
Manchu Vishnu | కలవరపడుతున్న తెలుగు సినీ ఇండస్ట్రీ
సంథ్య థియేటర్ వివాదం నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన విడుదల చేశాడు. ఇండస్ట్రీ సభ్యులను ఏమని కోరారంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కలవరంలో ఉందా? సినీ తారలంతా డైలమాలో పడ్డారా? అంటే ఇండస్ట్రీ నుంచి ఔనన్న సమాధానమే వినిపిస్తోంది. ఇందుకు తాజాగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చేసిన ప్రకటన పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనతో టాలీవుడ్ దేశమంతా హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో కూడా అర్థం కావట్లేదు. ఈ అంశం కాస్తా తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ అండ్ ఫిలిం ఇండస్ట్రీగా మారుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ అంతా కూడా హైదరాబాద్ నుంచి వాకౌట్ చేసే ఆలోచనలో ఉందన్న టాక్ కూడా స్టార్ట్ అయింది. హైదరాబాద్ నుంచి ఏపీకి షిఫ్ట్ అయిపోవాలని టాలీవుడ్ ఆలోచిస్తోందన్న చర్చ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన ఒకటి విడుదల చేశారు. నటీనటులందరినీ అలెర్ట్ చేస్తూ విష్ణు చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం కీలకంగా మారింది.
‘‘మన కళాకారులు ఎప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉంటారు. మన చిత్ర పరిశ్రమ అనేది సహకారం, సృజనాత్మకతపై ఆధారపడి నడిచే పరిశ్రమ. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన చిత్ర సీమ ఎంతో ఎదిగింది. ప్రత్యేకంగా టాలీవుడ్.. హైదరాబాద్‌లో స్థిరపడటానికి, అప్పటి సీఎం చెన్నారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రోత్సాహం అందించింది. ఈ విధంగా ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సందర్భంగా కొన్ని విషయాలను చెప్పదలచుకున్నాను’’ అని చెప్పారు.
‘‘ఇటీవల జరిగిన పరిణామాలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం కానీ, వివాదాస్పద అంశాలలో ఒక సైడ్ తీసుకోవడం కానీ చేయొద్దు. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తాను చర్యలు తీసుకుంటుంది. న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, ఐకమత్యం అవసరం’’ అని విష్ణు వివరించారు.