ఆ నాలుగు చోట్లా బీఆర్ఎస్ మూలాలే.. మిత్రులే శత్రువులైన వేళ
తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు చిత్రవిచిత్రంగా మారుతున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల మూలాలు బీఆర్ఎస్‌లోనే ఉన్నాయి.
(గోపిరెడ్డి సంపత్ కుమార్)
నిన్న మొన్నటి వరకు వారంతా ఒకే గొడుగు కింద పని చేశారు. కలిసిమెలిసి గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శ్రమించారు. మళ్ళీ అధికారంలోకి రావాలని ఆరాటపడ్డారు. ఎదుటి పార్టీలపై దుమ్మెత్తి పోశారు. అయితే కాలం మారిపోయింది. నిన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న వారే, విడిపోయి ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల తంతు చూస్తే చిత్రవిచిత్రంగా కనిపిస్తున్నది. ప్రధానంగా ఇక్కడ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్, బీజేపీలు తలపడుతున్నాయి.
ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో చూపిన ఉత్సాహాన్ని చూస్తే, పార్టీ నష్టపోయినా పర్వాలేదు కానీ పక్క పార్టీ వారిని ఆహ్వానించి టికెట్లు ఇవ్వడంపై ప్రధానంగా రెండు పార్టీల్లో అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం తెలంగాణలో బీఆర్ఎస్ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నాయకులు వలస వెళ్లడం కాదు.. ఎమ్మెల్యేలు, ఆఖరికి ఎంపీ టికెట్ దక్కిన, దక్కుతుందనుకున్న అభ్యర్థులూ వెళ్లిపోతుండడమే ఆశ్చర్యకరం. దీంతో ఓ నాలుగు నియోజకవర్గాల్లో చూస్తే.. మొత్తం బీఆర్ఎస్ మాజీలు, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే పోటీ జరగనుంది. నిన్నటి వరకు కలిసి పని చేసిన పార్టీ వారే కావడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. నాలుగు నియోజక వర్గాల్లో ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. బీఆర్ఎస్ నుంచి వెళ్లి.. బీఆర్ఎస్ పైనే పోటీ చేస్తున్న పరిస్థితి.
కేసీఆర్ అడ్డా మెదక్‌లో.....
తెలంగాణలో మెదక్ ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచిన సీటు. 2014లో సీఎం అయ్యాక ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి రెండు సార్లు ఎంపీగా కేసీఆర్ అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో, ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దింపారు. ఇక ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నీలం మధు గత మూడు నెలల క్రితం వరకు బీఆర్ఎస్ నాయకుడే కావడం గమనార్హం.
రంజిత్ రెడ్డి-కొండా నడుమ చేవెళ్ల ....
చేవెళ్ళ నుంచి గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై గెలుపొందారు. ఈసారి రంజిత్ రెడ్డికి టికెట్ ఖాయమైనా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే, బీఆర్ఎస్.. కాసాని జ్ఞానేశ్వర్‌కు టికెట్ కేటాయించింది. ఈయన అసెంబ్లీ ఎన్నికల ముందువరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. చేవెళ్లలో 2014లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి, 2018 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు మళ్లీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.
సీఎం రేవంత్ స్థానం మల్కాజ్ గిరిలో..
గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి గెలిచారు. ప్రస్తుతం అక్కడ నుంచి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి పోటీలో నిలిచారు. ఈమె భర్త ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్‌లో ఒకప్పుడు నెంబర్ 2గా చెలామణీ అయిన ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు.
వరంగల్‌లో విచిత్రం… ముగ్గురి మూలం బీఆర్ఎస్
ఒకే పార్టీ గొడుగు కింద ఎదిగిన ముగ్గురు లీడర్లు ఇప్పుడు ప్రత్యర్థులుగా పోటీపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకూ ఒకే పార్టీలో పనిచేసిన ఆ ముగ్గురు.. ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారారు. అయితే ఈ ముగ్గురు లీడర్లు కూడా కొన్ని రోజుల క్రితం వరకూ బీఆర్ఎస్‌లోనే కొనసాగడం గమనార్హం. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చింది. కానీ, ఎమ్మెల్యేగా ఉన్న శ్రీహరి కూతురుతో కలిసి కాంగ్రెస్‌లో వెళ్లారు. ఇదే స్థానంలో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, బీజేపీ అభ్యర్థిగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బరిలో నిలిచారు.
ఈయనను బీజేపీలోకి వెళ్లకుండా నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం కాలేదు. ఇక బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్‌ను ప్రకటించింది. ఇలా మల్కాజిగిరి, మెదక్, చేవెళ్ల, వరంగల్ నుంచి ఎంపీలుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ బీఆర్‌ఎస్ మూలాలు ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇది అరుదైన విషయం అంటున్నారు. మరి వీరిలో గెలిచేది ఎందరో, ఓడేది ఎందరో. గెలిచాక ఆయా పార్టీల్లో ఉండేది ఎవరో, పోయేది ఎవరో తేలాల్సి ఉంది.