం విక్రయాలకు జీసీసీ యోచన
రైతుల నుంచి జీసీసీ వరి ధాన్యాన్ని సేకరించడంతోపాటు మిల్లర్లతో కలిసి మిల్లింగ్ చేయించి జీసీసీ కేంద్రాల్లో బియ్యం విక్రయించాలని నిర్ణయించామని కొట్నాక తిరుపతి చెప్పారు. ఆర్గానిక్ తోపాటు బియ్యం సన్న రకాలను వినియోగదారులకు తక్కువ ధరలకు విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. బియ్యాన్ని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలకు తాము సరఫరా చేస్తామని తిరువతి వివరించారు.
Next Story